Share News

Anakapalli : కరక క్వారీపై నేతల కన్ను!?

ABN , Publish Date - Mar 12 , 2025 | 06:06 AM

రంగురాళ్లు తవ్వాలంటే రిజర్వు ఫారెస్టు నుంచి కరక కొండను డీనోటిఫై చేయించాలి కనుక, అందుకోసం అమరావతి నుంచి ఢిల్లీ వరకూ పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతుండడమే ఇందుకు కారణం.

Anakapalli : కరక క్వారీపై నేతల కన్ను!?

  • అటవీ అధికారుల నుంచి సమాచార సేకరణ

  • రిజర్వు ఫారెస్టు నుంచి మినహాయింపు కోసం యత్నాలు

  • డీనోటిఫైయింగ్‌ కోసం ఢిల్లీ స్థాయిలో కసరత్తు

విశాఖపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలోని కరక రిజర్వు ఫారెస్టులో గల రంగురాళ్ల క్వారీపై కూటమికి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు కన్నేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రంగురాళ్లు తవ్వాలంటే రిజర్వు ఫారెస్టు నుంచి కరక కొండను డీనోటిఫై చేయించాలి కనుక, అందుకోసం అమరావతి నుంచి ఢిల్లీ వరకూ పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతుండడమే ఇందుకు కారణం. కరక రిజర్వు ఫారెస్టు సుమారు మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చుట్టూ కరక, దాసుపాలెం, రుత్తలపాలెం, పొగచెట్లపాలెం, జమ్మివరం గ్రామాలు ఉన్నాయి. వీటిలో కరక బ్లాక్‌ ఏరియాలో భారీగా రంగురాళ్ల నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ మేలు జాతి రంగురాళ్లు ఉన్నాయని చెబుతుంటారు. సుమారు పుష్కరకాలం కిందట కరక, పరిసరాల్లో అటవీ సిబ్బంది సాయంతో స్థానిక నేతలు అనధికారికంగా పెద్దఎత్తున రంగురాళ్ల తవ్వకాలు చేపట్టారు. తర్వాత ప్రభుత్వం గట్టి నిఘా పెట్టడంతో వెనక్కితగ్గారు. వర్షాకాలంలో రాత్రి సమయాల్లో అడపాదడపా తవ్వకాలు చేపడుతున్నారు. అనకాపల్లి జిల్లాలో క్వారీయింగ్‌ అనుభవం ఉన్న ప్రజా ప్రతినిధి ఒకరు, మరో ప్రజా ప్రతినిధి కలిసి కరక కొండపై రంగురాళ్ల తవ్వకాలకు యత్నిస్తున్నట్లు సమాచారం.


అయితే కరక కొండ రిజర్వు ఫారె్‌స్టలో ఉన్నందున క్వారీయింగ్‌కు అనుమతి ఉండదు. అందుకు ఆ ప్రాంతాన్ని డీనోటిఫై చేయాల్సి ఉంటుంది. సర్కిల్‌, జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి చివరిగా కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వడంతోపాటు డీనోటిఫై చేయాలి. ఒక ప్రాంతంలో రిజర్వు ఫారెస్టును డీనోటిఫై చేయాలంటే మరో ప్రాంతంలో అడవుల పెంపకం చేపట్టాలి. తవ్వకాల కోసం ప్రయత్నాలు మొదలెట్టిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఇప్పటికే అటవీ శాఖలో కిందిస్థాయి అధికారుల నుంచి కొంత సమాచారం సేకరించారని తెలిసింది.

Updated Date - Mar 12 , 2025 | 06:06 AM