Share News

Rythu Bazaar: ఇవేం ఉల్లిపాయలు బాబోయ్‌

ABN , Publish Date - Sep 07 , 2025 | 04:52 AM

రైతుబజార్లలో అమ్ముతున్న ఉల్లిపాయల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నపిల్లలు ఆడుకొనే గోలీకాయల పరిమాణంలో ఉన్న నాణ్యత లేని సరుకును కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు

Rythu Bazaar: ఇవేం ఉల్లిపాయలు బాబోయ్‌

  • రైతుబజార్లకు నాణ్యత లేని సరుకు సరఫరా

  • కిలో రూ.18కి అమ్మాలని సిబ్బందికి ఆదేశం

  • తోపుడుబండ్లపై కేజీ రూ.10- 15 మాత్రమే

  • చిన్నసైజు పాయలపై ఆసక్తి చూపని జనం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రైతుబజార్లలో అమ్ముతున్న ఉల్లిపాయల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నపిల్లలు ఆడుకొనే గోలీకాయల పరిమాణంలో ఉన్న నాణ్యత లేని సరుకును కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. రైతులకు న్యాయం చేయడం కోసం నాణ్యత లేని ఉల్లిని రైతుబజార్లలో విక్రయించడం ఏమిటని మండిపడుతున్నారు. గత కొద్ది రోజులుగా కర్నూలు మార్కెట్‌ యార్డుకు ఇబ్బడిముబ్బడిగా ఉల్లి దిగుమతులు వస్తున్నాయి. అయితే క్వింటా రూ.600కు మించి పలక్కపోవడంతో రైతులు కుదేలయ్యారు. ఈ పరిస్థితిని గమనించిన సీఎం చంద్రబాబు... ఉల్లి రైతులను ఆదుకోవడానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. క్వింటా కనీస మద్దతు ధర రూ.1,200గా నిర్ణయించారు. అయితే అధికారులు మాత్రం అత్యుత్సాహంతో నాణ్యత లేని సరుకును వినియోగదారులకు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మార్కెటింగ్‌ శాఖ, మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేస్తోంది. ఈ నెల 1 వరకు 580 టన్నులు, 2నుంచి శనివారం వరకు 1,650 టన్నుల మేర కొనుగోలు చేశారు. క్వింటా రూ.1,200 చొప్పున కొనుగోలు చేస్తున్న మార్క్‌ఫెడ్‌ అధికారులు సెకండ్‌, థర్డ్‌ క్వాలిటీ (ద్వితీయ, తృతీయ రకాలు) ఉల్లిని కూడా అదే ధరకు సేకరిస్తున్నారు. వాటిని కిలో రూ.18 చొప్పున విక్రయించాలని రైతుబజార్లకు పంపుతున్నారు. రవాణా, కూలీ ఖర్చులు కలుపుకుని, కిలో రూ.15 చొప్పున తిరిగి చెల్లించాలని ఆదేశిస్తున్నారు. మొన్నటివరకూ కిలో రూ.14-15కు అమ్మిన ఉల్లి ఇప్పుడు రూ.18 అంటే ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని రైతుబజార్ల సిబ్బంది చెబుతున్నారు. లావుగా ఉన్నవి ఏరుకొని, సన్నటివి వదిలేస్తుండటంతో వాటికి తామే డబ్బు కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. నాణ్యమైన ఉల్లి రూ.100కు నాలుగైదు కిలోలు చొప్పున వీధుల్లోనే అమ్ముతున్నారని, సాంబారులో వాడే సైజు పాయలు కిలో రూ.18 చెబితే ఎవరూ కొనడం లేదంటున్నారు. చిన్న పాయలను తోపుడు బండ్లపై కిలో రూ.10-15కే ఇస్తున్నారని వినియోగదారులు పేర్కొంటున్నారు.

Updated Date - Sep 07 , 2025 | 04:53 AM