Kommareddy Pattabhi: ఢిల్లీలో జై కొట్టి... గల్లీలో ఫేక్ సంతకాలా
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:45 AM
ఢిల్లీలో పీపీపీ విధానానికి అనుకూలంగా సంతకాలు పెట్టి, గల్లీలో ఫేక్ సంతకాల పేరుతో హడావిడి చేయడం జగన్నాటకం కాదా...
ఫేక్ సంతకాలతో గవర్నర్‌ను కలిశారు: పట్టాభి
అమరావతి/న్యూఢిల్లీ, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘ఢిల్లీలో పీపీపీ విధానానికి అనుకూలంగా సంతకాలు పెట్టి, గల్లీలో ఫేక్ సంతకాల పేరుతో హడావిడి చేయడం జగన్నాటకం కాదా? ప్రజల్ని మోసం చేయడం కాదా..!’ అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరుల తో మాట్లాడారు. ‘వైసీపీ హయాంలో ప్రకటనలకే పరిమితమైన మెడికల్ కాలేజీలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది. పీపీపీ విధానంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు సంబంధించిన 157వ నివేదికపై ఆ కమిటీలో సభ్యుడుగా ఉన్న వైసీపీ ఎంపీ ఎం.గురుమూర్తి సంతకం చేశారు. అంటే పీపీపీ విధానానికి తాము అనుకూలమని వైసీపీ ప్రకటించినట్లు కాదా? తాము పెట్టించిన ఫేక్ సంతకాలనే గవర్నర్‌ను కలిసి సమర్పించారు’ అని పట్టాభి ఆరోపించారు.