Vijayawada: దుర్గగుడికి పవర్ కట్
ABN , Publish Date - Dec 28 , 2025 | 03:56 AM
రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానానికి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేటు లిమిటెడ్ (సీపీడీసీఎల్) అధికారులు విద్యుత్తు సరఫరాను నిలుపుదల చేశారు.
2023 ఫిబ్రవరి నుంచి 2.61 కోట్ల బిల్లు బకాయిలు
దేవస్థానానికి నోటీసులు జారీ చేసిన సీపీడీసీఎల్
స్పందించకపోవడంతో సరఫరా నిలుపుదల
రూ.2 కోట్లు చెల్లింపునకు అంగీకారం.. పునరుద్ధరణ
విజయవాడ/ఇంద్రకీలాద్రి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానానికి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేటు లిమిటెడ్ (సీపీడీసీఎల్) అధికారులు విద్యుత్తు సరఫరాను నిలుపుదల చేశారు. ఈ ఆలయానికి 10 ఎల్‌టీ, ఒకటి హెచ్‌టీ సర్వీసు (వీజేఏ257) కలిపి మొత్తం 11 విద్యుత్తు సర్వీసులు ఉన్నాయి. ఇందులో హెచ్‌టీ కనెక్షన్‌కు నెలకు రూ.11-12 లక్షల వరకూ బిల్లు వస్తోంది. 2023 ఫిబ్రవరి నుంచి ఈ కనెక్షన్‌కు సంబంధించిన బిల్లును దేవస్థానం చెల్లించడం లేదు. ఈ నెల బిల్లుతో కలుపుకుని బకాయిలు రూ.2.61 కోట్లకు చేరుకున్నాయి. బకాయిలు చెల్లించాలని సీపీడీసీఎల్ అధికారులు ప్రతినెలా నోటీసులు ఇస్తూనే ఉన్నారు. తాజాగా రెండు రోజుల క్రితం మరోసారి నోటీసు పంపారు. శనివారంలోగా బకాయిలు చెల్లించకపోతే సరఫరా నిలుపుదల చేస్తామని అందులో పేర్కొన్నారు. అయినా స్పందించకపోవడంతో విజయవాడ డీ1 (డిస్ట్రిబ్యూషన్-1) సబ్‌స్టేషన్ అధికారులు హెచ్‌టీ కనెక్షన్‌కు వెళ్లే సరఫరాను నిలుపుదల చేశారు. దీంతో ఆగమేఘాల మీద స్పందించిన దేవస్థానం అధికారులు.. శనివారం సాయంత్రంలోగా బిల్లు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సరఫరాను పునరుద్ధరించారు. సాయంత్రానికి రూ.2 కోట్లు చెక్ రూపంలో ఇస్తామని సీపీడీసీఎల్ ఎస్‌ఏవో (సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్) విజయకుమారికి సమాచారం ఇచ్చారు. చెక్కు కాకుండా డీడీ రూపంలో ఇవ్వాలని ఆమె కోరారు. అయితే శనివారం బ్యాంకులకు సెలవు కావడంతో డీడీ ఇవ్వడం సాధ్యం కాదని, సోమవారం ఎన్‌ఈఎ్‌ఫటీ ద్వారా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ మొత్తం కాకుండా ఇంకా రూ.61లక్షలు చెల్లించాల్సి ఉంది. హెచ్‌టీ కనెక్షన్‌కు మాత్రమే కాకుండా 10 ఎల్‌టీ సర్వీసులకు కూడా బకాయిలు ఉన్నాయని విద్యుత్తు అధికారులు చెబుతున్నారు. ఈ కనెక్షన్లకు సరఫరాను నిలుపుదల చేస్తామని నోటీసులు ఇవ్వడంతో దసరా శరన్నవరాత్రుల్లో రూ.50లక్షలు చెల్లించినట్టు సమాచారం.
విద్యుత్తు సమస్యకు తాత్కాలిక పరిష్కారం: ఈవో
దేవదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక చొరవతో దుర్గగుడి విద్యుత్తు సమస్య పరిష్కారమైందని ఆలయ ఈవో శీనానాయక్ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రానికి సంబంధించి విద్యుత్తు బోర్డుతో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. గతంలో ఉన్న బకాయిలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సోలార్ ప్లాంట్, విద్యుత్తు బోర్డుకు సంబంధించి అన్ని వివాదాలపై త్వరలోనే నిపుణులతో చర్చించి, శాశ్వతంగా పరిష్కరిస్తామని ఈవో స్పష్టం చేశారు.