Poisonous Wasps: మళ్లీ.. విషపు ఈగలు
ABN , Publish Date - Oct 07 , 2025 | 05:46 AM
చూడ్డానికి తేనెటీగలానే ఉంటుంది. తేనెటీగలానే ఈ.. ఈగ కుడితే కూడా భరించలేని నొప్పితో విలవిల్లాడిపోవడం ఖాయం. కొద్దిసేపటికి కళ్లు తిరగడం, సొమ్మసిల్లిపడిపోవడం వంటివి చకచకా జరిగిపోతాయి
రెండేళ్ల తర్వాత చెట్లపై గూళ్లు కడుతున్న వైనం
గతంలో ఈగలు కుట్టి ఇద్దరు మృతి
బెంబేలెత్తిపోతున్న తీర గ్రామాలు
నరసాపురం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): చూడ్డానికి తేనెటీగలానే ఉంటుంది. తేనెటీగలానే ఈ.. ఈగ కుడితే కూడా భరించలేని నొప్పితో విలవిల్లాడిపోవడం ఖాయం. కొద్దిసేపటికి కళ్లు తిరగడం, సొమ్మసిల్లిపడిపోవడం వంటివి చకచకా జరిగిపోతాయి. సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలు కూడా పోతాయి. ఇంతటి ప్రమాదకరమైన విషపు ఈగలు మళ్లీ తీర ప్రాంతానికి వచ్చేశాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లోని తాటి, కొబ్బరి చెట్లు, కొన్ని తోటల్లోని మామిడిచెట్లపై ఇలాంటి ఈగల పుట్ట(గూళ్లు)లు దర్శనమిస్తున్నాయి. వీటిని చూసిన ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఒంటరిగా తోటలు, సముద్ర ఒడ్డుకు వెళ్లేందుకు సాహసించడం లేదు. ప్రస్తుతం ఈ రెండు మండలాల్లో రెండు చోట్ల గూళ్లను గుర్తించారు. రెండేళ్ల క్రితం నరసాపురం మండలం గొంది గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న ఇద్దరు కార్మికుల్ని విషపు ఈగలు కుట్టాయి. వారిలో ఒకరు చికిత్స పొందుతూ పాలకొల్లు ఆస్పత్రిలో మృతి చెందగా మరొకరు భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు. గతంలో వేములదీవి గ్రామంలోనూ ఇలాగే వీటిబారినపడి ఓవ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కేపీపాలెం గ్రామంలో మరో వ్యక్తికి సకాలంలో వైద్యం పొంది ప్రాణాలతో బయటపడ్డాడు.
ఒక పుట్టతో.. నెలలో రెండు మూడు!
ఏదో ఒకటి రెండు చోట్ల ఈగల గూళ్లు ఉన్నాయని వదిలేస్తే.. వీటి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. గూళ్లు కట్టి వాటిల్లో పిల్లల్ని పెట్టడం సర్వసాధారణం. అలా విస్తరించుకుంటూ వెళతాయి. ఎక్కువగా తోటలు, సముద్ర తీర ప్రాంతంలోని తాటి, ఈత చెట్లపైనే గూళ్లు కడతాయి. పదేళ్ల క్రితం ఓఎన్‌జీసీ సహకారంలో అప్పటి అధికారులు వీటిని సామూహికంగా నిర్మూలించారు. శాస్త్రవేత్తలు, వైద్యుల సూచనలు పాటించి ముందుగా చెట్లపై ఉన్న గూళ్లపై మత్తుతో కూడిన మందులు చల్లారు. ఆ తరువాత మంటలు పెట్టి దహనం చేశారు. కొంత కాలం వరకు వీటి జాడ లేదు. మళ్లీ రెండేళ్ల క్రితం దర్శనమిచ్చాయి. కొన్ని చోట్ల ఇదే పద్ధతిలో నిర్మూలించారు. మళ్లీ ఇవి కనిపించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
సకాలంలో వైద్యం చేయించుకోవాలి...
ఈగలు కుడితే అశ్రద్ధ తగదు. సకాలంలో వైద్యుల్ని సంప్రదించాలి. లేకపోతే ప్రాణాలకే ముప్పు. అదే రెండు మూడు ఈగలు కుడితే ప్రమాదం ఇంకా తీవ్రంగా ఉంటుంది. పాము కరిస్తే... విషం పైకి పాకకుండా బలంగా తాడు కట్టి నివారించవచ్చు. కానీ ఈగ కుడితే అలా అరికట్టలేం. విషం క్షణాల్లో శరీరమంతా పాకేస్తుంది. అందుకే ప్రాణాలు పోవడం, లేదంటే పల్స్ పడిపోయి ప్రాణపాయస్థితి వంటి ప్రమాదం జరగొచ్చు.
-డాక్టర్ మురళీ, ఎండీ, నరసాపురం