Nellore Police: అరుణ గ్యాంగ్ కోసం పోలీస్ వేట
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:11 AM
కి లేడీ నిడిగుంట అరుణ, రౌడీషీటర్ అవిలేలి శ్రీకాంత్‌ల నేర సామ్రాజ్యాన్ని వెలికి తీసేందుకు పోలీస్ యంత్రాంగం విస్తృత కసరత్తు చేస్తోంది.
నెల్లూరు(క్రైం), ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): కి‘లేడీ’ నిడిగుంట అరుణ, రౌడీషీటర్ అవిలేలి శ్రీకాంత్‌ల నేర సామ్రాజ్యాన్ని వెలికి తీసేందుకు పోలీస్ యంత్రాంగం విస్తృత కసరత్తు చేస్తోంది. వైసీపీ హయాంలో బెదిరింపులు, దాడులు, హత్యలు, బ్లాక్‌మెయిల్, దందాలకు పాల్పడుతూ పోలీసు ఉన్నతాధికారులను వలలో వేసుకొని ఎవరినీ లెక్క చేయకుండా శ్రీకాంత్, అరుణలు పేట్రేగిపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే అన్నింటికీ తలూపితే సరే లేకుంటే ప్రాణాలు తీసేంత స్థాయికి ఎదిగిపోయారు. అయితే, వీరిద్దరి ఆగడాలకు ప్రస్తుతం ప్రభుత్వంలో బ్రేక్ పడింది. రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు కావడంతో ఆ ప్రేమికుల నేర సామ్రాజ్యానికి బీటలు పడటం ప్రారంభమైంది. ఆ తర్వాత అరుణ అరెస్ట్‌తో వారితోపాటు నడిచిన గ్యాంగ్‌ల గుండెల్లో దడ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాంత్, అరుణల వ్యవహారం సంచలనంగా మారడంతో పోలీసు శాఖ సీరియ్‌సగా తీసుకుంది. ఈ క్రమంలో ఆ ప్రేమికులకు అండగా ఉన్న రౌడీ గ్యాంగ్‌ల వివరాలను సేకరించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలతోపాటు శ్రీకాంత్, అరుణలతో చేతులు కలిపి నేరాలకు పాల్పడిన వారి జాబితాను సిద్ధం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా ముందుగా గుర్తించిన రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే నెల్లూరులోని వేదాయపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో ముగ్గురు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకోగా, శనివారం వారిని అరెస్ట్ చూపించే అవకాశముంది. పోలీసుల దూకుడుతో పలువురు రౌడీషీటర్లు జిల్లాను వీడి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, గోవా వంటి ఇతర ప్రాంతాలకు పరారైనట్లు సమాచారం. వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు అరుణ తనను మోసం చేసిందంటూ శుక్రవారం విజయవాడ నుంచి ఓ వ్యక్తి నెల్లూరుకు వచ్చారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు కోవూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇస్తుండగా తిరిగి ఆయన్ను నెల్లూరుకు పిలిపించారు. అసలేం జరిగిందో సమగ్రంగా విచారిస్తున్నారు. అరుణ తన వద్ద రూ.21 లక్షలు తీసుకుని మోసగించినట్లు విజయవాడ వాసి తెలిపినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు ఆధారంగా అరుణపై మరో కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.