Polavaram Project: వడివడిగా డయాఫ్రం వాల్
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:31 AM
పోలవరం ప్రాజెక్టు పనులు 2027 డిసెంబరు నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యం దిశగా సాగుతున్నాయి.
ఇప్పటికి 58 శాతం పనులు పూర్తి
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనులు 2027 డిసెంబరు నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యం దిశగా సాగుతున్నాయి. కొత్త డయాఫ్రం వాల్ పనులు వేగంగా నడుస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలైన పనులు 58 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 42 శాతం పనులు చేస్తూనే.. ఇప్పటికే పూర్తయిన గోడపై సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం పనులను నవంబరు 1న ప్రారంభించేందుకు ఇంజనీర్లు సిద్ధమవుతున్నారు. డయాఫ్రం వాల్ నదీ గర్భంలోపల పునాదిలా ఉంటుంది. బయటకు కనిపించదు. కానీ సాంకేతిక పరిశీలన నిమిత్తం.. బయటకు 1.5 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ ఎత్తును ఇలాగే కొనసాగిస్తూ.. దానిపై ఈసీఆర్‌ఎఫ్ డ్యాంను నిర్మిస్తే.. గోదావరి నదికి భారీ వరద వస్తే.. దాని ప్రభావంతో వాల్ కంపించిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో సోమవారం ఆ ఎత్తు తగ్గించడం ప్రారంభించారు.