College Privatization: చలో మెడికల్ కాలేజీ.. తుస్
ABN , Publish Date - Sep 20 , 2025 | 06:59 AM
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘చలో మెడికల్ కాలేజీ’ నిరసనలకు స్పందన కరువైంది.
జగన్ పిలుపునకు స్పందన కరువు.. ఆసక్తి చూపని వైసీపీ శ్రేణులు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘చలో మెడికల్ కాలేజీ’ నిరసనలకు స్పందన కరువైంది. పార్టీ అధినేత జగన్ స్వయంగా ఆదేశించినా ఆశించిన స్థాయిలో శ్రేణులు తరలి రాకపోవడంతో పార్టీ నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. జగన్ సహా పార్టీ ముఖ్యనేతలు ఎవరూ కనిపించకపోవడంతో పలుచోట్ల మొక్కుబడిగా నిరసనలు చేపట్టి అయ్యిందనిపించారు. వైసీపీ అధినేత జగన్ సొంతూరు పులివెందులలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల భవనాల వద్ద చేపట్టిన నిరసన నామమాత్రంగా ముగిసింది. ఆ పార్టీ ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, గోవిందరెడ్డి, రమేశ్ యాదవ్ నిరసనలో పాల్గొనలేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా నిరసనకు రాలేదు. ఇక..కృష్ణాజిల్లా మచిలీపట్నం, పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట, బాపట్ల, ఏలూరు జిల్లా కేంద్రం, రాజమహేంద్రవరం, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం రూరల్ మండలం, పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రి, అన్నమయ్య జిల్లా ఆరోగ్యవరం, శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ, నంద్యాల జిల్లాలోని నంద్యాల పట్టణం, నందికొట్కూరు, ఆళ్లగడ్డ,శ్రీశైలం, బనగానపల్లె; కర్నూలు జిల్లా ఆదోని, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వైసీపీ ఆందోళనలకు పెద్దగా స్పందన లభించలేదు. ఇదిలా ఉండగా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రశ్నించకూడదా అంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి శుక్రవారం రాత్రి జగన్ ట్వీట్ చేశారు. దీంతో రోజంతా కనిపించని జగన్.. పొద్దుపోయాక తాపీగా ఎక్స్ పోస్టుతో సరిపుచ్చడం ఏమిటంటూ వైసీపీ శ్రేణుల్లోనే అసహనం వ్యక్తమైంది.