Share News

AP Govt: పోలవరంలో పండగ

ABN , Publish Date - Nov 02 , 2025 | 04:54 AM

ఆంధ్ర రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తి చేస్తాం. దానికి ఆరు నెలల ముందే పునరావాసం, కాలనీల నిర్మాణం పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం...

AP Govt: పోలవరంలో పండగ

  • నిర్వాసితులకు నిధుల జమ మొదలు

  • 2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి

  • ఆరు నెలలు ముందే పునరావాసం: నిమ్మల

ఏలూరు/వేలేరుపాడు, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్ర రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తి చేస్తాం. దానికి ఆరు నెలల ముందే పునరావాసం, కాలనీల నిర్మాణం పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది’ అని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పోలవరం భూసేకరణ - పునరావాసం నిమిత్తం కేంద్రం రూ.1,000 కోట్ల విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా వేలేరుపాడులో నిర్వాసితులకు పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చిత్రపటాలకు ఆయన లబ్ధిదారులతో కలసి పాలాభిషేకం చేశారు. సభ ప్రారంభమైన గంటలోనే నిర్వాసితుల ఖాతాల్లో రూ.45 కోట్లు జమ అయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘ఈ ఏడాది జనవరి 3న రూ.900 కోట్లు పరిహారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. 2016లో తొలి విడతగా రూ.700 కోట్లు జమ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన 18 నెలల కాలంలోనే రెండో విడతగా నిధులు జమ చేశాం. 41.15 కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు పరిహారం, ఇతర కాలనీల నిర్మాణాన్ని జూన్‌ 2026కు పూర్తి చేస్తాం. ఇళ్ల నిర్మాణానికి రూ.739 కోట్లతో టెండర్లు పూర్తి అయ్యాయి. డిసెంబరులో పనులు ప్రారంభం అవుతాయి. వైసీపీ హయాంలో 2022 నుంచి అటకెక్కించిన భూసేకరణను ఒక కొలిక్కి తీసుకొస్తున్నాం. 17,114 కుటుంబాలకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం పరిహారాన్ని 2026 డిసెంబరు నాటికి అందించి తీరుతాం. రెండో విడత పరిహారంపై మరింత దృష్టి సారిస్తాం.


పోలవరం 45.72 మీటర్ల కాంటూరు పరిధిలో 67,622 ఎకరాలకు గాను 29,729 ఎకరాలు భూసేకరణ చేయడంతో 44 శాతం పూర్తి అయ్యింది. ప్రస్తుతం 79 నిర్వాసిత కాలనీలకు గాను ఈ ప్రాంతంలో 49 కాలనీలు నిర్మాణంలో ఉన్నాయి. సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం’ అని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు కలిగిన నష్టాన్ని వివరించారు. రాష్ర్టానికి పట్టిన శని జగన్మోహన్‌రెడ్డి అంటూ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేశారంటూ విమర్శించారు. ‘పరిహారాల చెల్లింపులో అవరోధాలు ఏర్పడితే వాటిని పరిష్కరించే విధంగా ప్రత్యేక గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ నంబరు ఇస్తాం. పరిహారం రాని నిర్వాసితులు ఈ గ్రీవెన్‌ సెల్‌లో దరఖాస్తు చేసుకుంటే దాన్ని ఆన్‌లైన్‌ చేసి 20 రోజుల్లోగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని మంత్రి నిమ్మల ప్రకటించారు. కార్యక్రమంలో పోలవరం, రంపచోడవరం ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, శిరీషాదేవి, జడ్పీ చైర్మన్‌ ఘంటా పద్మశ్రీ, కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ ప్రశాంతి, ఆర్‌అండ్‌ఆర్‌ అడ్మినిస్ట్రేటర్‌ అభిషేక్‌, జేసీ అభిషేక్‌ గౌడ, పోలవరం ఈఎన్‌ఎసీ నర్శింహమూర్తి, సలహాదారు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


ఖాతాల్లో సొమ్ము జమ.. నిర్వాసితుల ఆనందం

ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన పరిహారం సొమ్ములు జమ కాని నిర్వాసితులకు శనివారం సాయంత్రం నుంచి ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం, గృహ నష్ట పరిహారాలు జమ అవుతున్నాయి. వేలేరుపాడు మండలంతో పాటు కుక్కునూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరం, వరరామచంద్రాపురం, దేవీపట్నం మండలాల్లోని నిర్వాసితుల ఖాతాలకు పరిహారాల సొమ్ము జమవుతోంది.

ఎంతో ఆనందంగా ఉంది

జనవరిలో పోలవరం పరిహారం ఖాతాలో పడకపోవడంతో పరిహారం వస్తుందా..? రాదా..? అని ఆందోళన చెందాను. ఈ రోజు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, గృహ నిర్మాణానికి సంబంధించి పరిహారం జమ కావడం ఎంతో ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

- సజ్జల సుబ్బులమ్మ, వేలేరుపాడు

హామీ ఇచ్చిన గంటల్లోనే సొమ్ము జమ

మంత్రి నిమ్మల హామీ ఇచ్చిన కొద్ది గంటల్లోనే పోలవరం పరిహారం ఖాతాలో జమ కావడం ఆనందంగా ఉంది. ఇంతకాలం పరిహారం కోసం ఎదురు చూసిన నాకు ఈ రోజు పరిహారం జమ అయింది.

- బీరం రామాంజనేయులు, వేలేరుపాడు

Updated Date - Nov 02 , 2025 | 04:56 AM