Share News

AP Police Sniffer Dogs: మత్తును పట్టించేస్తాయి

ABN , Publish Date - Sep 03 , 2025 | 04:46 AM

వాసన పసిగట్టి నేరగాళ్లను పట్టించడమే కాదు... పేలుడు పదార్థాలను, మాదక ద్రవ్యాలను కూడా గుర్తించేలా బహుముఖ శిక్షణ పొందిన జాగిలాలు పోలీసు శాఖలో ప్రవేశించాయి.

AP Police Sniffer Dogs: మత్తును పట్టించేస్తాయి

  • పేలుడు పదార్థాలనూ కనిపెడతాయి

  • 35 జాగిలాలకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ

అమరావతి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వాసన పసిగట్టి నేరగాళ్లను పట్టించడమే కాదు... పేలుడు పదార్థాలను, మాదక ద్రవ్యాలను కూడా గుర్తించేలా బహుముఖ శిక్షణ పొందిన జాగిలాలు పోలీసు శాఖలో ప్రవేశించాయి. అవసరమైతే ఇవి నేరగాళ్లపై దాడి చేసి కట్టడి చేస్తాయి. ఇలా అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ పొందిన 35 జాగిలాల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ మంగళవారం మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో జరిగింది. ‘బెల్జియన్‌ మాలినోయిస్‌’ జాతికి చెందిన ఈ జాగిలాలు ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎ్‌సడబ్ల్యూ) ద్వారా పోలీసు శాఖలోకి ప్రవేశించాయి. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, డీజీపీ హరీశ్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు. నేర పరిశోధనలో పోలీసు జాగిలాలు ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయని, నేరం జరిగిన ప్రాంతంలో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకపోయినా.. ఇవి కేసుల్ని ఛేదిస్తున్నాయని అనిత అన్నారు. ఏకంగా 35 జాగిలాలు అంతర్జాతీయ స్థాయి శిక్షణ పొంది.. ఈ రోజు ఏపీ పోలీసు శాఖలో సేవలందించేందుకు సిద్ధమవడం శుభపరిణామమని అన్నారు. ‘నేను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే చీరాలలో ఒక యువతిని రేప్‌ చేసి హత్య చేశారన్న సమాచారం రావడంతో అక్కడికి వెళ్లా.. పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. కానీ పోలీసు జాగిలం ఆ ప్రాంతమంతా తిరిగి ఒకచోట ఆగింది. అక్కడి టవర్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు హంతకుల్ని అరెస్టు చేశారు. మన్యంలో ఐజీ ఆకే రవికృష్ణతో కలిసి పర్యటిస్తున్నప్పుడు అక్కడ ఓ పోలీసు జాగిలం ఎక్కడో అటవీ ప్రాంతంలో దాచిన గంజాయిని పట్టించింది.


నేర పరిశోధనలో స్నిఫర్‌ డాగ్స్‌ ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయని ఈ రెండు సంఘటనలతో అర్థమైంది..’ అని హోంమంత్రి తెలిపారు. విశాఖలో ఒక కార్యక్రమానికి వెళ్లినప్పుడు స్నిఫర్‌ డాగ్స్‌ ఎన్ని ఉన్నాయని అడిగితే.. కేవలం ఒక్కటే ఉందని చెప్పారని, దీంతో గత వైసీపీ ప్రభుత్వంలో పరిస్థితి అర్థమైందని ఆమె అన్నారు. శాంతి భద్రతలకు ప్రాధాన్యమిచ్చే కూటమి ప్రభుత్వంలో ఏకంగా 35 జాగిలాలు ఏపీ పోలీసు శాఖలో ప్రవేశించాయని చెప్పారు. ‘‘కూటమి ప్రభుత్వం ఏర్పడే సమయానికే రాష్ట్రంలో యువత గంజాయి, డ్రగ్స్‌ బారిన పడి తూలుతున్నారు.. ‘ఈగల్‌’ ద్వారా దాదాపు కట్టడి చేశాం.. అందులో పోలీసు జాగిలాల పాత్ర ఎనలేనిది. అందుకే ఈ 35 జాగిలాల్లో 16 డాగ్స్‌కు గంజాయి, మత్తు పదార్థాలను పసిగట్టడం కోసమే శిక్షణ ఇప్పించాం.. మిగతావి వీఐపీ సెక్యూరిటీ, పేలుడు పదార్థాల గుర్తింపు లాంటి వాటిపై శిక్షణ పొందాయి. కొన్ని సందర్భాల్లో టెక్నాలజీ చెయ్యలేని పనులు పోలీసు జాగిలాలు చేస్తాయి’’ అన్నారు.


సైలెంట్‌ హీరోస్‌..: డీజీపీ గుప్తా

ప్రపంచంలో అత్యుత్తమ జాతికి చెందిన 35 బెల్జియన్‌ మాలినోయిస్‌ శునకాలు అంతర్జాతీయ స్థాయి శిక్షణ పొందాయని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. ప్రతి జాగిలానికి రెండు విభాగాల్లో శిక్షణ ఇప్పించామని చెప్పారు. ఈ జాగిలాలు పేలుడు పదార్థాలను గుర్తించడంలో, నార్కోటిక్స్‌ను పసిగట్టడంలో, అవసరాన్ని బట్టి దాడిచేయడంలో.. సైలెంట్‌గా పనిపూర్తిచేసే హీరోలని అభివర్ణించారు. అరాచక శక్తుల్ని వెంబడించడంలో ఈ జాగిలాలు పోలీసులకు ఆయుధాలుగా పని చేస్తాయన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మహేశ్‌ చంద్ర లద్దా, ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌ బాబు, పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 04:46 AM