Share News

సహకార రంగంపై రాజకీయ పెత్తనం!

ABN , Publish Date - Nov 18 , 2025 | 12:36 AM

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతి, అక్రమాలను అడ్డుకునేలా హెచ్‌ఆర్‌ పాలసీ ప్రకారం నియామకాలు చేపట్టేందుకు, సక్రమంగా లేనివి నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబరు 36 అమలుకు అధికార పార్టీ నేతలే అడ్డంకిగా మారుతున్నారు.

సహకార రంగంపై రాజకీయ పెత్తనం!

- ఉద్యోగుల బదిలీల ప్రక్రియను అడ్డుకుంటున్న ప్రజాప్రతినిధులు

- సహకార వ్యవస్థను గాడిలో పెడుతుంటే అడ్డంకులు సృష్టిస్తున్న నేతలు

- ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల తీరుపై విమర్శలు చేస్తున్న రైతులు

ఆంధ్రజ్యోతి-అవనిగడ్డ:

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతి, అక్రమాలను అడ్డుకునేలా హెచ్‌ఆర్‌ పాలసీ ప్రకారం నియామకాలు చేపట్టేందుకు, సక్రమంగా లేనివి నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబరు 36 అమలుకు అధికార పార్టీ నేతలే అడ్డంకిగా మారుతున్నారు. గత వైసీపీ హయాంలో ఇష్టమొచ్చినట్టు జరిగిన నియామకాలను నిరోధించేలా సహకార రంగంలో బదిలీ ప్రక్రియను చేపట్టడానికి గత అక్టోబరు 31న కృష్ణా సహకార కేంద్ర బ్యాంక్‌ లిమిటెడ్‌ ఓ తీర్మానం చేసింది. ఈ తీర్మానంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పని చేసే సిబ్బందికి పాటించాల్సిన విధివిధానాలను స్పష్టంగా తెలియజేసింది. సహకార రంగాల చట్టం 1964 ప్రకారం హెచ్‌ఆర్‌ పాలసీని అన్ని సంఘాల్లో అమలు చేయాలని, ఈ పాలసీ అమలులో భాగంగా సంఘ ముఖ్య నిర్వహణాధికారి, సహకార రంగ సిబ్బంది నియామకాలు, బదిలీ, ఇంచార్జ్‌, ఎఫ్‌ఏసీ, ప్రమోషన్‌ తదితరాలు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ నందు ఉన్న డీఎల్‌ఈసీ కమిటీ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సహకార సంఘ పర్సన్‌ ఇంచార్జ్‌ కమిటీ లేక సంఘ సీఈవో ఎట్టి పరిస్థితుల్లోనూ సిబ్బంది నియామకం, బదిలీ, ప్రమోషన్ల విషయంలో తమకు తాముగా నిర్ణయం తీసుకోరాదని, సంఘంలో సీఈవో లేక ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీలు ఏర్పడిన సమయంలో డీఎల్‌ఈసీలోని పీఏసీఎస్‌ హెచ్‌ఆర్‌ సెల్‌ వారికి రాతపూర్వకంగా తెలపాలని కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల సహకార అధికారులు సర్క్యూలర్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎల్‌ఈసీకి సహకార సంఘాల్లోని సీఈవో, ఇతర సిబ్బందిని బదిలీ చేసే అధికారాన్ని కల్పిస్తూ డీఎల్‌ఈసీ తీసుకునే నిర్ణయానికి సంఘ పర్సన్‌ ఇంచార్జ్‌ కమిటీ కట్టుబడి ఉండాలని నిర్ణయించి, మరో సర్క్యూలర్‌ను అన్ని బ్యాంకులకు పంపించారు. ఇదే విషయమై గత అక్టోబరు 14న అప్పటి వరకు జరిగిన తాత్కాలిక బదిలీలన్నింటినీ ఆమోదించారు. అనంతరం ఈ నెల 11న నిర్వహించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల యందు సిబ్బంది కొరత కారణంగా చేపట్టాల్సిన తాత్కాలిక నియామకాల గురించి, వేతన చెల్లింపు పారదర్శకాల గురించి చర్చించి అన్ని సంఘాలకు తీర్మానాలను పంపించారు.

తీర్మానాలకు అడ్డుకట్ట వేస్తున్న ప్రజాప్రతినిధులు

జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ లిమిటెడ్‌ ఈ నెల 11న పంపించిన డీఎల్‌డీసీ సమావేశంలో ఆమోదించిన మార్గదర్శకాలకు అధికార పార్టీ సభ్యులే ఆటంకాలు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నాటి సమావేశంలో పీఏసీఎస్‌ ఉద్యోగులు తాత్కాలికంగా ఇతర పీఏసీఎస్‌లకు బదిలీ అయినప్పుడు ఏ పీఏసీఎస్‌కైతే బదిలీ అవుతారో ఆ పీఏసీఎస్‌ నుంచి జీతభత్యాలు తీసుకోవాలని, అదనపు బాధ్యతలు ఇచ్చిన సందర్భాల్లో పని చేసిన కాలానికి సంబంధించి టీఏ, డీఏలను కూడా అదే సొసైటీల నుంచి పొందాలని తీర్మానించారు. డీఎల్‌ఈసీ కన్వీనర్‌ ద్వారా చేపట్టిన తాత్కాలిక బదిలీలను అందరూ పీఏసీఎస్‌ పర్సన్‌ ఇంచార్జ్‌లు విధిగా అంగీకరించాలని ఆదేశాలు జారీ చేయగా, వీటిని అడ్డుకునేందుకు కొందరు ఉద్యోగులు అధికార పార్టీ నేతలతో కలిసి పావులు కదుపుతున్నారు. లక్షలాది రూపాయల టర్నోవర్‌ ఉన్న పీఏసీఎస్‌ల్లో సిబ్బంది పెత్తనం కారణంగా సొసైటీల్లో ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి ఉంది. సొసైటీల పాలన పారదర్శకంగా జరగాలంటే బదిలీల ప్రక్రియను తప్పనిసరిగా చేపట్టాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికనుగుణంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ ఇటీవల కొందరు సొసైటీ సీఈవోలను బదిలీ చేసింది. అయితే ఆయా సొసైటీల్లో పాతుకుపోయిన సీఈవోలు అప్పటికే వారు 2019 తర్వాత నియమించుకున్న స్టాఫ్‌ అసిస్టెంట్ల ప్రమోషన్లకు ఈ బదిలీలు అడ్డంకిగా మారతాయన్న ఉద్దేశ్యంతో రాజకీయ నేతలతో కలిసి బదిలీ ప్రక్రియ జరగకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 223 సొసైటీలకు గానూ 189 మంది సీఈవోలు ఉండగా, 36 సీఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టాఫ్‌ అసిస్టెంట్లుగా 179 మంది పని చేస్తుండగా, వారిలో దాదాపు 50 మందికిపైగా 2019 తర్వాత రాజకీయ ప్రాబల్యంతో చేరిన వారే ఉండటం గమనార్హం. ఒక మండలంలోని ఒక సొసైటీలో సీఈవోగా పని చేస్తున్న వ్యక్తి తన బంధువులను అదే మండలంలోని ఇతర సొసైటీల్లో స్టాఫ్‌ అసిస్టెంట్లుగా నియమించుకుని పరస్పర సహకారంతో ఇంతకాలం వ్యవహారాలు నడుపుకుంటూ రాగా, ప్రస్తుతం ఖాళీగా ఉన్న 36 సీఈవో పోస్టుల్లో ఈ స్టాఫ్‌ అసిస్టెంట్లనే నియమించుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్న తరుణంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ బదిలీల ప్రక్రియ చేపట్టడంతో ఇది నియోజకవర్గాల్లో రాజకీయ దుమారాన్ని రేపుతోంది.

తొలి బదిలీనే అడ్డుకున్న అధికార పార్టీ నేతలు

జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఇటీవల అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన ఓ సొసైటీ సీఈవోను వేరే మండలానికి బదిలీ చేయగా, అక్కడ పని చేస్తున్న సిబ్బంది రాజకీయ ప్రాబల్యాన్ని ఉపయోగించి ఆ బదిలీ ప్రక్రియను అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 11న జరిగిన డీఎల్‌ఈసీ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పీఏసీఎస్‌ పర్సన్‌ ఇంచార్జ్‌లు డీఎల్‌ఈసీ చేపట్టిన తాత్కాలిక బదిలీలు అంగీకరించి తీరాలని సర్క్యూలర్‌ జారీ చేసినప్పటికీ సదరు పీఏసీఎస్‌ చైర్మన్‌ డీఎల్‌ఈసీ నిర్ణయాన్ని ఆమోదించకుండా బదిలీ అయ్యి వచ్చి, చార్జ్‌ తీసుకునేందుకు ప్రయత్నించిన సీఈవోను వెనక్కి తిప్పిపంపారు. ఇదే విషయాన్ని సదరు సీఈవో జిల్లా ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులు సదరు పీఏసీఎస్‌కు నోటీసులు కూడా జారీ చేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు నియోజకవర్గ, జిల్లా స్థాయిలో తమకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆ నోటీసులను వెనక్కి తీసుకునేలా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఎవరైనా ఉద్యోగికి ఉన్నతాధికారుల ద్వారా అన్యాయం జరిగితే దానిపై పోరాటం చేయాల్సిన సంఘాల్లోని నాయకులు సైతం, తమ మండలాల్లో తాము 2019 తర్వాత నియమించుకున్న స్టాఫ్‌ అసిస్టెంట్లకు అడ్డదారిలో ప్రమోషన్‌ ఇప్పించేందుకు అన్యాయం జరిగినా సహకార ఉద్యోగులను కూడా పట్టించుకోని పరిస్థితి నేడు జిల్లా సహకార బ్యాంక్‌ పరిధిలోని సొసైటీల్లో కొనసాగుతుందని ఆరోపణలు ఉన్నాయి. సొసైటీల్లో పాలనను పారదర్శకంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని సహకార కేంద్ర బ్యాంక్‌ల ద్వారా డీఎల్‌ఈసీ కన్వీనర్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రక్షాళన కార్యక్రమానికి సొంత పార్టీ నేతల నుంచే అడ్డంకులు ఎదురవుతుండటం పట్ల పలువురు సీఈవోలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కట్టుదిట్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకుని, తమకు నాణ్యమైన సేవలు అందించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Nov 18 , 2025 | 12:36 AM