Additional Advocate General (AAG): పవన్ కల్యాణ్‌పై రాజకీయ ప్రేరిత వ్యాజ్యం
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:55 AM
తన సినిమా ప్రమోట్ చేసుకునేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్...
మాజీ ఐఏఎస్ పిటిషన్‌ను కొట్టివేయండి.. హైకోర్టు ఏఏజీ వినతి.. తీర్పు రిజర్వు
అమరావతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తన సినిమా ప్రమోట్ చేసుకునేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ వేసిన పిటిషన్ రాజకీయ ప్రేరితమని అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పేర్కొన్నారు. ఆ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని హైకోర్టును కోరారు. ఉపముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ సినిమాల్లో నటన కొనసాగించడం అనైతికమని.. హరిహరవీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపు, వాణిజ్య కార్యక్రమాలు ప్రమోట్ చేసుకునేందుకు పవన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పిటిషనర్ తరఫు న్యాయవాది బాల తెలిపారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి బుధవారం ప్రకటించారు. అంతకుముందు న్యాయవాది బాల వాదనలు వినిపిస్తూ.. సినిమాల్లో నటించకుండా పవన్ కల్యాణ్‌ను నిరోధించాలని కోరారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ.. మరోవైపు సినిమాల్లో నటించడం పరస్పర విరుద్ధ ప్రయోజనం నిర్వచనం పరిధిలోకి వస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రస్తుత కేసుకు వర్తించదని తెలిపారు. హరిహరవీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో సైతం చట్టనిబంధనలు అనుసరించలేదన్నారు. అయితే రాజకీయ కక్షతో విజయకుమార్ పిటిషన్ వేశారని, ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని ఏఏజీ తెలిపారు. ‘పిటిషనర్‌కు రాజకీయ పార్టీ ఉంది. ఇది రాజకీయ ప్రేరేపిత వ్యాజ్యం. సినిమా నిర్మాత విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని రాష్ట్రప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను పెంచింది. ఈ విషయంలో డిప్యూటీ సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేందుకు పిటిషనర్ ఎలాంటి ఆధారాలనూ కోర్టు ముందుంచలేదు. ఖర్చులు విధించి పిటిషన్‌ను కొట్టివేయండి’ అని కోరారు.