Share News

Kurnool: 16న కర్నూలుకు ప్రధాని మోదీ

ABN , Publish Date - Sep 28 , 2025 | 03:52 AM

ప్రధాని మోదీ అక్టోబరు 16న కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కర్నూలు నగరంలో రోడ్‌షో నిర్వహించనున్నారు.

Kurnool: 16న కర్నూలుకు ప్రధాని మోదీ

  • జీఎస్టీ సంస్కరణలపై రోడ్‌షోకు హాజరు

  • చంద్రబాబు, పవన్‌తో కలిసి భారీ ర్యాలీ

  • శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్న ప్రధాని

కర్నూలు/అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ అక్టోబరు 16న కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కర్నూలు నగరంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలూ ర్యాలీలో పాల్గొంటారు. అలాగే, శ్రీశైల మల్లికార్జునస్వామిని మోదీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పటికే పూర్తి చేసిన పలు ప్రగతి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మోదీ పర్యటనపై సూచనప్రాయంగా సమాచారం తెలిసినా.. అధికారికంగా షెడ్యూలు ఖరారు కావాల్సి ఉంది. మోదీ పర్యటన వివరాలను మంత్రి లోకేశ్‌ శాసనమండలి లాబీలో మంత్రులు, ఎమ్మెల్సీలతో ప్రస్తావించారు. కర్నూలు జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఓర్వకల్లు సమీపంలో ప్రధాని సభ ఏర్పాటుకు అనువైన స్థలం కోసం పరిశీలించారు. కర్నూలు నగరంలో నిర్వహించే భారీ ర్యాలీ రూట్‌ మ్యాప్‌పైనా జిల్లా యంత్రాంగంతో చర్చించినట్లు సమాచారం. గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 5,230 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు (ఐఆర్‌ఏఎస్‌పీ)ను, ఓర్వకల్లు సమీపంలో 415 ఎకరాల విస్తీర్ణంలో జైరాజ్‌ ఇస్పాత్‌ ఉక్కు పరిశ్రమను ప్రధాని ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.

Updated Date - Sep 28 , 2025 | 03:53 AM