Ministry of Water: రూ.2,200 కోట్లిస్తే..పునరావాసానికి ఖర్చు చేయరేం
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:08 AM
పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ముందస్తుగా రూ.2,200 కోట్లు విడుదల చేసినా.. సహాయ, భూసేకరణ కోసం ఎందుకు ఖర్చు చేయడం లేదని రాష్ట్ర జల వనరుల శాఖపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ప్రైమావెరా’ యాప్‌లో పోలవరం పనుల వివరాలేవీ?
జల వనరుల శాఖపై కేంద్ర జలశక్తి కార్యదర్శి సీరియస్
1,100 కోట్లు, లబ్ధిదారుల జాబితా సిద్ధంగా ఉన్నాయన్న ఈఎన్‌సీ నరసింహమూర్తి
మరి ఎందుకు చెల్లించలేదన్న దేబర్షి
డయాఫ్రం వాల్ పనుల్లో ఆలస్యం..డిసెంబరుకల్లా పూర్తిచేయగలరా:కార్యదర్శి
కుదరకపోతే ఫిబ్రవరి, మార్చినాటికిపూర్తిచేస్తామన్న రాష్ట్రప్రభుత్వం
పనుల్లో వేగం పెంచాలని దేబర్షి సూచన
అమరావతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ముందస్తుగా రూ.2,200 కోట్లు విడుదల చేసినా.. సహాయ, భూసేకరణ కోసం ఎందుకు ఖర్చు చేయడం లేదని రాష్ట్ర జల వనరుల శాఖపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రాజెక్టుపై ఆమె ఢిల్లీ నుంచి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, కేంద్ర జలసంఘం అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు. నిధులిస్తున్నా నిధులు వ్యయం చేయకపోవడంపై రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాస్తానని దేబర్షి న్నారు. కేంద్ర నిధులను ఎందుకు సకాలంలో ఖర్చు చేయడం లేదని నిలదీశారు. సహాయ పునరావాసానికి ఎంత మొత్తం చెల్లించాల్సి ఉందని ఈఎన్‌సీని ప్రశ్నించారు. సలహాదారు వెంకటేశ్వరరావుకు కూడా నిధుల వ్యయంపై ప్రశ్నలు సంధించారు. రూ.1,100 కోట్లు చెల్లించేందుకు లబ్ధిదారుల జాబితా సిద్ధంగా ఉందని ఈఎన్‌సీ చెప్పినప్పుడు.. మరి ఎందుకు చెల్లించడం లేదని దేబర్షి మరోమారు సీరియస్ అయ్యారు. నిధుల వ్యయం విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నామని స్పష్టంచేశారు. పోలవరం పనుల వివరాలను కేంద్ర ప్రభుత్వ యాప్ ‘ప్రైమావెరా’లో ఎందుకు అప్‌లోడ్ చేయడం లేదని కూడా ఆమె ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయకపోతే.. ప్రాజెక్టు ప్రగతిని తామెలా సమీక్షించగలుగతామని ఆక్షేపించారు. 20 రోజుల్లో పోలవరం పనులన్నింటినీ ఆ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. డయాఫ్రం వాల్ డిజైన్లన్నీ ఆమోదించామని.. గ్యాప్-1, గ్యాప్-3 డిజైన్లను కూడా త్వరలోనే ఆమోదిస్తామని జల సంఘం వెల్లడించింది. డయాఫ్రం వాల్ పనుల్లో వెనుకబడి ఉన్నందున షెడ్యూల్ మేరకు డిసెంబరులోగా పూర్తి చేయగలరా అని దేబర్షి అడిగారు.
యంత్ర సామగ్రి రావడం ఆలస్యమైందని.. డిసెంబరు నాటికే పనులు పూర్తి చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తామని.. ఒకవేళ కుదరకపోతే 2026 ఫిబ్రవరి, మార్చి నాటికి కచ్చితంగా పూర్తి చేస్తామని నరసింహమూర్తి బదులిచ్చారు. ఒకసారి షెడ్యూల్ ప్రకటించాక... వాయిదాలు వేస్తే ఎలాగని దేబర్షి నిలదీశారు. సవరించిన టైం షెడ్యూల్‌ను పంపాలని నరసింహమూర్తిని ఆదేశించారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. క్వాలిటీ కంట్రోల్ యూనిట్ ఏర్పాటుపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.