Share News

Geographical Indication: పొందూరు ఖద్దరుకు జీఐ ట్యాగ్‌

ABN , Publish Date - Dec 13 , 2025 | 04:32 AM

పొందూరు ఖద్దరుకు పూర్వ వైభవం సాధించేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు చేసిన ప్రయత్నం ఫలించింది.

Geographical Indication: పొందూరు ఖద్దరుకు జీఐ ట్యాగ్‌

  • ఫలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌ కృషి

శ్రీకాకుళం, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): పొందూరు ఖద్దరుకు పూర్వ వైభవం సాధించేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు చేసిన ప్రయత్నం ఫలించింది. పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు ప్రకటిస్తూ వాణిజ్య పరిశ్రమల శాఖ పరిధిలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ శుక్రవారం అధికారిక పత్రాన్ని జారీ చేసింది. ఈ ప్రకటనపై కేంద్ర మంత్రి, శ్రీకాకుళం జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో తయారయ్యే వస్తువులకు సహజంగా ఒక నాణ్యత సంక్రమిస్తుంది. అదే వాటి ప్రత్యేకతగా నిలుస్తుంది. ఆ విశిష్ఠతను దృష్టిలో ఉంచుకుని వాటికి మరింత ప్రాధాన్యం ఇచ్చే విధంగా ‘ది జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ ఆఫ్‌ గూడ్స్‌(రిజిస్ట్రేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌)యాక్ట్‌ 1999లో రూపొందించారు. ఈ చట్టం కింద ఒక భౌగోళిక ప్రాంతం నుంచి వచ్చే ప్రత్యేక ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు(జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌)వర్తిస్తుంది. పొందూరు ఖద్దరుకు ఈ గుర్తింపు తీసుకువచ్చేందుకు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు విశేష కృషి చేశారు. 2020 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో అప్పటి శ్రీకాకుళం ఎంపీ హోదాలో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పొందూరు ఖాదీ ఖ్యాతిని వివరిస్తూ.. జీఐ ట్యాగ్‌ను కేటాయించాలని కోరారు. కేంద్రమంత్రి అయ్యాక దీనిపై మరింత దృష్టి సారించారు. తాజాగా శుక్రవారం అధికారికంగా పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ గుర్తింపు ప్రతి అందుబాటులోకి వచ్చింది. ఇంతవరకు బాస్మతి బియ్యం, డార్జిలింగ్‌ తేయాకు, కాంచీపురం పట్టుచీరలు, పోచంపల్లి చీరలు, మైసూరు పట్టు, కొండపల్లి, నిర్మల్‌ బొమ్మలు, మైసూర్‌ శాండల్‌ సబ్బు.. ఇలా కొన్ని ఉత్పత్తులకు మాత్రమే జీఐ ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో పొందూరు ఖద్దరు చేరడంతో జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 13 , 2025 | 04:32 AM