Share News

TTD: పట్టు కాదు.. పాలిస్టర్‌

ABN , Publish Date - Dec 11 , 2025 | 03:29 AM

తిరుమల, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదానికి వినియోగించిన నెయ్యి కల్తీ.. పరకామణిలో చోరీ కేసు రాజీ..

TTD: పట్టు కాదు.. పాలిస్టర్‌

  • టీటీడీలో వెలుగుచూసిన మరో స్కామ్‌

తిరుమల, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తిరుమల, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదానికి వినియోగించిన నెయ్యి కల్తీ.. పరకామణిలో చోరీ కేసు రాజీ.. చివరికి శ్రీవారిని దర్శించే ప్రముఖులు, భక్తులకు కప్పే పట్టువస్త్రాల కొనుగోలులోనూ దగా.. పట్టు పేరిట పాలిస్టర్‌ వస్ర్తాలు కొనుగోలు చేసి మోసం చేశారు. గత పాలక మండళ్ల హయాంలో వెంకన్నను, భక్తులను అందరినీ మోసం చేశారు. అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సిల్క్‌ పేరుతో పాలిస్టర్‌ వస్త్రాలను సరఫరా చేసి భారీగా అవినీతికి పాల్పడినట్టు తాజాగా తేలింది. వ్యక్తిగత వినియోగం కోసం టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఇటీవల కొన్ని పట్టువస్ర్తాలను కొనుగోలు చేయగా కేవలం రూ.350 ధరకే లభించాయి. అయితే టీటీడీ కొనుగోలు చేస్తున్న పట్టు వస్ర్తాలు మాత్రం రూ.వెయ్యికిపైనే ధర ఉన్నాయి. దీంతో 30 రోజుల్లో విచారణ చేపట్టి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. సెప్టెంబరు 16వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా శ్రీవారిని దర్శించుకునే ప్రముఖులకు రంగనాయక మండపంలో పట్టువస్ర్తాలు కప్పి ఆశీర్వచనం చేస్తారు. అలాగే వేదాశీర్వచనం టికెట్‌ కొనే భక్తులకూ ఈ వస్ర్తాలు కప్పడం ఆనవాయితీ. టెండర్ల నిబంధనల ప్రకారం.. ఈ వస్త్రాలు స్వచ్ఛమైన మల్బరీ సిల్క్‌తోనే నేయాలి. అలాగే డెనియర్‌ పత్తిదారంతో కనీసం 31.5 డెనియర్‌ కౌంట్‌ రావాలి. ఇక ప్రతి వస్త్రంపై ఓ వైపు ‘ఓం నమో వేంకటేశాయా’ అని సంస్కృతంలో, మరోవైపు తెలుగులో ఉండాలి. అలాగే శంఖు, చక్ర నామాలను ఉంచాలి. ఓ మీటరు వెడల్పు, 2.3 మీటర్ల పొడవుతో తప్పనిసరిగా సిల్క్‌ మార్క్‌ హాలోగ్రామ్‌ ట్యాగ్‌ ఉండాలి. బోర్డు ఆదేశాల మేరకు.. విజిలెన్స్‌ విభాగం ఇటీవల తిరుపతిలో మార్కెటింగ్‌ విభాగంలో నూతన స్టాక్‌ నుంచి, తిరుమలలోని వైభోత్సవ మండపం నుంచి రెండేసి చొప్పున శాంపిల్స్‌ను సేకరించింది. ఇందులో ఒక్కొక్కటి చొప్పున రెండేసి ధర్మవరంలోని సెంట్రల్‌ సిల్క్‌ బోర్డుకు, బెంగళూరులోని సెంట్రల్‌ సిల్క్‌ బోర్డుకు పంపారు. రెండు ల్యాబ్‌ల నుంచి వచ్చిన రిపోర్టుల్లో పాలిస్టర్‌ వర్సెస్‌ పాలిస్టర్‌గా ఉండటంతో అధికారులు షాకయ్యారు. టీటీడీ నిబంధనల ప్రకారం సిల్క్‌ వర్సెస్‌ సిల్క్‌లో ఈ వస్త్రాలు ఉండాలి. అలాగే వస్త్రాలపై సిల్క్‌మార్క్‌ హాలోగ్రామ్‌ కూడా లేనట్టు తేలింది.


ఒకే సంస్థ నుంచి వేలాది వస్ర్తాలు.. తిరుపతి, తిరుమలలో విజిలెన్స్‌ విభాగం సేకరించిన వస్ర్తాలన్నీ నగరికి చెందిన వీఆర్‌ఎస్‌ ఎక్స్‌పోర్టు అనే సంస్థ సరఫరా చేసినట్టు గుర్తించారు. ఈ సంస్థకు అనుబంధంగా ఉన్న తిరుమల ఫ్యాబ్రిక్స్‌, నాన్న కాటేజెస్‌, వీఎం రాజ పవర్‌లూమ్‌ వంటి అనేక సంస్థలు కూడా ఉండటం గమనార్హం. 2015-25 మధ్య వీటి నుంచి మొత్తం రూ.54.95 కోట్ల విలువైన వస్త్రాలు కొనుగోలు చేసినట్టు ఉన్న రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలో తిరుపతి మార్కెటింగ్‌ విభాగం పంపిన నమూనాలకు కాంచీపురం సీఎ్‌సబీలో ఆమోదం లభించడంపై పలు రకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే స్టాక్‌ నుంచి విజిలెన్స్‌ సేకరించిన నమూనాలు మాత్రం ధర్మవరం, బెంగళూరు ల్యాబ్‌ల్లో పాలిస్టర్‌గా రిపోర్టులు రావడం, కాంచీపురంలో ఆమోదం రావడంతో అక్రమాలు జరిగినట్టు టీటీడీ భావిస్తోంది. నమూనాలను మార్చడం లేదా ల్యాబ్‌లో మేనేజ్‌ చేసి ఉండవచ్చనే అనుమానాలను విజిలెన్స్‌ విభాగం కూడా వ్యక్తం చేసింది. తాజాగా మరో 15 వేల వస్ర్తాల కోసం రూ.1,389 చొప్పున సరఫరా చేసేందుకు ఇదే సంస్థ కాంట్రాక్ట్‌ తీసుకుంది. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా ఆ సంస్థకు కేటాయించిన కాంట్రాక్ట్‌ను టీటీడీ రద్దు చేసింది.

ఏసీబీ విచారణకు ఈవో లేఖ.. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా అవకతవకలు జరిగినట్టు నిర్ధారించుకున్న టీటీడీ అక్టోబరు 28వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలో సుధీర్ఘంగా చర్చించింది. 2015 నుంచి 2025 వరకు జరిగిన వస్త్రాల కొనుగోలు అంశంపై ఏసీబీ ద్వారా సమగ్ర విచారణ చేయించాలని బోర్డు తీర్మానం చేసింది. బోర్డు తీర్మానం ప్రకారం టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఇటీవల సమగ్ర విచారణ కోసం ఏసీబీకి లేఖ రాశారు. ఇదే అంశంపై చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ‘నాకు రూ.350కి వస్ర్తాన్ని విక్రయించిన సంస్థే టీటీడీకి రూ.1,389కి విక్రయిస్తోంది. అక్కడే అనుమానం కలిగి విచారణ చేయించాం. స్వామి సొమ్మును ఇష్టమొచ్చినట్లు తిన్నారు. దేవుడు క్షమించడు. వాళ్లకు రోజులు దగ్గర పడ్డాయి. టీటీడీలో పూర్తిస్థాయిలో అవినీతి అక్రమాలను అడ్డుకోవడంతో పాటు గతంలో జరిగి అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చి దొంగలకు శిక్ష వేయిస్తాం’ అని అన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 03:29 AM