Polavaram Nallamala Sagar Project: రూ.58,700 కోట్లు!
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:58 AM
పోలవరం బనకచర్ల అనుసంధాన పథకం స్థానంలో పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టుకు కార్యాచరణ సిద్ధమైంది....
పోలవరం-నల్లమలసాగర్ అంచనా వ్యయమిది
‘బనకచర్ల’ స్థానంలో కొత్త పథకానికి కార్యాచరణ
24న ముఖ్యమంత్రి సమీక్షలో తుది మెరుగులు
డీపీఆర్ తయారీకి నేడో రేపో బిడ్లకు ఆహ్వానం
పోలవరం టూ బొల్లాపల్లి టూ నల్లమలసాగర్
గోదావరి వరద జలాల ఎత్తిపోత
రోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీలు
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు
వెలిగొండ, గుండ్లకమ్మ, ఇతరాల పరిధిలో 6 లక్షల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ
60 లక్షల జనాభాకు తాగునీటి సరఫరా
మూడు దశల్లో పూర్తిచేయాలని నిర్ణయం
కొత్త పథకంపై ముందే వెల్లడించిన ‘ఆంధ్రజ్యోతి’
అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం స్థానంలో పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుకు కార్యాచరణ సిద్ధమైంది. రూ.58,700 కోట్ల అంచనా వ్యయంతో దీనిని చేపట్టాలని రాష్ట్ర జల వనరుల శాఖ నిర్ణయించింది. పోలవరం నుంచి బొల్లాపల్లి రిజర్వాయరుకు.. అక్కడి నుంచి నల్లమలసాగర్‌కు గోదావరి వరద జలాలను ఎత్తిపోయడం దీని ఉద్దేశం. రోజుకు రెండు టీఎంసీల చొప్పున 100 రోజుల పాటు 200 టీఎంసీల వరద నీటిని తరలించాలని భావిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మూసీ, మన్నేరు బేసిన్ల పరిధిలో కొత్తగా ఏడు లక్షల ఎకరాలకు నీరివ్వడమే గాక.. వెలిగొండ, గుండ్లకమ్మ, ఇతర చిన్న ప్రాజెక్టుల పరిధిలోని 6 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని.. 60 లక్షల మందికి తాగునీటి సరఫరా చేయాలనేవి కొత్త పథకం లక్ష్యాలు. నేడో రేపో ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్)ను రూపొందించేందుకు ఆసక్తి కలిగిన సంస్థలను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలువనున్నారు. ఎల్-1గా వచ్చే సంస్థ వచ్చే ఏడాది జనవరి 1నాటికి డీపీఆర్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. దానిని జలవనరుల శాఖ పరిశీలించి జనవరి 31లోగా కేంద్ర జల సంఘం ఆమోదానికి పంపుతుంది. మార్చి 31వ తేదీ నాటికి జల సంఘం నుంచి అది సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ)కి చేరి ఆమోదం పొందాక.. ఏప్రిల్ 30లోగా కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర పర్యావరణం-అటవీ మంత్రిత్వ శాఖల అనుమతులు పొందే దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 24వ తేదీన సీఎం చంద్రబాబు నిర్వహించే సమీక్షలో తుది మెరుగులు దిద్దనున్నారు.
ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’
బనకచర్ల పథకంపై ఇతర రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టును పోలవరం నుంచి నల్లమలసాగర్ వరకే పరిమితం చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని మొదట ‘ఆంధ్రజ్యోతి’ తెలియజేసింది. ‘బనకచర్లలో భారీ మార్పులు’ శీర్షికన ఈ నెల 8న ప్రచురించింది. ‘ఆంరఽధజ్యోతి’ పేర్కొన్నట్లుగానే మూడు దశల్లో రూ.58,700 కోట్లతో పోలవరం-నల్లమలసాగర్ పథకాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొదటి విడతలో తాతపూడి వరద కాలువ నుంచి పోలవరం కుడి ప్రధాన కాలువ గుండా ఇబ్రహీంపట్నం వరకు వరద నీటిని తరలిస్తారు. రెండో దశలో.. ఇబ్రహీంపట్నం వద్ద నిర్మించే అక్విడెక్టు ద్వారా నాగార్జునసాగర్ కుడికాలువలోకి ఎత్తిపోసి.. బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తీసుకెళ్తారు. తుది దశలో బొల్లాపల్లి నుంచి నల్లమలసాగర్‌కు తరలిస్తారు.