Polavaram Project: 2027కల్లా పూర్తిచేయాలి
ABN , Publish Date - Oct 07 , 2025 | 03:30 AM
పోలవరం ప్రాజెక్టును తాజా ప్రణాళికల మేరకు 2027 డిసెంబరునాటికి పూర్తి చేయాల్సిందేనని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టంచేశారు.
ఆలోపే పునరావాసం కూడా
పోలవరంపై కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ స్పష్టీకరణ
ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష
బిహార్ ఎన్నికల తర్వాత వస్తానని కేంద్ర మంత్రి వెల్లడి
అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును తాజా ప్రణాళికల మేరకు 2027 డిసెంబరునాటికి పూర్తి చేయాల్సిందేనని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టంచేశారు. ఆలోపే సహాయ పునరావాస పనులూ పూర్తి కావాలన్నారు. పోలవరం పురోగతిపై సోమవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమీక్ష జరిపారు. కేంద్ర ఆర్థిక, జలశక్తి శాఖల సంయుక్త కార్యదర్శులు, రాష్ట్ర జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), ఇతర కేంద్ర ఏజెన్సీల అధికారులు, నిపుణులు పాల్గొన్నారు. కీలకమైన డయాఫ్రం వాల్, ఈసీఆర్‌ఎఫ్ డ్యాం గ్యాప్-1, గ్యాప్-2 పనుల్లో వేగం కనిపిస్తున్నా, పునరావాసం మాత్రం చాలా వెనుకబడిందని పాటిల్ అన్నారు.సరిపడా నిధులున్నా ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. సకాలం లో వాటిని ఖర్చు చేయకపోతే సాంకేతిక, న్యాయపరమైన వివాదాలు వస్తాయన్నారు. నిర్వాసితులకు ఏకమొత్తంలో ఒకే దఫా నిధులిస్తే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సానుకూలత ఏర్పడుతుందన్నారు.ప్రాజెక్టు పనులు పరిశీలించేందుకు రాష్ట్రానికి రావాలని పాటిల్‌ను నిమ్మల కోరారు. అయితే, బిహార్ ఎన్నికలయ్యాక వస్తానన్నారు. టీడీపీ 2019లో మళ్లీ అధికారంలోకి వచ్చిఉంటే.. 2021కే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని పాటిల్‌కు నిమ్మల తెలిపారు. నాటి సీఎం జగన్ కేంద్రం మాటలను కూడా లెక్కచేయకుండా.. రివర్స్ టెండర్ పేరిట నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.
పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి
2027లో ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం: నిమ్మల
న్యూఢిల్లీ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును 2027లో గోదావ రి పుష్కరాలకు ముందే.. అంటే ఆ ఏడాది జూన్‌లోనే పూర్తి చేసి..ప్రధాని మో దీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నిమ్మల రామానాయడు తెలిపారు.పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.12,157 కోట్లు మంజూరు చేయగా..ఇప్పటికే రూ.5,052 కోట్లు విడుదల చేసిందని చెప్పారు.నిధుల సమస్య లేనే లేదని, తొలి దశలో సహాయ పునరావాస పనులను వచ్చే మేనాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రెండో దశ నిర్వాసితులకు 2027 మార్చికల్లా కాలనీలు నిర్మించి, సదుపాయాలు సమకూర్చనున్నట్లు తెలిపారు. 2019-24 మధ్య ఐదేళ్లలో జరిగిన పోలవరం విధ్వంసాన్ని, కూటమి ప్రభుత్వ వచ్చిన తర్వాత గాడిలో పెట్టి.. పనులను పరుగులు పెట్టిస్తున్న నేటి స్థితి వరకు సమీక్షలో చర్చించామన్నారు.