TDP: హింసను ప్రేరేపించేలా మాట్లాడతారా
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:43 AM
చీకట్లో కన్ను కొడితే తలలు నరికేయండి అంటూ మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మండిపడింది. హింస, విధ్వంసం.. వైసీపీ పాలసీ అని ఆయన వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టమైందంటూ విమర్శించింది.
పేర్ని వ్యాఖ్యలపై బోడె, కొనకళ్ల ఆగ్రహం
అమరావతి, జూలై 12(ఆంధ్రజ్యోతి): ‘చీకట్లో కన్ను కొడితే తలలు నరికేయండి’ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మండిపడింది. హింస, విధ్వంసం.. వైసీపీ పాలసీ అని ఆయన వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టమైందంటూ విమర్శించింది. ఆ పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ‘రెంటపాళ్ల పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రప్పా, రప్పా అని ప్లకార్డులు పట్టుకుంటే మీడియా సమక్షంలో దానిని జగన్ సమర్థించారంటే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. చంద్రబాబు అభివృద్ధి - సంక్షేమం చేసి ప్రజల మన్ననలు పొందాలని పదే పదే చెబుతూ ఉంటారు. వైసీపీ వారు మాత్రం హత్యలు చేయండి... తలలు నరకండి అని చెబుతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’ అని ఎమ్మెల్యే బోడె అన్నారు. కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ... ‘అధికారంలో ఉన్నప్పుడు పేదల రేషన్ బియ్యాన్ని బొక్కేసిన చరిత్ర నానిది. రంగనాయకులు గుడికి చెందిన 10 ఎకరాల స్థలాన్ని మాయం చేసిన ఘనుడు ఆయన. రప్పా రప్పా అని టీవీల ముందు కాదు... మచిలీపట్నంలో ఆక్రమించిన వెయ్యి గజాల తమ్మిన వారి సత్రం దగ్గర లేదా కబ్జా చేసిన కోటా జయరాం పొలం వద్ద అనాలి’ అని నారాయణ సవాల్ చేశారు.