Minister Subhash: ట్రేడ్ యూనియన్ల ఆందోళన వెనుక రాజకీయ పార్టీలు
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:44 AM
కార్మిక చట్టాల్లో సంస్కరణలపై ట్రేడ్ యూనియన్ల ఆందోళనల వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఆరోపించారు...
కార్మిక చట్టంలో సంస్కరణపై అవగాహన పెంచుకోవాలి: సుభాశ్
అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): కార్మిక చట్టాల్లో సంస్కరణలపై ట్రేడ్ యూనియన్ల ఆందోళనల వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఆరోపించారు. కార్మిక చట్టాల్లో చేపట్టిన సంస్కరణలపై కార్మిక శాఖ ఉన్నతాధికారులు విజయవాడలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సుభాశ్ మీడియాతో మాట్లాడుతూ... టేడ్ యూనియన్లు ఆందోళనలకు వెళ్లే ముందు కొత్త సంస్కరణలపై అవగాహన తెచ్చుకోవాలని సూచించారు. నవంబరు 21 నుంచి కొత్త సంస్కరణలు అమలులోకి తీసుకువచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు తాము కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే స్వాగతించామన్నారు. అవగాహన సదస్సుల్లో పాల్గొన్న కార్మిక శాఖ అధికారులు జిల్లాల్లో ప్రతి ఒక్కరికీ సంస్కరణలపై అవగాహన కల్పిస్తారని స్పష్టం చేశారు. వారానికి 48 పనిగంటల అమలు అలానే ఉందని, రోజుకి 10 పని గంటలు అన్న దాని వల్ల కార్మికులకు ఎలాంటి నష్టం జరగడం లేదని కార్మిక శాఖ సెక్రటరీ ఎం.శేషగిరిబాబు స్పష్టం చేశారు. మరోవైపు ఫ్యాక్టరీల్లో సేఫ్టీ ఆఫీసర్లు, కమిటీల ఏర్పాటు వల్ల ప్రమాదాలు చాలా వరకూ తగ్గుతాయని చెప్పారు. కార్యక్రమంలో గంధం చంద్రుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.