Share News

Andhra Pradesh Police: తాట తీస్తున్నారు

ABN , Publish Date - Dec 23 , 2025 | 03:46 AM

రాష్ట్రంలో రౌడీయిజానికి చోటు ఉండకూడదు. పోలీసులంటే నేరగాళ్లకు భయం ఉండాలి. శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు.. మూడు రోజుల క్రితం సీఎం చంద్రబాబు జిల్లాల ఎస్పీలకు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలివి.

Andhra Pradesh Police: తాట తీస్తున్నారు

  • నేరస్థులపై పోలీసుల ఉక్కుపాదం

  • శాంతిభద్రతల విషయంలో కఠిన వైఖరి

  • రేపిస్టులకు తమ మార్క్‌ ట్రీట్‌మెంట్‌

  • ఫిర్యాదు అందిన వెంటనే కటకటాల్లోకి

  • రౌడీలు, డాన్లపై పీడీ యాక్ట్‌

  • నిందితులను రోడ్లపై నడిపిస్తూ జైలుకు

  • గంజాయి బ్యాచ్‌పై కొరడా

  • ఎవరు చట్టాలు ఉల్లంఘించినా కేసులు

  • చంద్రబాబు, పవన్‌ హెచ్చరికలతో చర్యలు

నాడు

వైసీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లి ప్యాలె్‌సకు సమీపంలోనే ఘోరం జరిగింది. కృష్ణా నది ఒడ్డున కాబోయే భర్తతో కలిసి కూర్చున్న యువతిపై గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల్ని ఏళ్ల తరబడి అరెస్టు చేయలేకపోయారు.

నేడు

నవంబరులో చిత్తూరు జిల్లాలో ఓ యువతిపై గ్యాంగ్‌ రేప్‌ చేసిన నిందితులను ఒక్క రోజులోనే పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాజాగా మంగళగిరిలో మైనర్‌ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నలుగురు యువకులను ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే కటకటాల్లోకి పంపారు. అక్కడా, ఇక్కడా పోలీసులు నిందితులకు తమదైన శైలిలో ట్రీట్‌మెంట్‌ ఇచ్చి నడిరోడ్డుపై నడిపిస్తూ లాక్కెళ్లారు. శాంతిభద్రతల విషయంలో జగన్‌ సర్కారు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరుకు ఈ ఘటనలు ఓ ఉదాహరణ. నాడు రౌడీలు, అసాంఘిక శక్తులకు ప్రభుత్వ పెద్దలే వత్తాసు పలకగా.. ఇప్పుడు తేడా చేస్తే తాట తీస్తామంటున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘రాష్ట్రంలో రౌడీయిజానికి చోటు ఉండకూడదు. పోలీసులంటే నేరగాళ్లకు భయం ఉండాలి. శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు’.. మూడు రోజుల క్రితం సీఎం చంద్రబాబు జిల్లాల ఎస్పీలకు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలివి. ‘రౌడీయిజం చేస్తే సహించబోం.. యోగి ఆదిత్యనాథ్‌(యూపీ సీఎం) ట్రీట్‌మెంట్‌ ఇస్తాం..’ అంటూ తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వార్నింగ్‌. వాస్తవానికి ఇంతకుముందు కూడా శాంతిభద్రతలపై చంద్రబాబు, పవన్‌ కఠిన వైఖరి స్పష్టం చేశారు. వారి హెచ్చరికలు ఫలిస్తున్నాయి. నేరస్థుల పట్ల పోలీసులు ఉక్కుపాదం మోపోతున్నారు.


యోగి తరహాలో ఎన్‌కౌంటర్లు చేయడం, బుల్డోజర్లు పంపడం వంటివి కాకపోయినా కఠిన చర్యలు ప్రారంభమయ్యాయి. రౌడీలు, అసాంఘికశక్తులకు వణుకు పుట్టిస్తున్నారు. ఇటీవల తీవ్రమైన నేరాల విషయంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా అనంతపురంలో కత్తితో దాడిచేసిన ఓ రౌడీకి పోలీసులు తమ మార్క్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని అరవిందనగర్‌లో ఒక వైన్‌ షాపు వద్ద ఆదివారం రాత్రి గొడవ జరిగింది. మద్యం కావాలని అడిగిన రాజా అనే వ్యక్తిపై రౌడీ అజయ్‌ కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి పారిపోయాడు. సోమవారం ఉదయం అజయ్‌ను పట్టుకునేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక ఎస్‌ఐ ఆటోలో వెళ్లగా.. అతడు పొదల్లోకి పారిపోయాడు. కాసేపటి తర్వాత బయటికి వచ్చి పోలీసుల్ని తీసుకొచ్చాడన్న కోపంతో ఆటో డ్రైవర్‌పై కత్తితో దాడి చేశాడు. ఆటో డ్రైవర్‌ పొట్టలో నుంచి పేగులు బయటికి వచ్చేలా పొడిచి పరుగు తీశాడు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జగదీశ్‌ ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. గాలించేందుకు వెళ్లిన సీఐపైనా అజయ్‌ కత్తితో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. సీఐ రివాల్వర్‌ బయటికి తీసి, కాస్త దూరం వెంబడించి అజయ్‌ కాల్లోకి బుల్లెట్‌ దించడంతో కింద పడ్డాడు. రెచ్చిపోయి అలజడులు సృష్టిస్తాం.. కత్తులు తీసి దాడులకు తెగబడతామంటే అంతే కఠినంగా దండిస్తామని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌ రౌడీలను హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎవరైనా భయోత్పాతాన్ని సృష్టించినా.. హద్దులు మీరి ప్రవర్తిస్తూ పోలీసులపైనే దాడులు చేసినా తీవ్రంగా స్పందిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. రాష్ట్రంలోనే అత్యధికంగా అనంతపురం జిల్లాలో 2,599 మందిపై రౌడీ షీట్లు ఉన్నాయని, శాంతిభద్రతలు ఉల్లంఘిస్తే ఎవరినీ వదలబోమని స్పష్టం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే జగన్‌ పుట్టినరోజు వేడుకలలో మూగజీవాలను బలి ఇచ్చి, ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన 26 మంది వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో 13 మందిని అరెస్టు చేసి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించారు. మరో ముగ్గురిని తహసీల్దారు వద్ద బైండోవర్‌ చేశారు. కొన్ని చోట్ల ఫ్లెక్సీలపై ‘2029లో రప్పా రప్పా’ అని రాయించారు. నిందితులు వేట కొడవళ్లు చేత పట్టుకుని చిందులు వేశారు. ఓ గ్రామంలో ‘రప్పా రప్పా..’ అంటూ కేకలు వేశారు.


రేపిస్టులకు దండన.. ఆంధ్రప్రదేశ్‌లో ఆడబిడ్డలపై అత్యాచారానికి పాల్పడేవారికి అవే చివరి రోజులు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సందర్భాల్లో హెచ్చరించారు. చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు రేపిస్టుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. తమదైన శైలిలో ట్రీట్‌మెంట్‌ ఇవ్వడమే గాక రోడ్లపై నడిపించి తీసుకెళ్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ఇటీవల మైనర్‌ బాలికను తోటలోకి తీసుకెళ్లి వృద్ధుడు (సమీప బంధువు) అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కోర్టుకు తీసుకెళుతుండగా మార్గమద్యంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి అంటూ వాహనం దిగి చెరువులో దూకేశాడు. మరుసటి రోజు శవమై కనిపించాడు.

నెల్లూరులో రౌడీలపై భరతం

ప్రశాంతంగా ఉండే జిల్లాగా పేరున్న నెల్లూరులో గత వైసీపీ ప్రభుత్వంలో రౌడీల సంఖ్య బాగా పెరిగింది. పురుషులతో పోటీ పడి మహిళలు సైతం ఇక్కడ డాన్లుగా తయారయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వందల మంది రౌడీలపై ఉక్కుపాదం మోపింది. గ్యాంగ్‌లు ఏర్పాటు చేసి దందాలు, బెదిరింపులకు పాల్పడుతున్న నిడిగుంట అరుణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె అరాచకాలకు సంబంధించి ఆధారాలన్నీ సేకరించి పీడీ యాక్టు నమోదు చేసి కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఇదే సమయంలో నెల్లూరులో జరిగిన సీపీఎం నాయకుడి హత్యలో అరవ కామాక్షి అనే మరో మహిళను అరెస్ట్‌ చేశారు. జిల్లాలోని మొత్తం రౌడీలందరినీ వెతికి వెతికి రోడ్లపై నడిపిస్తున్నారు. ఆ మధ్య తెనాలిలో గంజాయి బ్యాచ్‌ను నడిరోడ్డుపై పోలీసులు లాఠీలతో దండించిన వీడియోలు మరోమారు వైరల్‌ అవుతున్నాయి. అమాయకులు, ఆడవాళ్లపై అఘాయిత్యాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - Dec 23 , 2025 | 03:48 AM