CEO Yogesh Pathanker: 2027పోలవరం.. జూన్‌కల్లా పూర్తికావాలి
ABN , Publish Date - Dec 25 , 2025 | 04:12 AM
పోలవరం ప్రాజెక్టును 2027 జూన్‌నాటికి పూర్తి చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ముఖ్య కార్యనిర్వహణాధికారి...
పీపీఏ సీఈవో యోగేశ్ నిర్దేశం.. ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ సీఎం ఇదే స్పష్టంచేస్తున్నారు
త్వరగా పూర్తిచేయాలన్నదే కేంద్రం ఉద్దేశం కూడా
బాధ్యతలు చేపట్టాక తొలిసారి ప్రాజెక్టు వద్దకు
మొదట పునరావాస గ్రామాల్లో పర్యటన
మౌలిక వసతులు, పరిహారంపై ఆరా
తర్వాత ప్రాజెక్టు క్షేత్ర ప్రాంతానికి సీఈవో
బట్రస్, డయాఫ్రం వాల్ పనులపై సంతృప్తి
జల విద్యుత్కేంద్రం కూడా సందర్శన
అమరావతి/పోలవరం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును 2027 జూన్‌నాటికి పూర్తి చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) యోగేశ్ పైథాంకర్ దిశానిర్దేశం చేశారు. సీఈవోగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా బుధవారం ప్రాజెక్టు ప్రాంతంలో ఆయన పర్యటించారు. నిర్వాసితులకు అందిస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలను తెలుసుకునేందుకు తొలుత నేరుగా ముం పు ప్రాంతాలకు వెళ్లారు. నిర్వాసితులతో మాట్లాడారు. సహాయ పునరావాసం అందుతున్న తీరును వారిని, అధికారులను కూడా అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో రెండు దఫాలుగా దాదాపు రూ.2వేల కోట్లను నిర్వాసితుల ఖాతాల్లో ప్రాజెక్టు అధికారులు ఆయనకు తెలియజేశారు. ఆ తర్వాత యోగేశ్ బృందం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంది. వారికి ఈఎన్‌సీ నరసింహమూర్తి, మేఘా సీవవో ఏఎన్వీ సతీశ్‌బాబు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రాజెక్టు స్పిల్‌వే, గ్యాప్-1, 2 ప్రాంతాలను.. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల వద్ద బట్రస్ డ్యాం, డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని, కాంక్రీటు నాణ్యత ల్యాబ్‌లను బృందం సభ్యులు పరిశీలించారు. డయాఫ్రం వాల్ పనులు 83 శాతం పూర్తి కావడం.. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం పనులు 14 శాతం దాకా జరగడంపై యోగేశ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేస్తున్నారని గుర్తుచేశారు. ఇటీవల ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్‌ను కలిసినప్పుడు కూడా ఇదే చెప్పారని తెలిపారు. కేంద్రం సైతం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసే ఉద్దేశంతో ఉందన్నా రు. డయాఫ్రం వాల్‌కు సంబంధించి ఇంకో 17 శా తం పనులే మిగిలి ఉన్నందున.. మరోవైపు సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులూ చేపడుతున్నందున 2027 జూన్ లక్ష్యాన్ని చేరుకోవలసిందేనని స్ప ష్టం చేశారు.
అనంతరం పోలవరం జల విద్యుత్కేంద్రాన్ని సందర్శించారు. ఇప్పటికే మూడు యూ నిట్లు సిద్ధమయ్యాయని.. మిగిలిన పనులన్నీ 2027 నాటికి పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థ వెల్లడించింది. అదేవిధంగా కుడి, ఎడమ ప్రధాన కాలువల కనెక్టివిటీ టన్నెళ్ల పనులనూ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి పనినీ పూర్తి చేసేందుకు నిర్దేశించిన గడువు, ఇతర వివరాలను, నిర్మాణాల పురోగతిని మేఘా సీవోవో వివరించారు. 2027లో గోదావరి ప ుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు రూ పొందించుకుని పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. కేంద్రం పోలవరాన్ని ప్రతిష్ఠాత్మకం గా తీసుకుందని.. ఎలాంటి జాప్యం లేకుండా నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలని అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సీఈవో సూచించారు. క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ కె.శేషుబాబు, ఎస్‌ఈ కె.రామచంద్రరావు, క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈ తిరుమలరావు, ఈఈ కె.బాలకృష్ణ, మేఘా జీఎం గంగాధర్, డీజీఎం మురళి పమ్మి, క్వాలిటీ కం ట్రోల్ ఈఈలు నరసింహారావు, ప్రేమ్‌చ ంద్, డీఈలు నిర్మల, శ్రీకాంత్, విజయ్‌కుమార్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నాడు జగన్ చేతులెత్తేశారు: నిర్వాసితులు
మొదట పీపీఏ సీఈవో, ఎం.రఘురాం, పవర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్లు సీవీ సుబ్బయ్య, ఎం.రమేశ్ కుమార్, పీ అండ్ డీ డైరెక్టర్ కె.శంకర్‌తో కూడిన బృందం పోలవరం పునరావాస గ్రామాలను సందర్శించింది. ఎల్‌ఎన్‌డీపేట సమీపంలో ఉన్న కొండ్రుకోట (పంచాయతీ) పునరావాస కాలనీలో మౌలిక వసతులను.. పాఠశాల, అంగన్వాడీ సెంటర్, సచివాలయ భవనాలను పరిశీలించింది. అక్కడ నిర్వాసితులతో మాట్లాడి మౌలిక వసతుల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో వారికి పరిహారం చెల్లించకపోవడంపై యోగేశ్ ఆరా తీశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు గోదావరి వరదల సమయంలో ముంపు ప్రాంతాలను సందర్శించారని.. కొంత మంది నిర్వాసితులను మాత్రమే కలిశారని వారు తెలిపారు. కేంద్రం నిధులిస్తేనే పరిహారం చెల్లించగలనని.. పునరావాస కాలనీలను నిర్మించగలనని.. లేదంటే తానేమీ చేయలేనంటూ ఆయన చేతులెత్తేశారని చెప్పారు. చంద్రబాబు గత ఏడాది ముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యతలు స్వీకరించాక.. రెండు సార్లు తమ బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా పరిహారం జమ చేశారని అన్నారు. ఒకసారి రూ.998 కోట్లు, రెండోసారి రూ.1,000 కోట్లు చెల్లింపులు చేసినట్లు అధికారులు వివరించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్, ఎక్స్ అఫీషియో జేసీ వి.అభిషేక్, ఏలూరు జేసీ ఎంజే అభిషేక్ గౌడ, ఆర్డీవో ఎంవీ రమణ, ఐటీడీవో పీవో రాములు నాయక్, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు తదితర అధికారులు, గిరిజన నాయకులు పాల్గొన్నారు.