Share News

Advocate Commissioner: పోలీసు స్టేషన్‌ మొత్తం కవరయ్యేలా కెమెరాలు లేవు

ABN , Publish Date - Sep 03 , 2025 | 05:13 AM

పోలీస్‌స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ, ఠాణా మొత్తం కవర్‌ అయ్యేలా వాటిని బిగించలేదని అడ్వొకేట్‌ కమిషనర్‌ ఎంఆర్‌కె చక్రవర్తి హైకోర్టుకు నివేదించారు.

Advocate Commissioner: పోలీసు స్టేషన్‌ మొత్తం కవరయ్యేలా కెమెరాలు లేవు

  • స్టేషన్లలో పెట్టిన 10 కెమెరాలు అందుకు సరిపోవు

  • హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్‌ కమిషనర్‌

అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): పోలీస్‌స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ, ఠాణా మొత్తం కవర్‌ అయ్యేలా వాటిని బిగించలేదని అడ్వొకేట్‌ కమిషనర్‌ ఎంఆర్‌కె చక్రవర్తి హైకోర్టుకు నివేదించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పెనమలూరు, అమరావతి, తుళ్లూరు, అరండల్‌పేట, నల్లపాడు, మంగళగిరి పట్టణ పోలీ‌స్‌ స్టేషన్లు పరిశీలించినట్లు తెలిపారు. ప్రతీ ఠాణాలో సగటున 10 సీసీ కెమెరాలు ఉన్నాయని, మంగళగిరి స్టేషన్‌లో 11 ఏర్పాటుచేశారని వివరించారు. స్టేషన్‌లోని ప్రతీ మూలను కవర్‌ చేసేందుకు 10 సీసీ కెమెరాలు సరిపోవన్నారు. రెండు అంతస్తులు ఉన్న పెనమలూరు, నల్లపాడు పోలీస్‌ స్టేషన్లలో మొదటి అంతస్తులో కెమెరాలను బిగించలేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. సీసీటీవీ ఫుటేజ్‌ లభ్యత గురించి ఆరా తీయగా, డిజిటల్‌ వీడియో రికార్డర్‌ నుండి ఫుటేజ్‌ను పొందేందుకు తమకు అవకాశం లేదని పోలీసులు చెప్పారన్నారు. ఏదైనా కేసు దర్యాప్తు, విచారణకు అవసరమైనప్పుడు సంబంధిత ఎస్పీ కార్యాలయాల నుండి ఈ-మెయిల్‌ ద్వారా పంపిస్తారని తెలిపారని అడ్వొకేట్‌ కమిషనర్‌ వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో పాస్‌వర్డ్‌ ఇస్తారని, ఫుటేజ్‌ తీసుకున్న వెంటనే దానిని మార్చేస్తారని పెనమలూరు ఎస్‌హెచ్‌వో సమాచారం ఇచ్చారన్నారు. కోర్టు అనుమతి లేకపోవడంతో గుంటూరు, కృష్ణా ఎస్పీ కార్యాలయాల్లోకి వెళ్లలేకపోయానన్నారు. ఈ కారణంతో వీడియో ఫుటేజ్‌ల లభ్యత? ఎప్పటి నుంచి ఫుటేజ్‌ అందుబాటులో ఉంది? ఫుటేజ్‌లో మాట స్పష్టంగా ఉందా? అనే విషయాలను పరిశీలించలేకపోయానని తెలిపారు. తనిఖీలకు వెళ్లినప్పుడు స్టేషన్‌లో పోలీసు అధికారులు లేరని, దీంతో వీడియో రికార్డింగ్‌, దాని లభ్యత, డీవీఆర్‌ల నుంచి ఫుటేజ్‌ సేకరించే విధానం గురించి పూర్తి వివరాలు చేప్పేవారు లేరన్నారు.


ఈ దశలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) తిరుమాను విష్ణుతేజ స్పందిస్తూ... డీవీఆర్‌లలో రికార్డు అయిన ఫుటేజ్‌ ఎక్కడ స్టోర్‌ అవుతుందో తెలుసుకొని వివరాలు సమర్పించేందుకు విచారణను బుధవారానికి వాయిదా వేయాలనికోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు, జస్టిస్‌ టీసీడీ శేఖర్‌తో కూడిన ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 2019లో న్యాయవాది తాండవ యేగేష్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్నాన్ని విచారించిన హైకోర్టు ధర్మాసనం సఆుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2019 జులై 15న ఽఆదేశాలిచ్చింది. ఏళ్లు గడుస్తున్నా ఉత్తర్వులు అమలుకాక పోవడంతో యోగేష్‌ 2022లో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు పల్నాడు జిల్లా, మాచవరం పోలీసులు తన సోదరుడు గోపిరాజును అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ కటారు నాగరాజు గత నవంబర్‌లో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు ఇటీవల విచారణకురాగా స్టేషన్‌ మొత్తం కనిపించేలా పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సర్టిఫై చేస్తూ ఎస్‌డీపీవోలు(డీఎస్పీలు) సమర్పించిన నివేదికలపై ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తేల్చేందుకు అడ్వొకేట్‌ కమిషనర్‌ను నియమించింది.

Updated Date - Sep 03 , 2025 | 05:15 AM