Polavaram Dam: పోలవరం పనులు చకచకా!
ABN , Publish Date - Oct 04 , 2025 | 04:55 AM
గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నా.. పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ పనులు జోరుగా సాగుతున్నాయి. 2027, డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్న నేపథ్యంలో ప్రధాన డ్యామ్ పనులు వేగవంతంగా.....
వైబ్రో కంపాక్షన్ పనులు 74ు డయాఫ్రమ్ వాల్ 56ు పూర్తి
41.15 మీటర్ల కాంటూరులో భూసేకరణకు 1,107 కోట్లు అవసరం
ఎల్లుండి కేంద్ర జలశక్తి మంత్రితోమంత్రి రామానాయుడు సమావేశం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నా.. పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ పనులు జోరుగా సాగుతున్నాయి. 2027, డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్న నేపథ్యంలో ప్రధాన డ్యామ్ పనులు వేగవంతంగా చేపడుతున్నారు. రుతుపవనాలకు ముందుగానే, ఎగువనుంచి వరద రాకమునుపే సమాంతర డయాఫ్రమ్‌వాల్‌లో క్లిష్టంగా, లోతుగా ఉండే చోట పనులు ప్రారంభించారు. దీంతో 63,656 క్యూబిక్ మీటర్లకు గాను, 37,302(56ు) క్యూబిక్ మీటర్ల పనులు పూర్తిచేశారు. మిగిలిన 44శాతం పనులు ఈ డిసెంబరునాటికి పూర్తి చేస్తామని జల వనరుల శాఖ తెలిపింది. హెడ్‌వర్క్స్‌లో అత్యంత కీలకమైన బట్రె్‌సను పూర్తి చేశారు. క్లేరీచ్ (బంకమన్ను ప్రాంతం)లో వైబ్రో కంపాంక్షన్‌ను 16.19క్యూబిక్ మీటర్లకుగాను 11.93(74ు) క్యూబిక్ మీటర్లమేర పూర్తి చేశారు. ఈ పనులను కూడా డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే, ఈ నెల 6న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితరులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పోలవరం పురోగతిని వివరించనున్నారు.
వచ్చే నెల నుంచే ఈసీఆర్‌ఎఫ్ పనులు
డయాఫ్రమ్‌వాల్ నిర్మాణాన్ని ఈ డిసెంబరు 31నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్న జల వనరుల శాఖ.. భవిష్యత్తు కార్యాచరణపైనా ప్రణాళికలు సిద్ధం చేసింది. డయాఫ్రమ్‌వాల్ పనులు పూర్తయ్యాక దానిపై ఎర్త్ కమ్ రాక్‌ఫిల్(ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ నిర్మాణ పనులు ప్రారంభిస్తే, పూర్తి చేసేందుకు 2 నీటి సంత్సరాలు పడుతుంది. అంటే.. 2026, 2027 సంవత్సరాలలో ఈసీఆర్‌ఎఫ్ పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో డిసెంబరు 31నాటికి డయాఫ్రమ్‌వాల్ పనులు పూర్తయ్యేలోగా వచ్చేనెల నుంచే ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించాలని జలవనరుల శాఖ ఆలోచిస్తోంది. 2027, జూలై నాటికి ఈసీఆర్‌ఎఫ్ పనులు పూర్తవుతాయని, దీనివల్ల నిర్దేశిత లక్ష్యం 2027, జూలై నాటికి పూర్తి చేయవచ్చని భావిస్తోంది. ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ డిజైన్లు అంతర్జాతీయ నిపుణుల కమిటీ, కేంద్ర జల సంఘం వద్ద పెడింగ్‌లో ఉన్నాయని, అవన్నీ డిసెంబరునాటికి ఆమోదం పొందుతాయని ఆశిస్తోంది. పోలవరం నిర్వాసితులకు సహాయ, పునరావాసానికి నిధులివ్వడమే ప్రధాన సమస్యగా మారింది. 2024-25లో రూ.5,052.71 కోట్లను కేంద్రం విడుదల చేసింది. వీటిలో రూ.1,830 కోట్లను ఏకీకృత ఖాతాకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయాలి. కేంద్రం నుంచి నిధులు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంది. కానీ, జలశక్తిశాఖ ఆదేశించిన మేరకు పోలవరం కోసం ప్రత్యేక ఖాతాను ప్రారంభించినా ఇంకా రాష్ట్రప్రభుత్వం నుంచి దానిలోకి పూర్తిగా నిధులు మళ్లింపు జరగలేదు. దీనిపై కేంద్రం ఇటీవల అసహనం వ్యక్తం చేసింది. మరో రూ.1830 కోట్లను పోలవరం ప్రత్యేక ఖాతాలోకి మళ్లిస్తే సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపట్టేందుకు వీలుంటుందని జల వనరుల శాఖ చెబుతోంది. మరోవైపు, 41.15 మీటర్ల కాంటూరులో భూసేకరణ, పునరావాసం కోసం.. రూ.1,107 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు.