Share News

AP High Court: విధుల్లో ఉండగా.. పోలీసులు యూనిఫాం ధరించాల్సిందే

ABN , Publish Date - Aug 30 , 2025 | 04:33 AM

చట్టబద్ధ విధులు నిర్వర్తించే సమయంలో పోలీసులు యూనిఫాం ధరించాల్సిందేనని హైకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. సాధారణ దుస్తుల్లో ఉన్న వ్యక్తులను..

AP High Court: విధుల్లో ఉండగా.. పోలీసులు యూనిఫాం ధరించాల్సిందే

  • కానిస్టేబుల్‌పై దాడి ఘటన వీడియో ఫుటేజ్‌, కేసు డైరీని సమర్పించండి.. హైకోర్టు ఆదేశం

  • నల్లపరెడ్డి క్వాష్‌ పిటిషన్‌పై విచారణ 8కి వాయిదా

అమరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): చట్టబద్ధ విధులు నిర్వర్తించే సమయంలో పోలీసులు యూనిఫాం ధరించాల్సిందేనని హైకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. సాధారణ దుస్తుల్లో ఉన్న వ్యక్తులను.. పోలీసు అధికారులని సాధారణ ప్రజలు ఎలా గుర్తించగలరని ప్రశ్నించింది. నిందితుల అరెస్టు సమయంలో పోలీసులు యూనిఫాంలో ఉండాలనే దానిపై సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని గుర్తుచేసింది. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా విధులకు ఆటంకం కలిగించడంతో పాటు తనపై దాడికి పాల్పడ్డారని స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ) హెడ్‌ కానిస్టేబుల్‌ మాలకొండయ్య ఫిర్యాదు ఆధారంగా దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంటెలిజెన్స్‌ అధికారులు ఉన్నది ప్రభుత్వాలకు నివేదికలు, సమాచారం ఇవ్వడానికి తప్ప.. సివిల్‌ పోలీసుల విధులు ఎలా నిర్వర్తిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులకు డ్రెస్‌కోడ్‌ ఉండదన్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనను తోసిపుచ్చింది. బనియన్లు, డ్రాయర్లు, టీషర్ట్‌లు ధరించి వచ్చి తాము పోలీసులమంటే.. ప్రజలకు ఎలా తెలుస్తుందని వ్యాఖ్యానించింది. సివిల్‌ దుస్తుల్లో విధులు నిర్వహించే ప్రత్యేక వెసులుబాటు ఏమీ పోలీసులకు ఉండదని పేర్కొంది. డ్రెస్‌కోడ్‌ మాన్యువల్‌ను తమ ముందు ఉంచాలని డీజీపీకి ఆదేశాలు ఇస్తామని తెలిపింది. ఇదే సమయంలో ప్రస్తుత కేసులో ఫిర్యాదుదారుడి ఘటనలో ప్రసన్నకుమార్‌రెడ్డి పాత్ర ఉందని నిరూపించేందుకు ఆధారమైన వీడియో ఫుటేజ్‌తోపాటు కేసు డైరీని కోర్టు ముందు ఉంచాలని పీపీని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 8కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు ఉత్తర్వులు ఇచ్చారు.


వాదనలు.. ప్రతివాదనలు

ప్రసన్నకుమార్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కానిస్టేబుల్‌ను పిటిషనర్‌ తోసివేయలేదని, ఘటన జరిగినప్పుడు ఆయన దూరంగా ఉన్నారన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ... ఘటనలో ప్రసన్నకుమార్‌రెడ్డిది కీలక పాత్ర అని.. పిటిషనర్‌, ఆయన అనుచరుల దాడిలో కానిస్టేబుల్‌ గాయపడ్డారని పేర్కొన్నారు. సర్జరీ కూడా జరిగిందన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఘటన సమయంలో ఫిర్యాదుదారు యూనిఫాంలో లేరని గుర్తుచేశారు. యూనిఫాంలో విధులు నిర్వర్తించినప్పుడు మాత్రమే ఆరోపణలకు బలం ఉంటుందని వ్యాఖ్యానించారు. పీపీ బదులిస్తూ.. ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులకు డ్రెస్‌కోడ్‌ ఉండదని, శాంతిభద్రతలు పరిరక్షించేక్రమంలో సాధారణదుస్తుల్లోనూ విధులు నిర్వర్తిస్తుంటారన్నారు.

Updated Date - Aug 30 , 2025 | 04:33 AM