Share News

Fake Social Media Accounts: ఫేక్‌ చిచ్చుకు పోలీస్‌ ఉచ్చు

ABN , Publish Date - Nov 04 , 2025 | 03:51 AM

ఆ రెండు కులాలు ఏకమైనందునే ఎన్నికల్లో ఓడిపోయాం. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలిపోవాలి. అందుకే... ఆ కులాల మధ్య చిచ్చు పెట్టాలి. ఏ చిన్న ఘటన జరిగినా కులం రంగు పులిమి...

Fake Social Media Accounts: ఫేక్‌ చిచ్చుకు పోలీస్‌ ఉచ్చు

  • సోషల్‌ పోస్టుల ద్వారా కుల ఘర్షణలను రెచ్చగొట్టేవారిపై సీరియస్‌

  • మూడు నెలల్లో ఏరివేసేందుకు పక్కా ప్రణాళిక

  • విష సంస్కృతి వ్యాప్తి చేస్తున్న వ్యక్తులపై నిఘా

  • వారి 698 సోషల్‌ మీడియా ఖాతాల గుర్తింపు

  • పొరుగు రాష్ట్రాల్లో ఫేక్‌ కంటెంట్‌ సృష్టించి విదేశాల నుంచి సోషల్‌ మీడియాలో పోస్టు

  • వైరల్‌ అవగానే మొదటి ఖాతాల్లో డిలీట్‌

  • ఏఐ ద్వారా పసిగట్టిన పోలీసులు.. చర్యలకు సిద్ధం

  • (అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘ఆ రెండు కులాలు ఏకమైనందునే ఎన్నికల్లో ఓడిపోయాం. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలిపోవాలి. అందుకే... ఆ కులాల మధ్య చిచ్చు పెట్టాలి. ఏ చిన్న ఘటన జరిగినా కులం రంగు పులిమి... విద్వేష పూరిత కంటెంట్‌ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో వదలాలి’... ఇదో విష వ్యూహం! దీని కోసం దేశ, విదేశాల్లోని వారినీ వాడుకుంటున్నారు. అసలు కులం ఏదైనప్పటికీ... ఫలానా కులాన్ని స్ఫురింప చేసే ఇంటి పేరుతో ఫేక్‌ అకౌంట్లు సృష్టిస్తున్నారు. వారి చేత మరో కులాన్ని నిందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి ‘ఫేక్‌’ వ్యక్తులపై పోలీసులు దృష్టి సారించారు. ఏ కారణంతో ఏ చిన్న ఘటన జరిగినా కులాలు, మతాలు, ప్రాంతాలమధ్య చిచ్చుపెట్టే కుట్రలకు చెక్‌ చెప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అధికారం కోల్పోయిన అసహనంతో వైసీపీ తప్పుడు వార్తలు సృష్టించి తన సోషల్‌ మీడియా ద్వారా నేరుగా విషం చిమ్ముతోంది. గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది అక్టోబరు వరకూ వందల కొద్ది తప్పుడు పోస్టులు పెట్టారు. గడిచిన పదమూడు నెలలుగా సమాజంలో అశాంతికి బీజాలు నాటే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.


సీఎం ఆదేశాలతో కదలిక..

ఇద్దరు వ్యక్తుల వివాదంలో జరిగిన హత్యకు కులం రంగు పులిమి నానాయాగీ చేయడంతో ప్రభుత్వ పెద్దలు భయపడి మృతుడి కుటుంబసభ్యులకు భూములు, లక్షలాది రూపాయల పరిహారం ప్రకటించారు. ఇటీవల ఒక మహిళ అప్పుల వాళ్ల వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ హడావుడి చేసింది. ఇంకేముంది...ఆమెది ఉప ముఖ్యమంత్రి కులం.. వేధించిన వ్యక్తుల్లో ముఖ్యమంత్రి కులానికి చెందిన వ్యక్తి ఉన్నారంటూ వైసీపీ ప్రచారం మొదలు పెట్టింది. యూరియా విషయంలో రైతులను.. మెడికల్‌ కాలేజీల వ్యవహారంలో విద్యార్థులను రెచ్చగొట్టాలని చూశారు. రోజురోజుకూ శ్రుతి మించి జరుగుతున్న ఈ దుష్ప్రచారానికి ముగింపు పలకాలంటూ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

పొరుగు రాష్ట్రాల్లో సృష్టి.. విదేశాల నుంచి పోస్టు..

ముఖ్యమంత్రి ఆదేశాలతో చర్యలకు ఉపక్రమించిన పోలీసులు, తమ ప్రణాళిక అమలుకు, వ్యాప్తికి సైకో బ్యాచ్‌ అనుసరిస్తున్న పద్ధతులను పసిగట్టారు. అధునాతన సాంకేతికతతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)ను కూడా ఉపయోగించి కీలక సమాచారాన్ని సేకరించారు. ప్రభుత్వంపై ఎలా విషం చిమ్మాలి.. ఏ సందర్భంలో ఎలాంటి ఫేక్‌ కంటెంట్‌ సృష్టించాలి..ఏ దేశం నుంచి మొదట పోస్టు చేయించాలి..వేగంగా వైరల్‌ చేసి మొదట్లో పోస్టు చేసిన వారి ఖాతా నుంచి ఎలా డిలీట్‌ చేయాలి.. అనే పక్కా ప్రణాళికతో సైకో బ్యాచ్‌ నిరంతరం పని చేస్తున్నట్లు కనుక్కున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్‌ల్లో ఫేక్‌ కంటెంట్‌ క్రియేటర్లు ఉన్నట్లు ఆచూకీ లభించింది. కంటెంట్‌ సిద్ధం కాగానే బెల్జియం, అమెరికా, ఫ్రాన్స్‌, సింగపూర్‌, డెన్మార్క్‌, ఇండోనేసియా, నార్వే వంటి దేశాలకు పంపి అక్కడినుంచి సోషల్‌ మీడియాలో పోస్టు చేయిస్తున్నట్లు తేలింది.


అలా పసిగట్టి.. ఇలా శిక్షిస్తారు..

ఏపీతోపాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లినవారిని ఫేక్‌ ప్రచారానికి వాడుకొంటున్నట్లు మన పోలీసులు పసిగట్టారు. ప్రత్యేకంగా ఏఐ సహాయంతో తయారు చేయించిన యాప్‌ ద్వారా సేకరించిన సమాచారం మేరకు.. ఈ ఏడాది అక్టోబరు నాటికి విదేశాల్లో ఉంటున్నవారిలో 698 మంది అకౌంట్లను పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఈ అకౌంట్ల ద్వారా ఏది పోస్టు చేసినా క్షణాల్లోనే తెలిసిపోతోంది. ఆ వెంటనే వాస్తవం ఏమిటో (ఫ్యాక్ట్‌ చెక్‌) చెప్పేస్తారు.

అలర్ట్‌ నుంచి లొకేషన్‌ వరకూ..

అధికారం కోల్పోయినప్పటినుంచీతీవ్ర అసహనానికి గురవుతున్న మాజీ సీఎం జగన్‌ ‘మీ చేతిలో సెల్‌ఫోనే మీ ఆయుధం కావాలి..ప్రతిఒక్కరూ ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టాలి. వైసీపీ జెండా మోసిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం’ అంటూ చేసిన సూచనతో సైకో ముఠా ఇష్టారీతిన రెచ్చిపోతోంది.విదేశాల నుంచి వచ్చే ఫేక్‌ కంటెంట్‌ను విపరీతంగా వ్యాప్తి చేస్తుండటంతో పోలీసులు విరుగుడు కనుక్కున్నారు. ఫేక్‌ కంటెంట్‌ ఎక్కడ పోస్టు చేసినా క్షణాల్లో అలర్ట్‌ వచ్చేలా ఏఐ సాయంతో యాప్‌ సిద్ధం చేశారు. అందులో అలర్ట్‌ మొదలుకొని ట్రాకింగ్‌, సీడీఆర్‌ ఆటోమేటిగ్గా తెలుస్తాయి. వెంటనే సైబర్‌ పోలీసులు సంబంధిత వ్యక్తి లొకేషన్‌ను గుర్తిస్తారు. అంతిమంగా ఐపీ అడ్రస్‌ తెలుసుకుని, బాధ్యులను అరెస్టు చేసి జైలుకు పంపుతారు.

Updated Date - Nov 04 , 2025 | 03:52 AM