Sheikh Feroz CI : టీడీపీ నేతను ఓడిస్తానని
ABN , Publish Date - Oct 13 , 2025 | 05:37 AM
వైసీపీ హయాంలో టీడీపీ నేతలను ఇబ్బందులకు గురిచేసి, ఆ పార్టీ అభ్యర్థిని ఎన్నికల్లో ఓడించి తీరుతానని శపథం చేసిన ఓ పోలీసు అధికారికి..
శపథం చేసిన పోలీసుకు అందలం!
వైసీపీ హయాంలో రెచ్చిపోయిన సీఐ
టీడీపీ మద్దతుదార్ల ఓట్ల తొలగింపు సహా
ఆ పార్టీ నేతలకు చుక్కలు చూపిన వైనం
నరసరావుపేట వన్‌టౌన్ సీఐగా తాజా పోస్టింగ్
నరసరావుపేట, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో టీడీపీ నేతలను ఇబ్బందులకు గురిచేసి, ఆ పార్టీ అభ్యర్థిని ఎన్నికల్లో ఓడించి తీరుతానని శపథం చేసిన ఓ పోలీసు అధికారికి.. అదే టీడీపీ నేతృంత్వంలోని కూటమి ప్రభుత్వం మంచి పోస్టింగ్ ఇచ్చి గౌరవించింది!. ఎన్నికల అక్రమాలకు పాల్పడి సస్పెన్షన్‌కు గురైన షేక్ ఫిరోజ్ అనే పోలీసు అధికారికి నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా పోస్టింగ్ ఇచ్చింది. ఈ నియామకాన్ని టీడీపీ వర్గాలు జీర్ణించుకొలేకపోతున్నా యి. గత ఎన్నికలకు ముందు పర్చూ రు నియోజకవర్గంలో ఫాం-7 ద్వారా టీడీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించేందుకు బీఎల్‌వోలను బెదిరించారని ఫిరోజ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఫిరోజ్‌తో పాటు మరో ముగ్గురు పోలీసులు కూడా ఇదే వ్యవహారం చేశారు. దీంతో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అప్పట్లో ఓట్ల అక్రమాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో నాడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. వారిలో ఫిరోజ్‌ను తాజాగా నరసరావుపేటలో సీఐగా నియమించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఫిరోజ్‌ను ఇక్కడికి తీసుకురావడంలో పార్టీ నేత ఒకరు కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. అక్రమార్కులకు సహకరించిన అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా కీలక పోస్టింగ్ ఇవ్వడంపై టీడీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. పర్చూరులో వైసీపీ అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ఇచ్చి, ఏలూరిని ఓడిస్తానని ప్రకటనలు గుప్పించిన అధికారికి నరసరావుపేటలో అందలం ఎక్కించడమేంటని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు.