Share News

మోహిని అలంకారంలో ప్రహ్లాదవరదుడు

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:21 AM

నల్లమల అటవీప్రాంతంలోని అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

   మోహిని అలంకారంలో ప్రహ్లాదవరదుడు
దిగువ అహోబిలంలో మోహిని అలంకారంలో ప్రహ్లాదవరదుడు

శరభ వాహనంపై ఊరేగిన స్వామివారు

ఎగువ అహోబిలంలో వేణుగోపాలస్వామిగా జ్వాలా నృసింహుడు

వైభవంగా పొన్నుచెట్టు వాహన సేవ

ఆళ్లగడ్డ(శిరివెళ్ల), మార్చి 10(ఆంధ్రజ్యోతి) : నల్లమల అటవీప్రాంతంలోని అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దిగువ అహోబిలంలో సోమవారం ప్రహ్లాదవరదస్వామి మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. మఠం 46వ పీఠాధిపతి శ్రీవణ్‌ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన విశేష పూజలు నిర్వహించారు. ఆలయ తిరువీధుల్లో స్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. నిత్య పూజల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత ప్రహ్లాదవరదస్వామి ఉత్సవమూర్తులకు వేదపండితులు పంచామృతాభిషేకం, అర్చన, హారతి నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి మండపంలో కొలువుదీర్చారు. రాత్రి ప్రహ్లాదవరస్వామిని పట్టువసా్త్రలు, పూలమాలలతో అలంకరించి శరభ వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు.

ఎగువలో పొన్నుచెట్టు వాహన సేవ :

ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామి పొన్నుచెట్టు వాహనంపై కొలువై భక్తులను అనుగ్రహించాడు. ఉదయం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి వేణుగోపాలస్వామి అలంకారంలో దర్శనం ఇచ్చారు. ఆలయ మాడవీధుల్లో వేదపండితులు ఉత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక అర్చన, పంచామృతాభిషేకం నిర్వహించారు. జ్వాలా నరసింహస్వామి ఉత్సవమూర్తిని పట్టుపీతాంబరాలతో అలంకరించి పొన్నుచెట్టు వాహనంపై కొలువుంచారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలతో ఆలయ మాడవీధుల్లో స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన, మణియార్‌ సౌమ్యనారాయణన ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి.

ఎగువ అహోబిలంలో నేడు కల్యాణం :

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవారి కల్యాణోత్సవం, గరుడ వాహన సేవ మంగళవారం వైభవంగా నిర్వహించనున్నారు. దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరదస్వామి.. వేణుగోపాలస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:21 AM