Construction Progress: పోలవరం ప్రధాన డ్యామ్ పనులన్నీ భేష్
ABN , Publish Date - Nov 09 , 2025 | 06:09 AM
పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ పనులన్నీ నాణ్యతా ప్రమాణాలతో లక్ష్యం మేరకు జరుగుతున్నాయని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో అతుల్‌జైన్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదే జోరు కొనసాగిస్తే 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి
నిధులకు ఢోకా లేదు: పీపీఏ సీఈవో అతుల్‌జైన్
నిర్మాణ పనుల పరిశీలన.. నాణ్యతపై సంతృప్తి
అమరావతి/పోలవరం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ పనులన్నీ నాణ్యతా ప్రమాణాలతో లక్ష్యం మేరకు జరుగుతున్నాయని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో అతుల్‌జైన్ సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఈఎన్‌సీ నరసింహమూర్తి బృందం, పీపీఏ ఇంజనీరింగ్ సిబ్బందిని వెంటబెట్టుకుని ఆయన పర్యటించారు. ప్రాజెక్టులోని ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌లో గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాల్లో 800 చానల్ వద్ద డివాల్ కటింగ్ పనులు, డయాఫ్రమ్‌వాల్ నిర్మాణ తీరును పరిశీలించారు. అధికారులను అడిగి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో ఏర్పాటు చేసిన నాణ్యతా ప్రమాణాల టెస్టింగ్ ల్యాబ్‌ను సందర్శించారు. ల్యాబ్‌లో పోలవరం నిర్మాణాలకు సంబంధించి చేపడుతున్న క్వాలిటీ పరీక్షా విధానాన్ని అతుల్‌జైన్ బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాల అమలు, పరిహారం చెల్లింపులపై ఈఎన్‌సీ నరసింహమూర్తిని అడిగి అతుల్ జైన్ తెలుసుకున్నారు. ఇటీవల పోలవరం నిర్వాసితులకు రూ.1000 కోట్ల మేర నిధులను ఖాతాలలో జమ చేసే కార్యక్రమాన్ని చేపట్టామని ఈఎన్‌సీ వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిధి పోర్టల్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల కారణంగా పరిహారం బల్క్‌గా కాకుండా వ్యక్తిగతంగా ఒక్కొక్కటిగా పంపాల్సి వస్తోందని, దీనివల్ల సమయం ఎక్కువ తీసుకుంటోందని తెలిపారు. కేంద్రం పోలవరం కోసం విడుదల చేసిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.750 కోట్ల దాకా ఉన్నాయని, వాటిని వినియోగించాక భవిష్యత్తులో అవసరమైన నిధుల గురించి పోలవరం ప్రాజెక్టు అధికారులు వివరించారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి నిధులకు ఎలాంటి ఢోకా లేదని, కోరిన వెంటనే మంజూరు చేస్తామని అతుల్ జైన్ స్పష్టం చేశారు.
ఇదే జోరు కొనసాగిస్తే 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి అవుతుందని అన్నారు. ఈ నెలలో సీఈవో అతుల్ జైన్ ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈఎన్‌సీ కె.నరసింహమూర్తి, జలవనరులశాఖ అధికారులు ఆయనను శాలువాలతో సత్కరించి వేంకటేశ్వరస్వామి ప్రతిమ అందజేశారు. అథారిటీ సభ్య కార్యదర్శి ఎం.రఘురామ్, ఎస్‌ఈ రామచంద్రరావు, పవర్ హౌస్ సీఈ సి.వెంకటసుబ్బయ్య, డిప్యూటీ డైరెక్టర్లు కె.శంకర్, డీఎస్ ప్రసాద్, ఎ.ప్రవీణ్, క్వాలిటీ కంట్రోల్ సీఈ కె.శేషుబాబు, ఈఈలు డి.శ్రీనివాస్, కె.బాలకృష్ణ, ఎస్.ప్రేమ్‌చంద్, సీహెచ్ నరసింహరాజు, మెగా ఆపరేటింగ్ ఆఫీసర్ అంగర సతీశ్‌బాబు, జనరల్ మేనేజర్ ఎ.గంగాధర్, డిప్యూటీ మేనేజర్ పమ్మి మురళి తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం అతుల్ జైన్ బృందం హైదరాబాద్‌కు, అక్కడ నుంచి ఢిల్లీకి బయల్దేరింది.