PPP Model: పీపీపీ విధానమే భేష్!
ABN , Publish Date - Dec 26 , 2025 | 04:53 AM
రాష్ట్రాల అభివృద్ధి, వివిధ రంగాల్లో మౌలిక సదుపాయాల విస్తృతికి భారీగా తోడ్పడిన పీపీపీ విధానానికి వైద్యారోగ్య రంగంలో కూడా భారీ అవకాశాలున్నాయని కేంద్రప్రభుత్వం తెలిపింది.
మంత్రి సత్యకుమార్‌కు కేంద్ర మంత్రి నడ్డా లేఖ
అమరావతి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల అభివృద్ధి, వివిధ రంగాల్లో మౌలిక సదుపాయాల విస్తృతికి భారీగా తోడ్పడిన పీపీపీ విధానానికి వైద్యారోగ్య రంగంలో కూడా భారీ అవకాశాలున్నాయని కేంద్రప్రభుత్వం తెలిపింది. వాటిని విరివిగా వాడుకునేందుకు మూడేళ్లలో చేపట్టే ప్రణాళికలను శీఘ్రంగా రూపొందించాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా.. రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌కు రెండ్రోజుల కింద వివరణాత్మకంగా లేఖ రాశారు. ఇందులో 2000వ సంవత్సరం నుంచి రవాణా, రహదారులు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ఇంధనం, పట్టణ మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో పీపీపీ ద్వారా సాధించిన విజయాలను, సత్ఫలితాలను వివరించారు. ఆరోగ్య రంగంలో పీపీపీ అమలుకు సంబంధించిన ఐదు పేజీల విధాన పత్రాన్ని పంపారు. ఈ రంగంలో పీపీపీని ప్రోత్సహించేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద వైద్య కళాశాలల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 60 శాతం సాయం అందుతుందని నడ్డా లేఖలో పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టు ఖర్చులో 80 శాతం, మొదటి ఐదేళ్లకు నిర్వహణ వ్యయంలో 50 శాతం వీజీఎఫ్ లభిస్తుందని కూడా వివరించారు. వీజీఎ్‌ఫలో కేంద్రం, రాష్ట్రాలు చెరి సగం భరిస్తాయన్నారు. ‘పీపీపీ విధానంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అందే నైపుణ్యం, సృజనాత్మకత, నిధుల సమీకరణతో విస్తృత ప్రయోజనాలు కలుగుతాయి. బాధ్యతలు, రిస్క్‌లను పంచుకోవడం ఈ విధానం ప్రధాన లక్ష్యం’ అని వెల్లడించారు. పీపీపీతో కలిగే ఏడు ప్రయోజనాలను లేఖలో ప్రస్తావించారు. ‘మౌలిక వసతులు భారీగా విస్తరిస్తాయి. సేవల నాణ్యత పెరుగుతుంది. సృజనాత్మకతకు లభించే తోడ్పాటుతో ప్రస్తుతమున్న సదుపాయాలను సమర్థంగా వినియోగించుకోవచ్చు. రిస్క్‌ను పంచుకోవడం ద్వారా ప్రాజెక్టుల స్థిరాభివృద్ధి జరుగుతుంది. జవాబుదారీతనంతో పాటు పారదర్శకతా మెరుగుపడుతుంది. అంతిమంగా నాణ్యతతో కూడిన, వేగవంతమైన సేవలు రోగులకు లభిస్తాయి’ అని వివరించారు. కేంద్రం ఇప్పటికే రూ.2 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను వీజీఎఫ్ కింద ఆమోదించిందన్నారు. 20 రాష్ట్రాల్లో 919 డయాలసిస్ సెంటర్లు పీపీపీ పద్ధతుల్లో నడుస్తున్నాయన్నారు. వైద్య రంగంలో విస్తృతంగా ఆవిష్కృతమవుతున్న పీపీపీ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రణాళికల రూపకల్పనకు, కేంద్రంతో సమన్వయానికి ప్రత్యేక పీపీపీ సెల్‌ను ఏర్పాటు చేయాలని సత్యకుమార్‌కు సూచించారు. లేఖలోని అంశాలను చదివిన సత్యకుమార్.. పీపీపీ ప్రయోజనాలను వివరించినందుకు నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పీపీపీ విధానంలో 10 వైద్య కళాశాలలను అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ తిరిగి లేఖ రాశారు. ఇందుకు కేంద్ర సహాయాన్ని కోరారు.