Satyasai Centenary: 19న పుట్టపర్తికి ప్రధాని మోదీ
ABN , Publish Date - Nov 12 , 2025 | 04:17 AM
సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఈ నెల 19న పుట్టపర్తికి వస్తున్నారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
వైభవంగా సత్యసాయి శత జయంత్యుత్సవాలు: మంత్రి అనగాని
పుట్టపర్తి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఈ నెల 19న పుట్టపర్తికి వస్తున్నారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తుందన్నారు. ఉత్సవాల పర్యవేక్షణకు ఏర్పాటైన మంత్రుల కమిటీ మంగళవారం పుట్టపర్తిలో పర్యటించింది. అనగాని నేతృత్వంలో మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత, సత్యకుమార్ యాదవ్, ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఎంపీ బీకే పార్థసారఽథి, ఎమ్మెల్యేలు పల్లె సింధూరారెడ్డి, ఎంఎస్ రాజు, ఉన్నధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అనగాని మాట్లాడుతూ, సత్యసాయి శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఈ వేడుకలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 13 నుంచి 23 వరకూ పది రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. దీనిపై కొన్ని పార్టీలు రాజకీయ చేయడం బాధాకరమని అన్నారు. ప్రధాని సభ నిర్వహించే హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాట్లను, పుట్టపర్తిలో పనుల పురోగతిని మంత్రులు క్షేత్రసాయిలో పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు.