Share News

Prakasam Flooding: కుదుటపడని ప్రకాశం

ABN , Publish Date - Oct 31 , 2025 | 06:23 AM

మొంథా తుఫాను నుంచి ప్రకాశం జిల్లా ప్రజానీకం తేరుకోలేదు. వర్షాలు ఆగినా పైనుంచి వస్తున్న వరద ప్రవాహాలకు జిల్లాలోని పలుగ్రామాలు జలమయమయ్యాయి.

Prakasam Flooding: కుదుటపడని ప్రకాశం

  • ఉధృతంగా గుండ్లకమ్మ వరద... ఇంకా జలదిగ్బంధంలోనే పలు గ్రామాలు

ఒంగోలు/విశాఖపట్నం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను నుంచి ప్రకాశం జిల్లా ప్రజానీకం తేరుకోలేదు. వర్షాలు ఆగినా పైనుంచి వస్తున్న వరద ప్రవాహాలకు జిల్లాలోని పలుగ్రామాలు జలమయమయ్యాయి. వేలాది ఇళ్లలోకి నీరు చేరింది. గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్టును ప్రారంభించి 17 ఏళ్లు అవుతుండగా ఈ స్థాయిలో వరద రావడం ఇదే ప్రథమం. నీటి నిల్వ సామర్థ్యం 3.89 టీఎంసీలు కాగా, 3.30 టీఎంసీల వరకు నిల్వ ఉంచి మిగిలిన నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ నుంచి 98వేల క్యూసెక్కుల వరద వస్తుండగా పది గేట్లు ఎత్తి 80వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువన మూడు మండలాల్లోని పది గ్రామాల్లోకి నీరు చేరింది. మద్దిరాలపాడు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇక్కడ ఒంగోలు-దిగమర్రు హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపైకి వరద రావడంతో వెల్లంపల్లి-తాళ్లూరు, త్రోవగుంట-ఉలిచి మార్గాల్లోనూ రాకపోకలు నిలిచాయి. ఏటొడ్డు ఉప్పలపాడు చుట్టూ నీరు చేరడంతో గ్రామస్థులు బుధవారం రాత్రంతా మేడలు ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడిపారు. గురువారం సాయంత్రానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పడవల్లో వారికి ఆహారం, నీరు అందించాయి. అమ్మనబ్రోలు, వినోదరాయునిపాలెం, చేకూరపాడు, కనపర్తి తదితర గ్రామాల్లోనూ గుండ్లకమ్మ నీరు పంట పొలాలను ముంచెత్తింది. గత 24గంటల్లో సుమారు 9 టీఎంసీల నీటిని డ్యాం నుంచి దిగువకు వదిలారు. కొత్తపట్నం మండలానికి ఒంగోలుతో సంబంధాలు తెగిపోగా కొండపి మండల కేంద్రానికి ఒంగోలు నుంచి వెళ్లే అన్ని మార్గాల్లోనూ రవాణా నిలిచింది. అర్ధవీడు మండలం బోల్లుపల్లి వాగు ఉధృతికి రోడ్లు దెబ్బతిని 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో సుమారు 25వేల హెక్టార్లలో పత్తి, మిర్చి, సజ్జ, కంది, వరి పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంకా 50వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో పంటలు నీటిలోనే ఉన్నాయి.


అయితే, వర్షాలు ఆగడంతో తక్షణ సహాయక చర్యలను అధికార యంత్రాంగం ముమ్మరంగా చేసింది. బాధిత కుటుంబాలకు బియ్యంతోపాటు ఇతర సరుకులు పంపిణీ చేపట్టారు. దెబ్బతిన్న రోడ్లు, గండ్లుపడ్డ చెరువులకు అత్యవసర పనులు చేపట్టారు. ఒంగోలు నగరంలో చెర్వుకొమ్ముపాలెంలో మంత్రి స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పాతసింగరాయకొండ పంచాయతీలోని మల్లికార్జున్‌నగర్‌ గిరిజన కాలనీలో బాధితులకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌, రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య బియ్యం పంపిణీ చేశారు.

విశాఖలో బాధితులకు సాయం పంపిణీ

విశాఖ జిల్లాలో తుఫాన్‌ బాధితులకు గురువారం ఆర్థిక సాయం పంపిణీ చేశారు. ముంపు, కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్నవారిని ముందుజాగ్రత్త చర్యగా పునరావాస శిబిరాలకు తరలించిన సంగతి తెలిసిందే. వారికి ఒక్కొక్కరికీ రూ.వెయ్యి, కుటుంబానికి అత్యధికంగా రూ.3 వేలు చొప్పున అందజేశారు. జిల్లాలోని ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల్లోని 21 గ్రామాల్లో 10.77 హెక్టార్లలో వరి పంట ధ్వంసమైనట్టు అధికారులు గుర్తించారు.

Updated Date - Oct 31 , 2025 | 06:24 AM