PM Modi Visit: రేపు రాష్ట్రానికి ప్రధాని మోదీ
ABN , Publish Date - Oct 15 , 2025 | 05:25 AM
ప్రధాని మోదీ గురువారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ఓర్వకల్లు విమాన్రాశయం చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకుంటారు.
కర్నూలులో ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’
భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న ప్రధాని
13,429 కోట్లతో చేపట్టే 16 ప్రాజెక్టులకు శంకుస్థాపన
మంత్రుల పర్యవేక్షణలో పకడ్బందీ ఏర్పాట్లు
రేపు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు
శ్రీశైలానికి రాకపోకలు బంద్
శ్రీశైల జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాల దర్శనం
కర్నూలు/ శ్రీశైలం/ న్యూఢిల్లీ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ గురువారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ఓర్వకల్లు విమాన్రాశయం చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకుంటారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం క్షేత్రాలను దర్శించుకుంటారు. మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలంలోని ఘంటా మఠంలో పురావస్తు శాఖ ప్రదర్శించిన 21 సెట్ల తామ్ర శాసనాలను, 53 రాగి రేకులను, నాణేలను తిలకిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్నూలు నగర శివారున ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్ ప్లాజా దగ్గర రాగమయూరి గ్రీన్‌హిల్స్‌కు చేరుకుంటారు. అక్కడ ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు రూ.13,429 కోట్లతో నిర్మించనున్న 16 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దేశంలోనే జీఎస్టీ-2.0పై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న తొలి సభ ఇది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కూటమి పార్టీల ప్రముఖ నాయకులు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సభకు 3 లక్షల మందికి పైగా హాజరయ్యేలా పక్కా ప్రణాళికతో, భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
అందరూ కర్నూలులోనే...
రాష్ట్రంలో మంత్రివర్గం మొత్తం కర్నూలులో మకాం వేసింది. దాదాపు వంద మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాయలసీమ జిల్లాలు సహా ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, టీడీపీ ముఖ్య నేతలు తమకు కేటాయించిన బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. మంగళవారం మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్, ఎన్‌ఎండీ ఫరూక్, నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, వంగలపుడి అనిత, రాంప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసమీకరణ కోసం ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై నియోజకవర్గం నుంచి సభా ప్రాంగణానికి జనాలను ఎలా చేర్చాలి, ఆహారం, తాగునీరు సరఫరా వంటి ఏర్పాట్లపై సమీక్షించారు. కాగా, ఏర్పాట్లపై కూటమి నేతలకు పవన్ కల్యాణ్, లోకేశ్ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా సూచనలు చేశారు. అలాగే పీఎం ప్రొగ్రామ్ స్పెషల్ ఆఫీసర్ వీరపాండియన్, కర్నూలు కలెక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో పనులు చురుగ్గా సాగుతున్నాయి.
సమష్టిగా ప్రధాని సభను జయప్రదం చేద్దాం
ప్రధాని మోదీ పర్యటనను జయప్రదం చేయాలని మంత్రులు, టీడీపీ, బీజేపీ రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేశారు. కర్నూలులోని ప్రభుత్వ అతిఽథి గృహంలో భారీ జన సమీకరణపై కర్నూలు, నంద్యాల జిల్లాల కూటమి పార్టీల ముఖ్య నాయకులతో మంత్రులు సమావేశం నిర్వహించారు. సభా ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని సూచించారు. సభకు 4 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూం ద్వారా వాహనాల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు సీమ ప్రజలు ఎంతో ఉత్సాహాంతో ఉన్నారన్నారు.
ప్రధాని పర్యటనలో ప్రత్యేక నిఘా: డీజీపీ
నల్లమల అడవుల్లోని శ్రీశైలంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పటిష్ఠమైన నిఘా ఉంచినట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టామన్నారు. కేంద్ర బలగాలతో కూంబింగ్ చేశామన్నారు. మంగళవారం శ్రీశైలానికి చేరుకున్న డీజీపీ ప్రధాని పర్యటన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈగల్ చీఫ్ రవికృష్ణ, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్, తదితర ఐపీఎ్‌సలతో ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా ప్రధాని పర్యటన నేపథ్యంలో సున్నిపెంటకు మంగళవారం హెలికాప్టర్లతో ట్రయల్ రన్ నిర్వహించారు. పీఎం భద్రతకు సంబంధించిన ప్రత్యేక బలగాలు, అధికారులు ట్రయల్‌ను పరిశీలించారు.
1,800 మంది పోలీసులతో బందోబస్తు: ఎస్పీ సునీల్
శ్రీశైలంలో ప్రధాని పర్యటనకు సంబంధించి 1,800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీశైలంలోని అతిథిగృహంలో ఏర్పాటు చేసిన పోలీసుల అధికారుల సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు. గురువారం ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలానికి రాకపోకలు నిలుపుదల చేసినట్లు తెలిపారు.
2,612 ఎకరాల్లో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్
హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ (హెచ్‌బీఐసీ)లో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.2,786 కోట్లతో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి కేంద్రం ముందుకొచ్చింది. ఫేజ్-1 కింద 2,612 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ఇప్పటికే టెండర్లు కూడా పూర్తి చేశారు. ఇక్కడ నాన్ మెటలిక్ మినరల్ పరిశ్రమలు, ఆటోమొబైల్ రంగం విడిభాగాల తయారీ, పునరుత్పాదక పరిశ్రమలు, ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్ పరికరాలు, వస్త్ర ఉత్పత్తి రంగ పరిశ్రమల ఏర్పాటుపై నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి సారించింది. వీటిద్వారా రూ.12వేల కోట్లు పెట్టుబడులు, 45,071 మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించాలని లక్ష్యం. ఈ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. కడప జిల్లాలో 3,157 ఎకరాల్లో రూ.2,894.94కోట్లతో అభివృద్ధి చేయనున్న కొప్పర్తి పారిశ్రామిక పార్కుకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు.
ప్రధాని శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు ఇవే..
రూ.2,280 కోట్ల పెట్టుబడితో నిర్మించిన విద్యుత్ ప్రసార వ్యవస్థ.
రూ.4,920 కోట్లతో ఒర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ పారిశ్రామిక పార్కులు.
రూ. 1200 కోట్ల మేరకు వివిధ జాతీయ రైల్వే ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
గెయిల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన రూ.1730 కోట్లతో నిర్మించిన శ్రీకాకుళం-అంగుల్ జాతీయ గ్యాస్ పైప్‌లైన్.
చిత్తూరులో ఐవోసీకి చెందిన ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్.
ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ పరిధిలో పాలకొలను, చింతలపల్లి, కొమ్మరోలు గ్రామాలోని 340 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వేర్వేరు విభాగాల్లో దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని, తద్వారా 8-10 వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఏపీఐఐసీ అధికారులు అంచనా వేస్తున్నారు. కీలకమైన ‘ఓర్వకల్లు డ్రోన్ సిటీ’ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు.
కర్నూలు పీఎస్-3 వద్ద పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం రూ.2,886 కోట్లతో అదనపు వపర్ గ్రిడ్ నిర్మాణం కోసం మోదీ పునాది రాయి వేయనున్నారు.