రాజకీయ వ్యవస్థల్లో మార్పు రావాలి: నారాయణ
ABN , Publish Date - Sep 06 , 2025 | 06:19 AM
ప్రస్తుత రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయి. రాజకీయ వ్యవస్థల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు.
కర్నూలు, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘ప్రస్తుత రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయి. రాజకీయ వ్యవస్థల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కామ్రేడ్ దివంగత సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణసభ కర్నూలు జడ్పీ సమావేశ భవనంలో శుక్రవారం జరిగింది. రాజ్యసభ మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ వెంకటేశ్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కె.నారాయణ మాట్లాడుతూ... ‘కర్నూలు జిల్లాతో సురవరానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలు రాసుకునే రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పడేస్తున్నాయి. మేనిఫెస్టో పక్కాగా అమలు చేయాలి. సురవరానికి, సీఎం చంద్రబాబుతో కూడా మంచి సాన్నిహిత్యం ఉండేది. రాజకీయ ప్రత్యర్థే తప్పా వ్యక్తిగతంగా విభేదాలు లేవు’ అని వివరించారు. మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ... కమ్యూనిస్టు నాయకులను చూస్తే తనకు భయం ఉండేదని, అయితే సురవరంని చూస్తే ఏమాత్రం భయం ఉండేది కాదని అన్నారు.