PM USHA Scheme: పీఎం ఉష కింద ఏపీకి రూ.378 కోట్లు
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:11 AM
ప్రధాన మంత్రి ఉన్నత శిక్షా అభియాన్ (పీఎం ఉష)’ పథకం కింద ఏపీలో ఉన్నత విద్యారంగంలో మౌలిక సదుపాయా లు, నాణ్యతను పెంచేందుకు 33 యూనిట్లను ఆమోదించి..
మహిళా వర్సిటీకి 100 కోట్లు.. ఆరు వర్సిటీలకు 120 కోట్లు
లోక్‌సభలో ఎంపీ కలిశెట్టి ప్రశ్నలపై కేంద్రం
న్యూఢిల్లీ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ‘ప్రధాన మంత్రి ఉన్నత శిక్షా అభియాన్ (పీఎం ఉష)’ పథకం కింద ఏపీలో ఉన్నత విద్యారంగంలో మౌలిక సదుపాయా లు, నాణ్యతను పెంచేందుకు 33 యూనిట్లను ఆమోదించి రూ.378.75 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. సోమవారం లోక్‌సభలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.. ఈ పథకంపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు, శ్రీకృష్ణదేవరాయ, ఆదికవి నన్నయ, యోగి వేమన, కృష్ణా, విక్రమ సింహపురి, అంబేడ్కర్ విశ్వవిద్యాలయాలకు రూ.20 కోట్ల చొప్పున రూ.120 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 21 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు ఒక్కొక్క దానికి రూ.5 కోట్లు చొప్పున మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మహిళలు, అట్టడుగు వర్గాలకు ఉన్నత విద్యలో సమాన అవకాశాలు కల్పించేందుకు అనంతపురం, విజయనగరం, అల్లూరి సీతారామ రాజు, కృష్ణా, వైఎస్సార్ జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.10 కోట్ల చొప్పున మొత్తం రూ.50 కోట్లు మంజూరు చేశామన్నారు.
ఏపీకి రూ.88 వేల కోట్ల ముద్రా రుణాలు
పీఎం ముద్ర యోజన కింద ఏపీలో రూ.88 వేల కోట్లకు పైగా రుణాలను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని 72 లక్షలకు పైగా ఖాతాలకు ఈ రుణాలను జమ చేసినట్లు పేర్కొంది. సోమవారం, లోక్‌సభలో టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.