జోరుగా పేకాట!
ABN , Publish Date - Nov 07 , 2025 | 01:20 AM
జిల్లాలో పేకాట జోరందుకుంది. గుట్టుగా పలు ప్రాంతాల్లో శిబిరాలు నడుస్తున్నాయి. ఇటీవల పామర్రు పరిసర ప్రాంతాల్లో ఓ పోలీస్ అధికారి, కొందరు అధికార పార్టీ నాయకులు జూద శిబిరాల నిర్వహణకు తెరతీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో పేకాట నడిపిన మచిలీపట్నానికి చెందిన వ్యక్తితో కలిసి ఓ పోలీస్ అధికారి గత పది రోజులుగా పామర్రు, పరిసర ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేయిస్తూ అందినకాడికి నగదు దండుకుంటున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. బుధవారం పామర్రు మండలం కురుమద్దాలిలో 45 మందికిపైగా పేకాట రాయుళ్లను తీసుకువచ్చి పేకాట ఆడించినట్లు విశ్వసనీయ సమాచారం. గురువారం తెల్లవారు జాము వరకు యలమర్రు గ్రామంలో పేకాట శిబిరం నడిచినట్టు సమాచారం. ఈ శిబిరాల్లో రూ.లక్షలు చేతులు మారుతున్నా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- పామర్రు నియోజకవర్గంలో శిబిరాల నిర్వహణ
- చేతులు మారుతున్న లక్షల రూపాయల నగదు
- ఓ పోలీస్ అధికారి, కొందరు రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే వ్యవహారం!
- గుడివాడ డీఎస్పీ, మచిలీపట్నం ఎస్‌బీ కార్యాలయాల్లో వేగుల నియామకం
జిల్లాలో పేకాట జోరందుకుంది. గుట్టుగా పలు ప్రాంతాల్లో శిబిరాలు నడుస్తున్నాయి. ఇటీవల పామర్రు పరిసర ప్రాంతాల్లో ఓ పోలీస్ అధికారి, కొందరు అధికార పార్టీ నాయకులు జూద శిబిరాల నిర్వహణకు తెరతీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో పేకాట నడిపిన మచిలీపట్నానికి చెందిన వ్యక్తితో కలిసి ఓ పోలీస్ అధికారి గత పది రోజులుగా పామర్రు, పరిసర ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేయిస్తూ అందినకాడికి నగదు దండుకుంటున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. బుధవారం పామర్రు మండలం కురుమద్దాలిలో 45 మందికిపైగా పేకాట రాయుళ్లను తీసుకువచ్చి పేకాట ఆడించినట్లు విశ్వసనీయ సమాచారం. గురువారం తెల్లవారు జాము వరకు యలమర్రు గ్రామంలో పేకాట శిబిరం నడిచినట్టు సమాచారం. ఈ శిబిరాల్లో రూ.లక్షలు చేతులు మారుతున్నా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మచిలీపట్నం-ఆంధ్రజ్యోతి:
పామర్రు నియోజకవర్గం, సమీప గ్రామాలైన కురుమద్దాలి, నిమ్మలూరు, పసుమర్రు, నిడుమోలు, డోకిపర్రు, యలమర్రు తదితర ప్రాంతాల్లో పేకాట శిబిరాలు జోరుగా నడుస్తున్నట్టు సమాచారం. పేకాట శిబిరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎంత సమయం వరకు నిర్వహించాలి అనే అంశాలపై ఓ పోలీస్ అధికారే ప్రణాళిక రచిస్తున్నారని పేకాట రాయుళ్లే చెప్పుకుంటున్నారు. ఈ అధికారి వద్ద ఉండే ఒక కానిస్టేబుల్ వాహనంలో పేకాట శిబిరాలు నిర్వహించే ప్రాంతంలో రాత్రంతా గస్తీ తిరుగుతూ పేకాట శిబిరాలను పర్యవేక్షిస్తున్నాడని తెలిసింది.
రాత్రి 11 నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు..
మచిలీపట్నం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు లేదా గుడివాడ డీఎస్పీ కార్యాలయం నుంచి ప్రత్యేక బృందాలు పేకాట శిబిరాలపై దాడులు చేసేందుకు బయలుదేరిన వెంటనే సమాచారం ఈ పోలీస్ అధికారికి అందేలా ఏర్పాట్లు చేసుకుని మరీ పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రి 11 గంటలకు ప్రారంభించి తెల్లవారు జామున నాలుగు గంటలకు పేకాట శిబిరాన్ని నిలిపివేయాలని ఈ పోలీస్ అధికారి సూచనలు చేస్తున్నారని, ఇందుకు పెద్దమొత్తంలో రోజువారీగా మామూళ్లు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మంగళ గిరిలోని పోలీస్ ఉన్నతాధికారి కార్యాలయంలో పనిచేసే ఒక పోలీస్ కానిస్టేబుల్ మూడు రోజుల క్రితం జరిగిన పేకాట శిబిరంలో పెద్ద మొత్తంలో నగదు పోగొట్టుకోవడంతో పేకాట శిబిరాల నిర్వహణ వ్యవహారం ఎట్టకేలకు బయటకు వచ్చింది. విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన పేకాట రాయుళ్లకు సమాచారం అందించి, వారిని అక్కడకు రప్పించి పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారని స్థానిక గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లాకు కొత్త ఎస్పీ రావడంతో కొంతకాలం పాటు పేకాట శిబిరాలను నిర్వహించకుండా మిన్నకుండిపోయిన వ్యక్తులు మళ్లీ గత కొన్ని రోజులుగా పామర్రు నియోజకవర్గంలో రోజుకో గ్రామంలో పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.