పోస్టుమేన్ ఘరానా మోసం
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:49 AM
ఉంగుటూరు సబ్‌పోస్టాఫీసులో పనిచేస్తున్న పోస్టుమేన్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. డిపాజిటర్ల సొమ్ము రూ.50 లక్షల వరకు తీసుకుని పరారయ్యీడు. విషయం తెలుసుకున్న పోస్టల్ విజిలెన్స్ అధికారులు ఖాతాల తనిఖీలు ప్రారంభించారు. నిధుల స్వాహా నిజమేనని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పన్నెండేళ్లుగా పనిచేస్తున్న పోస్టుమేన్ శేఖర్ తమని నమ్మించి ముంచాడని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుని తమ నగదు తమకు ఇప్పించాలని వేడుకుంటున్నారు.
-డిపాజిటర్ల సొమ్ము రూ.50 లక్షలతో అదృశ్యం
-ఉంగుటూరు సబ్ పోస్టాఫీసులో వెలుగుచూసిన అవినీతి
-నిందితుడు శేఖర్‌ది ఏలూరు జిల్లా పెదపాడు
-వరసలతో పిలిచి వంచించాడని ఖాతాదారుల గగ్గోలు
-విచారణ చేపట్టిన పోస్టల్ విజిలెన్స్ అధికారులు
-ఇప్పటి వరకు విచారణలో రూ.5 లక్షల వరకు నిర్ధారణ
- కొనసాగుతున్న ఖాతాల తనిఖీలు
- మొత్తం రూ.50 లక్షల వరకు ముంచినట్టు పోలీసులకు ఫిర్యాదు
ఉంగుటూరు సబ్‌పోస్టాఫీసులో పనిచేస్తున్న పోస్టుమేన్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. డిపాజిటర్ల సొమ్ము రూ.50 లక్షల వరకు తీసుకుని పరారయ్యీడు. విషయం తెలుసుకున్న పోస్టల్ విజిలెన్స్ అధికారులు ఖాతాల తనిఖీలు ప్రారంభించారు. నిధుల స్వాహా నిజమేనని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పన్నెండేళ్లుగా పనిచేస్తున్న పోస్టుమేన్ శేఖర్ తమని నమ్మించి ముంచాడని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుని తమ నగదు తమకు ఇప్పించాలని వేడుకుంటున్నారు.
ఉంగుటూరు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) :
ఉంగుటూరు సబ్‌పోస్టాఫీసులో ఏలూరు జిల్లా పెదపాడుకు చెందిన కె.శేఖర్(37) గత 12 ఏళ్లుగా పోస్ట్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. నిత్యం గ్రామంలో ఇంటింటికీ తిరిగి ఉత్తరాలను బట్వాడా చేస్తూ అందరినీ వరసలతో పిలుస్తూ పరిచయాలు పెంచుకున్నాడు. అనతి కాలంలోనే గ్రామస్థులందరికీ నమ్మకస్తుడిగా మారాడు. ఈ క్రమంలో కూలీనాలీ చేసుకునే పేదలను టార్గెట్‌గా చేసుకున్న శేఖర్ తరచూ వారి ఇళ్లకు వెళ్లి పోస్టాఫీసు పథకాలపై అవగాహన కల్పించేవాడు. పోస్టాఫీసులో ఎంతో కొంత డబ్బును నెలనెలా పొదుపు చేసుకుంటే భవిష్యత అవసరాలకు ఉపయోగపడుతుందని నచ్చచెప్పి వారిని పొదుపు బాట పట్టించాడు. అతడి మాటలను నమ్మిన కొంతమంది మహిళలు తమ అకౌంట్ పుస్తకాలతో పాటు క్రమం తప్పకుండా కట్టాల్సిన సొమ్మును పోస్టాఫీస్‌లో జమచేయమని శేఖర్‌కు ఇచ్చేవారు. కానీ శేఖర్ ఆ డబ్బును జమ చేయకుండా చేశానని నమ్మబలికి ఖాతాదారులను మభ్యపెట్టాడు. ఇలా కొంత కాలం డిపాజిట్లను కట్టించుకుని, తన దగ్గర డిపాజిటర్లు ఉంచిన 300 పాస్ పుస్తకాలు, డిపాజిటర్లు కట్టిన నగదును తీసుకుని గత నెల 25వ తేదీన అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి శేఖర్ తమ దగ్గరకు రాకపోవటం, కనిపించకపోవటంతో ఖాతాదారులకు అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం తెలిసింది. దీంతో ఖాతాదారులు తాము మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు.
పోస్టల్ విజిలెన్స అధికారుల విచారణ
ఉంగుటూరు సబ్ పోస్టాఫీసులో జరిగిన నిధుల గోల్‌మాల్‌పై గుడివాడ సబ్ డివిజన పోస్టల్ ఇనస్పెక్టర్ భూక్యా విజయ్ నేతృత్వంలోని విజిలెన్స బృందం రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. గత నెల 25 నుంచి పోస్టాఫీసులో తనిఖీలు ప్రారంభించింది. డిపాజిటర్లను పాస్‌పుస్తకాలతో సహా పోస్టాఫీసుకు వచ్చి బ్యాలెన్స సరిచూసుకోవాలని గ్రామంలో మైక్ ప్రచారం ద్వారా చైతన్యపరిచింది. కస్టమర్ల సమక్షంలో పాస్ పుస్తకాల్లో బ్యాలెన్స, పోస్టల్ అకౌంట్‌లో నమోదైన బ్యాలెన్స సరిచూసే ప్రక్రియ వేగవంతం చేసింది.
పోస్ట్‌మాస్టర్ పనితీరుపై ఆరా
సబ్ పోస్టాఫీసులో పోస్ట్‌మాస్టర్ కె.దేవేందర్‌రావు పనితీరుపై అధికారులు ఆరా తీస్తున్నారు. పోస్ట్‌మేన్ శేఖర్ చేసిన నిర్వాకం, అవకతవకల్లో పోస్ట్‌మాస్టర్ పాత్ర ఉందని తేలితే ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సబ్ డివిజనల్ పోస్టల్ ఇనస్పెక్టర్ విజయ్ తెలిపారు.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
పోస్టాఫీసులో డిపాజిటర్ల సొమ్ము సుమారు రూ.50 లక్షలు కాజేసి పరారైన పోస్ట్‌మేన్ శేఖర్‌పై ఉంగుటూరు పోలీస్‌స్టేషన్లో పోస్టల్‌శాఖ గుడివాడ సబ్‌డివిజనల్ ఇనస్పెక్టర్ బి.విజయ్ ఖాతాదారులతో కలిసి సోమవారం ఫిర్యాదు చేశారు.
ప్రాథమిక తనిఖీల్లో నగదు మళ్లింపును గుర్తించాం
ఉంగుటూరు సబ్‌పోస్టాఫీసులో సుమారు 3 వేల ఖాతాలు ఉండగా, ఇప్పటి వరకు 600 ఖాతాల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. ఇంకా 2,400 ఖాతాలు పరిశీలించాల్సి ఉంది. మొత్తం 300 పాస్‌పుస్తకాలు పోస్ట్‌మేన్ శేఖర్ ఆధీనంలో ఉన్నాయి. ప్రస్తుతం జరిపిన ప్రాథమిక తనిఖీల్లో సుమారు రూ.5 లక్షల మేర ఫ్రాడ్ జరిగినట్లు గుర్తించాం. ఖాతాదారులు తెలిపిన వివరాల ఆధారంగా సుమారు రూ.50 లక్షల వరకు సొమ్ము గోల్‌మాల్ జరిగివుండవచ్చునని భావిస్తున్నాం. సమగ్ర విచారణ జరుపుతాం. ఖాతాదారులు కూడా సహకరించాలని కోరుతున్నాం.
- భూక్యా విజయ్, గుడివాడ సబ్ డివిజనల్ పోస్టల్ ఇనస్పెక్టర్