Polavaram Project officials: వచ్చే మార్చికల్లా డయాఫ్రం వాల్
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:26 AM
కేంద్ర జలశక్తి శాఖతో చేసుకున్న ఒప్పందం మేరకు వచ్చే ఏడాది మార్చి నాటికి డయాఫ్రం వాల్‌ను పూర్తి చేస్తామని పోలవరం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 2027 డిసెంబరునాటికి...
2027 డిసెంబరునాటికి ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పూర్తి
పోలవరం ఇంజనీరింగ్ అధికారుల వెల్లడి
రెండోరోజూ ప్రాజెక్టు వద్ద విదేశీ నిపుణులు,కేంద్ర అధికారుల పర్యటన
నేడు రాజమండ్రిలో మరోసారి సమావేశం
అమరావతి/పోలవరం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): కేంద్ర జలశక్తి శాఖతో చేసుకున్న ఒప్పందం మేరకు వచ్చే ఏడాది మార్చి నాటికి డయాఫ్రం వాల్‌ను పూర్తి చేస్తామని పోలవరం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 2027 డిసెంబరునాటికి ప్రధానమైన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాంను నిర్మిస్తామని చెప్పారు. పోలవరం పర్యటనలో భాగంగా రెండో రోజు ప్రాజెక్టు, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో అమెరికా, కెనడా నిపుణులు జియాస్ ఫ్రాంకో డి సిస్కో, డేవిడ్ బి.పాల్, కెనడాకు చెందిన రిచర్డ్ డొనెల్లీ, కేంద్ర జలశక్తి శాఖ అధికారులు.. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకూ మెటీరియల్ నాణ్యతా పరీక్షల తీరును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ల్యాబ్ పనితీరును పరిశీలించాక.. నిపుణులతో పాటు కేంద్ర జలశక్తి శాఖ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ నాణ్యతా పరీక్షలు కాంట్రాక్టర్ల ల్యాబ్‌లలో కొనసాగగా.. విదేశీ నిపుణుల సూచనలతో జలవనరుల శాఖ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆడ్కో ల్యాబ్‌లో తాజాగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ నాణ్యతా ప్రమాణాల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని.. నిర్మాణాలపై నిపుణులు జలవనరుల శాఖకు తుది సూచనలు చేస్తారు. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో గ్యాప్ 1, 2 నిర్మాణం తదితర అంశాలపై ఏకబిగిన 7 గంటలు సమీక్షించారు. ఇందులో అత్యధిక భాగం.. ఈసీఆర్‌ఎఫ్ డ్యాంను నిర్మించే గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాలపై దృష్టి సారించారు. ఈ రెండు నిర్మాణాల డిజైన్లను జలశక్తి శాఖ, నిపుణుల బృందం పరిశీలించి.. సంతృప్తి వ్యక్తం చేశాయి. ఈఎన్‌సీ నరసింహమూర్తి, మేఘా సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీశ్‌బాబు ఆ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల్లో వివిధ దశలను వివరించారు. డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు, నాణ్యతపైనా నిపుణులు, కేంద్ర అధికారులు సంతృప్తి చెందారు. నిర్మాణం ఎప్పటిలోగా పూర్తి చేస్తారని నిర్మాణ సంస్థ బావర్‌ను నిపుణులు ప్రశ్నించారు. ముందస్తు ఒప్పందం మేరకు.. 2026 మార్చినాటికి పూర్తిచేస్తామన్న విశ్వాసాన్ని ఆ సంస్థ వ్యక్తం చేసింది.
ప్రైమావీరా సాఫ్ట్‌వేర్‌ను మరింత అభివృద్ధి చేయాలి..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాల డిజైన్లు.. పనులు, వ్యయాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ సాఫ్ట్‌వేర్ ప్రైమావేరా ద్వారా అందుబాటులో ఉంచాలని ఎప్పటి నుంచో కేంద్ర జలశక్తి శాఖ ఆదేశిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం తొలిసారిగా అదే సాఫ్ట్‌వేర్ ద్వారా అంతర్జాతీయ నిపుణులకు, కేంద్ర బృందానికి ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణ పనుల వివరాలను వెల్లడించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని కేంద్ర బృందం స్వాగతించి అభినందించింది. అయితే కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయని.. వాటిని సరిదిద్దుకోవాలని.. ఈ సాఫ్ట్‌వేర్‌ను మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించింది. కాగా.. నిపుణులు, కేంద్ర బృందాల సభ్యులు ఆదివారం రాజమహేంద్రవరంలో జలవనరుల శాఖ అధికారులతో పోలవరం నిర్మాణాల తీరు, డిజైన్లపై మరోసారి సమీక్ష నిర్వహిస్తారు.