Share News

Posani Krishna Murali: నాతో మాట్లాడించింది ‘సాక్షి’ మీడియానే!

ABN , Publish Date - Mar 19 , 2025 | 04:27 AM

‘‘చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌లపై నాతో మాట్లాడించింది సాక్షి మీడియా వాళ్లే. అందులో తన పాత్ర ఏమీ లేదు’’ అని సీఐడీ విచారణలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి చెప్పినట్టు తెలిసింది.

Posani Krishna Murali: నాతో మాట్లాడించింది ‘సాక్షి’ మీడియానే!

  • స్క్రిప్టు, ఫొటోలు నాకు వారే ఇచ్చారు

  • నా కుటుంబం గురించి మాట్లాడటం వల్లే

  • నేను కూడా ఆవేశంలో మాట్లాడాల్సి వచ్చింది

  • ఫిలిం కార్పొరేషన్‌ చైర్మన్‌గా 8 నెలలే ఉన్నా

  • వైసీపీ నుంచి ఎటువంటి లబ్ధీ పొందలేదు

  • సీఐడీ కస్టడీలో పోసాని కృష్ణ మురళి వెల్లడి

  • సాక్షి మీడియాకు సీఐడీ నోటీసులు!

గుంటూరు, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ‘‘చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌లపై నాతో మాట్లాడించింది సాక్షి మీడియా వాళ్లే. అందులో తన పాత్ర ఏమీ లేదు’’ అని సీఐడీ విచారణలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి చెప్పినట్టు తెలిసింది. గత వైసీపీ హయాంలో హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబుపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ టీడీపీ కార్యకర్త బండారు వంశీకృష్ణ గత అక్టోబరు 9న సీఐడీ అదనపు డీజీకి ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు సీఐడీ అధికారులు పోసానిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న కర్నూలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న పోసానిని సీఐడీ అధికారులు పీటీ వారెంట్‌పై గుంటూరు తీసుకువచ్చి కోర్టులో హాజరు పరచగా కోర్టు ఆయనకు రిమాండ్‌ విధించింది. కాగా, ఆ కేసులో మరిన్ని వివరాలు, ఆధారాలు రాబట్టాల్సి ఉందన్న సీఐడీ అధికారుల అభ్యర్థన మేరకు పోసానిని మంగళవారం ఒకరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కోర్టు కస్టడీకి అనుమతించింది. దీంతో మంగళవారం ఉదయం 10 గంటలకు సీఐడీ అధికారులు గుంటూరు జిల్లా జైలు నుంచి పోసానిని అదుపులోకి తీసుకున్నారు. తొలుత జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించాక సీఐడీ కార్యాలయానికి తరలించి డీఎస్పీ గోలి లక్ష్మయ్య ఆధ్వర్యంలో పోసానిని విచారించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరిగి జిల్లా జైలుకు తరలించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు విచారణలో అధికారుల ప్రశ్నలు, పోసాని సమాధానాలు ఇవీ..


సీఐడీ: హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు ఇతర నేతలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీవద్ద ఉన్న ఆధారాలు ఏమిటి?

పోసాని: ఆరోజు నేను మాట్లాడిన అంశానికి సంబంధించి నాకేమీ తెలీదు. సాక్షి మీడియా వాళ్లే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారిచ్చిన స్ర్కిప్ట్‌నే చదివా. వారిచ్చిన ఫొటోలనే చూపించా.

సీఐడీ: మీకు ఫొటోలు, స్ర్కిప్టు ఇచ్చిన సాక్షి మీడియా వాళ్లు ఎవరు?

పోసాని: వారెవరో తెలీదు. నాకు గుర్తులేదు. కానీ, వారు ఇచ్చిన స్ర్కిప్టును నిర్ధారించుకోకుండానే మాట్లాడా. నేను ఎవరినీ తిట్టలేదు. అది మార్ఫింగ్‌ వీడియో.

సీఐడీ: గతంలో కూడా అనేకసార్లు మీరు ఇలానే మాట్లాడినట్లు వీడియోలు వచ్చాయి కదా?

పోసాని: నా కుటుంబం గురించి మాట్లాడడం వల్లే నేను కూడా ఆవేశంలో అలా మాట్లాడాల్సి వచ్చింది.

సీఐడీ: గత వైసీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందడం వల్లే ఈ విధంగా ఆ పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగా ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేశారా?

పోసాని: వైసీపీ ప్రభుత్వంలో నేనెలాంటి లబ్ధీ పొందలేదు. రెండేళ్ల కాల పరిమితి ఉన్న ఎఫ్‌డీసీ చైర్మన్‌ పదవిలో నేను 8 నెలలు మాత్రమే కొనసాగా. నెలకు రూ.మూడున్నర లక్షల జీతం వచ్చింది. అంతకుమించి నాకు ఎలాంటి లబ్ధీ జరగలేదు. వైసీపీ కోసం నేనే రూ.కోట్లు ఖర్చు చేశా.


సాక్షి మీడియాకు సీఐడీ నోటీసులు!

హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేయించి చంద్రబాబుతో పాటు ఇతర నేతలపై సాక్షి మీడియా వారే తనతో అనుచిత వ్యాఖ్యలు చేయించారని పోసాని వెల్లడించిన నేపథ్యంలో సీఐడీ అధికారులు సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఆరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయించింది ఎవరు? పోసానికి స్ర్కిప్టు రాసి ఇచ్చింది ఎవరు? మార్ఫింగ్‌ ఫొటోలు అందించింది ఎవరు? ఆరోజు పోసాని నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను కవర్‌ చేసింది ఎవరు? తదితర వివరాలు తెలియజేయాలంటూ నోటీసులు ఇవ్వనున్నారు.


Updated Date - Mar 19 , 2025 | 04:28 AM