Share News

Water Commission Report: జల సంఘానికి బనకచర్ల నివేదిక

ABN , Publish Date - Jun 12 , 2025 | 04:34 AM

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూ.81,900 కోట్లతో నిర్మించతలపెట్టిన పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం సాధ్యాసాధ్యాల నివేదిక కేంద్ర జలసంఘాని (సీడబ్ల్యూసీ)కి అందింది. వాప్కోస్‌ రూపొందించిన ఈ ఫీజిబిలిటీ రిపోర్టును పరిశీలించి...

Water Commission Report: జల సంఘానికి బనకచర్ల నివేదిక

  • సాధ్యాసాధ్యాల రిపోర్టుపై 6 రాష్ట్రాల అభిప్రాయం కోరిన సీడబ్ల్యూసీ

  • పీపీఏ, కృష్ణా, గోదావరి బోర్డులను కూడా..

అమరావతి, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూ.81,900 కోట్లతో నిర్మించతలపెట్టిన పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం సాధ్యాసాధ్యాల నివేదిక కేంద్ర జలసంఘాని (సీడబ్ల్యూసీ)కి అందింది. వాప్కోస్‌ రూపొందించిన ఈ ఫీజిబిలిటీ రిపోర్టును పరిశీలించి అభిప్రాయాలను వెల్లడించాలని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులను, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ని.. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిసా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు, రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు బుధవారం లేఖ రాసింది. గోదావరికి వరద సమయంలో రోజుకు రెండు టీఎంసీల చొప్పున 90 నుంచి 120 రోజుల పాటు 200 టీఎంసీల వరద జలాలను ఎత్తిపోయాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశమని.. 80 లక్షల మందికి తాగునీరు, మూడు లక్షల హెక్టార్లకు కొత్తగా సాగునీరు, 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టును స్థిరీకరించేందుకు తలపెట్టిన ఈ పథకం ప్రాథమిక అంచనా నివేదికను సరిశీలించి సమాధానం చెప్పాలని వాటికి విజ్ఞప్తి చేసింది. ఈ పథకం ద్వారా పారిశ్రామికావసరాలకు నీటి సరఫరాతో పాటు జలవిద్యుదుత్పత్తి కూడా చేపడతారని వాప్కోస్‌ తన నివేదికలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌కు గేట్‌వేగా మారనున్న ఈ అనుసంధాన పథకంతో శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, గాలేరు-నగరి సుజల స్రవంతి, కర్నూలు-కుప్పం కెనాల్‌, సోమశిల ప్రాజెక్టు, తెలుగుగంగ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు నీరు అందించవచ్చని వెల్లడించింది. అలాగే రాజధాని అమరావతి నగరానికి, విజయవాడ నగరానికి మంచినీటి సరఫరా చేసేందుకు సైతం ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని తెలిపింది. జలసంఘానికి గత నెల 25వ తేదీన ఫీజిబిలిటీ నివేదిక అందింది. నిశితంగా పరిశీలించాక దానిపై ఆయా రాష్ట్రాల అభిప్రాయం కోరింది.

Updated Date - Jun 12 , 2025 | 04:36 AM