Share News

Bar Policy 2025: బార్లకు స్పందన కరువు

ABN , Publish Date - Sep 13 , 2025 | 06:23 AM

ఎక్సైజ్‌ అధికారులు ఎంత ప్రయత్నించినా బార్‌ పాలసీకి స్పందన కనిపించడం లేదు. మొత్తం 428 బార్లకు రీనోటిఫికేషన్‌ జారీచేయగా పది రోజుల్లో పట్టుమని 11 బార్లకే నాలుగు చొప్పున దరఖాస్తులు అందాయి.

Bar Policy 2025: బార్లకు స్పందన కరువు

  • 428లో ఇప్పటికీ 11 బార్లకే నాలుగు దరఖాస్తులు

  • 17 వరకు గడువు పొడిగించిన ఎక్సైజ్‌ శాఖ... 18న లాటరీ

అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్‌ అధికారులు ఎంత ప్రయత్నించినా బార్‌ పాలసీకి స్పందన కనిపించడం లేదు. మొత్తం 428 బార్లకు రీనోటిఫికేషన్‌ జారీచేయగా పది రోజుల్లో పట్టుమని 11 బార్లకే నాలుగు చొప్పున దరఖాస్తులు అందాయి. ఇంకా 417 బార్లకు దరఖాస్తులు రావాల్సి ఉంది. షెడ్యూలు ప్రకారం ఆదివారంతో దరఖాస్తుల గడువు ముగుస్తోంది. సోమవారం లాటరీ నిర్వహించి లైసెన్సీలను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఇంకా 97 శాతం బార్లకు దరఖాస్తులు రాకపోవడంతో ఈ నెల 17 వరకు గడువు పొడిగిస్తూ ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతలో మొత్తం 840 బార్లకు నోటిఫికేషన్‌ ఇవ్వగా రెండుసార్లు గడువు పొడిగించిన తర్వాత 412 బార్లకు దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన 428 బార్లకు ఈ నెల 3న రెండో విడత నోటిఫికేషన్‌ జారీ చేశారు. దరఖాస్తుల సమర్పణకు గతంలో ఇచ్చిన దానికంటే రెట్టింపు సమయం ఇచ్చారు. అయినా పది రోజుల్లో కేవలం 11 బార్లకే దరఖాస్తులు అందాయు. తాజా ఆదేశాల్లో 18న లాటరీ నిర్వహించాలని డైరెక్టర్‌ పేర్కొన్నారు. నేడు, రేపు బ్యాంకులకు సెలవులు కావడంతో పాటు వరదలు, వర్షాలు కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే 15, 16 తేదీల్లో కలెక్టర్ల సదస్సు ఉందని, కలెక్టర్లు అందుబాటులో ఉండరని వివరించారు. కానీ ఇప్పటికే పది రోజులు గడిచిపోయినా వ్యాపారులు ముందుకు రాలేదు.


కాగా, గడువు పొడిగింపుపై ఎక్సైజ్‌ డైరెక్టర్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అయితే అందులో గురువారమే ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఒకవేళ గురువారమే ఆదేశాలు జారీచేసి ఉంటే వాటిని అదే రోజున జిల్లా అధికారులకు పంపాలి. కానీ శుక్రవారమే సాయంత్రమే అందరికీ సమాచారం అందింది. ఎక్సైజ్‌ డైరెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన నేపథ్యంలో ముందు తేదీతో ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - Sep 13 , 2025 | 06:24 AM