Interlinking of Rivers: ఇచ్చంపల్లి నుంచి కాదు.. పోలవరం నుంచి కావేరి అనుసంధానం
ABN , Publish Date - Jul 16 , 2025 | 04:06 AM
జాతీయ నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా తెలంగాణలోని ఇచ్చంపల్లి నుంచి కర్ణాటకలోని కావేరి అనుసంధాన పథకానికి బదులు ఆంధ్రప్రదేశ్ జీవన రేఖ పోలవరం నుంచి గోదావరిని కావేరి నదికి అనుసంధానించాలని...
ఎన్‌డబ్ల్యూడీఏ భేటీలో కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ సూచన
జాతీయ జల అభివృద్ధి సంస్థదీ అదే ఆలోచన
ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయం
ధవళేశ్వరం ఆనకట్ట పాతబడిపోయింది
పోలవరం నుంచి అనుసంధానించడం మేలు
రాష్ట్ర జల వనరుల శాఖ ప్రతిపాదన
అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): జాతీయ నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా తెలంగాణలోని ఇచ్చంపల్లి నుంచి కర్ణాటకలోని కావేరి అనుసంధాన పథకానికి బదులు ఆంధ్రప్రదేశ్ జీవన రేఖ పోలవరం నుంచి గోదావరిని కావేరి నదికి అనుసంధానించాలని రాష్ట్ర జలవనరుల శాఖ సూచించింది. గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై మంగళవారం జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) గోదావరి పరివాహక రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఏపీ జల వనరుల శాఖ తరఫున అంతర్రాష్ట్ర నదీజలాల విభాగం చీఫ్ ఇంజనీర్ సుగుణాకరరావు బృందం పాల్గొంది. ఈ సందర్భంగా ధవళేశ్వరం-కావేరి అనుసంధానంపై చర్చ జరిగింది. ధవళేశ్వరం ఆనకట్ట చాలా పురాతనమైపోయిందని.. నదుల అనుసంధాన ప్రవాహ వేగాన్ని తట్టుకునే పరిస్థితిలో లేదని రాష్ట్రం వివరించింది. పైగా ఈ ప్రాంతంలో కాలువల తవ్వకం కోసం భూసేకరణ కష్ట సాధ్యమని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సమీపంలోనే ఉన్న పోలవరం ప్రాజెక్టు నుంచి కావేరికి అనుసంధానం చేపట్టాలని ప్రతిపాదించింది. తెలంగాణలోని ఇచ్చంపల్లి వద్ద గోదావరి జలాల్లో 300 టీఎంసీల లోటు ఉన్నందున.. అక్కడి నుంచి కావేరికి అనుసంధాన ప్రక్రియ చేపడితే కేంద్రం ఆశించిన ప్రయోజనాలు నెరవేరవని రాష్ట్రం అభిప్రాయపడింది. ఈ పథకాన్ని ఇచ్చంపల్లి నుంచి అమలు చేయాలంటే 147 టీఎంసీలు అవసరమని కేంద్రం ఈ భేటీలో వెల్లడించింది. ఇందులో సగం నీటిని వ్యవసాయానికి వినియోగించాల్సి ఉంటుందని తెలిపింది. ఛత్తీస్‌గఢ్ ఇప్పటిదాకా వినియోగించని 127 టీఎంసీల మిగులు జలాలను ఈ పథకం కోసం వాడతామని ప్రతిపాదించింది.
అయితే.. కేంద్ర జల సంఘం గణాంకాలను పరిశీలిస్తే.. ఇచ్చంపల్లి-కావేరి అనుసంధానానికి 75 శాతం నికర జలాలు లేవని ఎన్‌డబ్ల్యూడీఏ తేల్చింది. ఇదే సమయంలో ఛత్తీస్‌గఢ్ తన వాటా 127 టీఎంసీలను పూర్తిగా వాడుకుంటే.. ఇప్పటికే ఇచ్చంపల్లి వద్ద గోదావరి జలాల్లో 300 టీఎంసీల లోటు ఉన్నందున.. ఇక్కడి నుంచి కావేరికి అనుసంధానం వీలు కాదని తెలిపింది. ఈ నేపథ్యంలో పోలవరం నుంచి కావేరికి నదుల అనుసంధానం చేపట్టాలని సుగుణాకరరావు బృందం ప్రతిపాదించింది. 2023లో జరిగిన సమావేశంలో.. గోదావరి అవార్డుకు లోబడి ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి జలాల్లో అధిక వాటా ఉన్నట్లు ఆమోద ముద్ర వేయడాన్ని ఎన్‌డబ్ల్యూడీఏ తాజా భేటీలో గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో పోలవరం-కావేరి నదుల అనుసంధాన ప్రక్రియను చేపట్టడమే మంచిదన్న ఆలోచనకు వచ్చింది. ఈ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది.