Share News

Crime Reduction: ప్రజల్లోకి పోలీసులు

ABN , Publish Date - Oct 31 , 2025 | 04:19 AM

ఒకప్పుడు జేబులు కొట్టడం, ఇళ్లకు కన్నాలు వేయడం వంటి దొంగతనాలు జరిగేవి. వాటిని కట్టడి చేసేందుకు పోలీసులు గస్తీ నిర్వహించేవారు. కాలంతో పాటు నేరాలు జరిగే తీరూ మారింది.

Crime Reduction: ప్రజల్లోకి పోలీసులు

  • ‘కమ్యూనిటీ ఫస్ట్‌’తో నేరాల కట్టడి

  • ప్రజల భాగస్వామ్యంతో అడ్డుకట్ట

  • అవగాహన కోసం విస్తృత ప్రచారం

  • మహిళలపై నేరాలు, గంజాయి వాడకం,ఆర్థిక, సైబర్‌ మోసాల అడ్డుకట్టకు వ్యూహం

  • రేపటి నుంచి సమగ్ర కార్యక్రమం

  • ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అమలు

  • కనీసం 15 శాతం నేరాల తగ్గింపే లక్ష్యం

డిజిటల్‌ అరెస్ట్‌ పేరిట వృద్ధుడి నుంచి రూ.3.7 కోట్ల దోపిడీ, డాక్టర్‌కు రూ.3 కోట్లు కుచ్చుటోపీ.. ఇలాంటి వార్తలు తరచూ వింటుంటారు. సామాన్యుల నుంచి ఉన్నత విద్యావంతుల దాకా.. చివరకు ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా సైబర్‌ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఇంకా అధిక వడ్డీలు, చిట్టీల పేరిట మోసాలు.. గంజాయి, డ్రగ్స్‌ రవాణా.. మహిళలపై నేరాలు.. రోడ్డు ప్రమాదాలు.. ఎందరో జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి.

ఈ ఐదు రకాల నేరాలను అరికట్టేందుకు పోలీసులు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. నేరాలు జరిగాక బాధ్యులను అరెస్ట్‌ చేయడంతో పాటు నేరాల బారిన పడకుండా ముందుగానే ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబరు 1న ఇందుకు శ్రీకారం చుడుతున్నారు. ‘కమ్యూనిటీ ఫస్ట్‌’ పేరిట ప్రజల్లోకి వెళ్లి విస్తృత ప్రచారం చేయనున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఒకప్పుడు జేబులు కొట్టడం, ఇళ్లకు కన్నాలు వేయడం వంటి దొంగతనాలు జరిగేవి. వాటిని కట్టడి చేసేందుకు పోలీసులు గస్తీ నిర్వహించేవారు. కాలంతో పాటు నేరాలు జరిగే తీరూ మారింది. ఇప్పుడు ‘జేబు’, ఇంటి ‘ఆర్థికం’ అన్నీ సెల్‌ఫోన్లలోనే దొంగలకు దొరికిపోతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు ఎక్కడో ఉండి ప్రజల నుంచి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. ఇక స్వార్థ శక్తులు గంజాయి, మత్తు పదార్థాలు విక్రయించి యువత భవిష్యత్‌ను నాశనం చేస్తున్నాయి. కొందరు చిట్టీలు, అధిక వడ్డీలు, పెట్టుబడుల పేరిట ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా అఘాయిత్యాలు మాత్రం ఆగట్లేదు. వీటితో పాటు పోలీసులకు రోడ్డు ప్రమాదాలూ సవాల్‌గా మారాయి. ప్రధానమైన ఈ ఐదు నేరాలను తగ్గించే లక్ష్యంతో రాష్ట్ర పోలీసులు పంచ ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలు కట్టడి చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం. మహిళలపై నేరాల కట్టడి, మత్తు వినియోగం తగ్గించడం, ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తత, సైబర్‌ నేరాలపై చైతన్యం, రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు ‘కమ్యూనిటీ ఫస్ట్‌’ పేరుతో నవంబరు 1 నుంచి పోలీసులు ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వరకూ ప్రజల్లో అవగాహన పెంచేందుకు కమిటీలు ఏర్పాటు చేసి డిజిటల్‌ ప్రచారానికి పెద్దపీట వేయనున్నారు.


రోడ్డు ప్రమాదాలు.. 4 ‘ఈ’లతో బ్రేకులు

మన రాష్ట్రంలో ఏటా 800 నుంచి 900 మంది హత్యకు గురవుతుంటే... రోడ్డు ప్రమాదాల్లో 8 వేల నుంచి 9 వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత గడచిన పదేళ్లలో 87 వేలమందికి పైగా రోడ్లపై ప్రాణాలు వదిలేశారు. పోలీసు, రవాణా, విద్య, వైద్య శాఖలతో పాటు రోడ్‌ ఇంజనీరింగ్‌ విభాగం సమన్వయంతో రోడ్డు ప్రమాదాల కట్టడికి వ్యూహం సిద్ధమైంది. ప్రమాదాలు జరుగుతున్న తీరుతెన్నులపై అధ్యయనం చేసిన పోలీసు శాఖ, రవాణా శాఖ వద్ద ఉన్న సమాచారాన్ని కూడా తెప్పించుకుని విశ్లేషించింది. రోడ్డు ప్రమాదాలకు అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, నిర్లక్ష్యం వంటివి ప్రధాన కారణాలుగా గుర్తించారు. ప్రమాదాల్లో జాతీయ రహదారులపై 30 శాతం, రాష్ట్రంలోని ఇతర అన్ని రోడ్లపై 70 శాతం జరుగుతుండగా.. ఎక్కువగా(41శాతం) ద్విచక్ర వాహనదారులే ప్రాణాలు కోల్పోతున్నారు. అందులోనూ ఎక్కువగా యువత ఉంటున్నారు. హెల్మెట్‌ లేకపోవడం, అతివేగం, ట్రిపుల్‌ రైడింగ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ వంటివి కారణమని గుర్తించారు. యువతలో చైతన్యం తీసుకురావడం.. ఎడ్యుకేషన్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఇంజనీరింగ్‌, ఎన్విరాన్మెంట్‌ అనే నాలుగు ‘ఈ’లతో ప్రమాదాలకు బ్రేకులు వేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.


మహిళలపై నేరాల కట్టడికి

మనవరాలి వయసున్న మైనర్‌ బాలికను తాత వయసున్న వ్యక్తి అత్యాచారం చేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మైనారిటీ తీరని బాలురు సైతం ఇటువంటి ఘోరాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలపై ఇప్పటికే సమీక్షించిన పోలీసులు... ఎక్కువగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్న పోలీస్‌ స్టేషన్ల పరిధిలో చైతన్యం తీసుకురానున్నారు. విస్తృత ప్రచారం ద్వారా నేరాల కట్టడికి చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మ్యాపింగ్‌ చేసిన పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వాట్సాప్‌ గ్రూపుల్లో రీల్స్‌, స్కిట్స్‌ లాంటివి చేసి ప్రచారం చేయనున్నారు. పెద్ద పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక సినిమా థియేటర్లలో స్లైడ్‌లు వేయిస్తారు. మహిళలపై నేరాలకు పాల్పడితే పడే శిక్షలు ఎలా ఉంటాయో, జైలుకు వెళితే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో వీడియోల ద్వారా వివరించనున్నారు. నేరాల నుంచి మహిళలు ఎలా తప్పించుకోవాలో, ఆపద సమయంలో శక్తి యాప్‌ ఎలా రక్షణ కల్పిస్తుందో వివరిస్తారు. స్థానిక స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌తో పాటు అవగాహన కమిటీలు నిరంతరం మహిళలను చైతన్యం చేయనున్నారు.


ఆర్థిక మోసాల అడ్డుకట్టకు..

ఆర్థిక నేరగాళ్లు ప్రజలను రకరకాల మార్గాల్లో మోసం చేసి వందల కోట్లు కొల్లగొడుతున్నారు. ఆకర్షించేలా మాయమాటలు చెప్పడం, అధిక వడ్డీల ఆశ చూపడం, అనుమతిలేని చిట్టీలు-ఇతరత్రా స్కీమ్‌ల పేరిట దోచుకొంటున్నారు. పోలీసులు తరచూ వారిని అరెస్టు చేస్తున్నా మోసాలు ఆగడం లేదు. బాధితులు పెద్ద ఎత్తున పోలీసుల వద్దకొచ్చి లబోదిబోమంటున్నారు. ఇటువంటి కేసులు ఎక్కువగా ఎక్కడ నమోదవుతున్నాయనో గుర్తించి పోలీసులు మ్యాపింగ్‌ చేశారు. ఆర్థిక మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండటం ఎలా? మోసగాళ్ల బారిన పడితే బయట పడటం ఎంత కష్టమో.. రీల్స్‌. స్కిట్లు, పోస్టర్లు, ఇతర ప్రచారాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించారు. ఎన్జీవోలతో కలిసి పోలీసు శాఖ ఇందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఆర్థిక మోసాలకు పాల్పడిన వారికి ఎటువంటి దుర్గతి పడుతుందో, చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయో వివరించనుంది.


ప్రజా చైతన్యంతోనే నేరాల కట్టడి

సమాజం ప్రశాంతంగా ఉండాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా శాంతిభద్రతలు కీలకం. సంఘ విద్రోహశక్తులు, నేరస్తులను జైలుకు పంపడం పోలీసుల విధి. నేరం జరిగిన తర్వాత బాధ్యులను జైలుకు పంపడంతో పాటు నేరాల బారిన పడకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కూడా ఎంతో ముఖ్యం. అందుకే ప్రజల భాగస్వామ్యంతో నేరాల కట్టడికి ప్రణాళిక రూపొందించాం. రాష్ట్రంలో ఫ్యాక్షన్‌, రౌడీయిజం, నక్సలిజం వంటివాటిని పోలీసులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు సైబర్‌ నేరాలు, మహిళలపై అఘాయిత్యాలు, ఆర్థిక మోసాలు, మత్తు వినియోగం, రోడ్డు ప్రమాదాలు సమాజానికి అతిపెద్ద ముప్పుగా మారాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో 30 శాతం నేరాలు తగ్గాల్సిందేనని ఆదేశించారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేశాం. నేరాల బారిన పడకుండా ప్రజల్లో అవగాహన తీసుకొస్తే మంచి ఫలితాలు ఉంటాయని నమ్ముతున్నాం. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఈ దిశగా పని చేస్తాం. జిల్లాలో ఎస్పీ, రాష్ట్ర స్థాయిలో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ పర్యవేక్షిస్తుంది. ఈ ఏడాదిలో కనీసం 15 శాతం నేరాలు, మోసాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తాం. నవంబరు 1న ఇందుకు శ్రీకారం చుడుతున్నాం. ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని నేరాల బారిన పడకుండా ఉండాలని ప్రజల్ని కోరుతున్నా. తప్పు చేసిన వారిపై చట్టపరంగా గట్టి చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా.

- డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా


మత్తు మహమ్మారిపై ఉక్కుపాదం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి గంజాయి, డ్రగ్స్‌ అతిపెద్ద సవాలుగా నిలిచాయి. హోంమంత్రి అధ్యక్షతన ఏర్పాటైన ఐదుగురు మంత్రుల(విద్య, వైద్య, ఎక్సైజ్‌, గిరిజన సంక్షేమం) కమిటీ నివేదిక ఆధారంగా 459 మందితో ‘ఈగల్‌’ను ఏర్పాటు చేసింది. విశాఖ మన్యంలో గతంలో పదివేల ఎకరాల్లో ఉన్న గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించింది. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా గిరిజనుల్లో మార్పు తీసుకొచ్చింది. ఒడిశా నుంచి గంజాయి రవాణా కట్టడికి ఈగల్‌ బృందాలు, పోలీసులు ఒడిశా పోలీసులను సమన్వయం చేసుకుని పనిచేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ)లో ఏపీ పోలీసులు అభినందనలు అందుకున్నారు. గతంలో దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఏపీ పేరు వినిపించేదని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని, సమర్థంగా గంజాయి సాగు కట్టడి చేశారని అధికారులు ప్రశంసించారు. ఎన్‌సీబీ సూచనలతో ఏపీ పోలీసులు విద్య, వైద్య శాఖలతో సమన్వయం చేసుకుని ‘డ్రగ్స్‌ వద్దు బ్రో’ అంటూ పాఠశాలల్లో ప్రచారం మొదలుపెట్టారు. విద్యా సంస్థల నుంచి యూనివర్సిటీల వరకూ డిజిటల్‌ ప్రచారానికి ప్రణాళిక సిద్ధం చేశారు. యూట్యూబ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ తదితర మాధ్యమాల ద్వారా విద్యార్థులు, యువతలో చైతన్యం తీసుకురానున్నారు. గంజాయి, డ్రగ్స్‌ అమ్మేవారిని జైలుకు.. అలవాటు పడినవారిని రిహాబిలిటేషన్‌ కేంద్రానికి పంపి మార్పు తీసుకురావడానికి కృషి చేయనున్నారు.


సైబర్‌ నేరాలు.. అతిపెద్ద సవాలు

ఏపీ పోలీసులకే కాదు ప్రపంచానికే సైబర్‌ నేరాలు అతిపెద్ద సవాలుగా మారాయి. వాటిని అరికట్టేందుకు రాష్ట్రాలతో పాటు కేంద్ర హోంశాఖ ఎన్ని చర్యలు తీసుకొంటున్నా.. సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గం వెతుక్కొని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. నైజీరియా లాటరీ మోసాల నుంచి బ్యాంకు ఓటీపీ, ఆధార్‌ అప్డేట్‌, కస్టమ్స్‌, డిజిటల్‌ అరెస్టుల పేరిట మోసాలు చేస్తున్నారు. మనీయాప్‌లు, నకిలీ పెట్టుబడులు, క్రెడిట్‌ కార్డులో సొమ్ము దోచుకోవడం.. ఇలా రకరకాల ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి సైబర్‌ మోసాల కట్టడికి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు పోలీసు శాఖ ఒక స్టూడియో ఏర్పాటు చేసింది. మంగళగిరిలో టెక్‌ టవర్‌లోని డిజిటల్‌ స్టూడియోలో యాంకర్లు, న్యూస్‌ రీడర్లు, రీల్స్‌, స్కిట్లు లాంటివి చేసే వాళ్లను నియమించుకుంది. సమాచార ప్రసార శాఖ సహకారంతో ఎప్పటికప్పుడు న్యూస్‌ బులెటిన్‌ విడుదల చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడ కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చినా అన్ని దేశాలు, రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేసే ఎంఐయూ(మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌) ద్వారా సమాచారం అందుకొని వెంటనే రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లు, అవగాహన బృందాలకు పంపుతుంది. స్టూడియో నుంచి బులెటిన్లు విడుదల చేయడం, ఎఫ్‌ఎం రేడియోలో చెప్పించడం, సినిమా హాళ్లలో స్లైడ్స్‌ వేయించడం వంటివి చేస్తుంది. సైబర్‌ నేరాల బారిన పడినవారు గోల్డెన్‌ అవర్‌(మొదటి గంట)లోనే 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేస్తే డబ్బులు పోకుండా ఎలా సీజ్‌ చేయవచ్చో తెలియజేస్తుంది. సైబర్‌ నేరగాళ్లు, వారికి సహకరిస్తున్న వారిపైనా పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.

Updated Date - Oct 31 , 2025 | 04:22 AM