Share News

Nimmala Rama Naidu: డిసెంబరుకు డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తి

ABN , Publish Date - Jul 31 , 2025 | 06:16 AM

ఈ ఏడాది డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్‌ వాల్‌ పనులు పూర్తి చేస్తామని జల వనరుల శాఖ అధికారులు ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు చెప్పారు.

Nimmala Rama Naidu: డిసెంబరుకు డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తి

  • మార్చికి ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ గ్యాప్‌-1

  • పోలవరం పనులపై మంత్రి నిమ్మల సమీక్ష

అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్‌ వాల్‌ పనులు పూర్తి చేస్తామని జల వనరుల శాఖ అధికారులు ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు చెప్పారు. అలాగే వచ్చే ఏడాది మార్చికి ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) గ్యాప్‌-1ను పూర్తి చేస్తామని తెలిపారు. బుధవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టుతో సహా ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జల వనరుల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.సాయిప్రసాద్‌, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితరులతో మాట్లాడారు. ఎడమ ప్రధాన కాలువ పనులు లక్ష్యాల మేరకు వేగంగా సాగుతున్నాయని అధికారులు వివరించారు. డయాఫ్రమ్‌ వాల్‌ 40 శాతం పురోగతి సాధించినట్టు తెలిపారు. డయాఫ్రమ్‌ వాల్‌ 373 ప్యానళ్లకు గాను ఇప్పటికే క్లిష్టంగా ఉన్న 130 ప్యానళ్లను పూర్తి చేశామని అధికారులు వివరించారు. వరదకాలంలో కూడా పనులు ఆగకుండా డీవాటరింగ్‌ చేసుకుంటూ డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ గ్యాప్‌-1 పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌-2 డిజైన్లు కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదం పొందిన వెంటనే నవంబరు నాటికి పనులు మొదలు పెడతామని వివరించారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి 2026 కల్లా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకువెళ్లేలా ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాన్ని నెరవేర్చేలా చూడాలని అధికారులకు రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ కాలువ పురోగతికి సంబంధించి నేషనల్‌ హైవే క్రాసింగ్‌ల దగ్గర బ్రిడ్జిల పనులు ఆగస్టులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గడిచిన ఐదేళ్లలో నాటి ముఖ్యమంత్రి జగన్‌ నిర్లక్ష్యం చేశారన్నారు. పోలవరం ఎడమ కాలువకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, తట్టి మట్టి కూడా తవ్వలేదని రామానాయుడు విమర్శించారు.

Updated Date - Jul 31 , 2025 | 06:17 AM