Polavaram Project Makes Strong Progress: పోలవరంలో కీలక పనులు భేష్!
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:22 AM
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనుల తీరును పోలవరం ప్రాజెక్టు అథారిటీ ...
ఎర్త్ వర్క్ 79.37 శాతం పూర్తి
37.72 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు కూడా
కుడికాలువ మట్టి పనులు పూర్తి
ఎడమ కాలువ లైనింగ్ పనులు 75ు అయ్యాయి
ప్రాజెక్టు పురోగతిపై పీపీఏ నిత్యం సమీక్ష
వచ్చే నెలలో రానున్న అంతర్జాతీయ నిపుణులు
అమరావతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం పనుల తీరును పోలవరం ప్రాజెక్టు అథారిటీ (ఎప్పటికప్పుడు) సమీక్షిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రైమావీరా సాఫ్ట్‌వేర్ ఆధారంగా నిరంతర పర్యవేక్షణ చేస్తోంది. తాను పరిశీలించిన అంశాలను ఎప్పటికప్పుడు తన వెబ్‌సైట్‌లో పెడుతోంది. హెడ్‌వర్క్స్‌లో అత్యంత కీలకమైన ఎర్త్ వర్క్ పనులు 1,825.88 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 79.37 శాతం అంటే 1,449.13 లక్షల క్యూబిక్ మీటర్ల మేర జరిగాయని తాజాగా వెల్లడించింది. ‘కాంక్రీట్ పనులు 44.54 లక్షల క్యూబిక్ మీటర్లకు 37.72 లక్షల క్యూబిక్ మీటర్లు (84.69 శాతం) పూర్తయ్యాయి. 77,744.29 మెట్రిక్ టన్నుల స్టీల్‌కు గాను 67,059.52 మెట్రిక్ టన్నులు (86.2 శాతం) వాడారు. పోలవరం కుడి ప్రధాన కాలువ పనుల్లో ఎర్త్ వర్క్ (1154.67 లక్షల క్యూబిక్ మీటర్లు) పూర్తయిపోయింది. లైనింగ్ పనులు 19.25 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 18.06 లక్షల క్యూబిక్ మీటర్లు (93.82ు) జరిగాయి. 255 స్ట్రక్చర్లలో 211 (83.5 శాతం) నిర్మించారు. ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి 1174 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్‌కు గాను 1,115.56 లక్షల క్యూబిక్ మీటర్ల (94.96ు) పని జరిగింది. లైనింగ్ పనులు 75 శాతం.. అంటే 11.08 లక్షల క్యూబిక్ మీటర్లు జరిగాయి. స్ట్రక్చర్లు 461 కట్టాల్సి ఉండగా.. 172 కట్టారు. తొలిదశలో 172 హేబిటేషన్లు ముంపునకు గురవుతాయి. వాటిలో 38 హేబిటేషన్లను ఇప్పటిదాకా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తొలిదశకు సంబంధించి 26 పునరావాస కాలనీలనూ పూర్తి చేశారు. అయితే 38,060 మంది నిర్వాసితుల్లో 14,371 మందిని మాత్రమే ఇప్పటిదాకా సురక్షిత ప్రాంతానికి పంపించగలిగారు. తొలిదశ భూసేకరణలో 1,00,100 ఎకరాలకు గాను 86,995 ఎకరాలు సేకరించారు. రూ.12,832 కోట్ల నిధులు అవసరం కాగా.. ఇప్పటికి రూ.6,223 కోట్లు ఖర్చుచేశారు. కేంద్రం నుంచి మరో 6,609 కోట్లు రావలసి ఉంది. మొత్తంగా ప్రాజెక్టు ప్రధాన పనులు చురుగ్గా సాగుతున్నాయి’ అని అందులో వివరించింది. పోలవరం పనుల తీరు పరిశీలనకు వచ్చే నెలలో అంతర్జాతీయ నిపుణుల బృందం వస్తున్న తరుణంలో పనుల వేగం పెంచడంపై పీపీఏ దృష్టి సారించింది.