Virtual Participation: ఆసియాన్ సదస్సుకు మోదీ వెళ్లట్లే
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:01 AM
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరగను న్న 47వ ఆసియాన్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరవడం లేదు. ఈ విషయాన్ని గురువారం ఆయనే స్వయంగా వెల్లడించారు.
వర్చువల్‌గా పాల్గొననున్న ప్రధాని
మలేసియాలో ట్రంప్-మోదీ భేటీ లేనట్లే..
న్యూఢిల్లీ, అక్టోబరు 23: మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరగనున్న 47వ ఆసియాన్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరవడం లేదు. ఈ విషయాన్ని గురువారం ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ నెల 26 నుంచి 28 వరకు జరగనున్న ఆసియాన్ సదస్సుకు వ్యక్తిగతంగా హాజరుకాలేకపోతున్నానని.. వర్చువల్‌గా పాల్గొంటానని తెలిపారు. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ భేటీ లేదన్నమాట. మోదీకి బదులుగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని అధికారిక వర్గా లు తెలిపాయి. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ ఎక్స్‌లో తెలిపారు. ఆసియాన్ సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా, భారత్ ఎప్పటికీ మలేసియాకు ప్రధాన భాగస్వామి అని ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం అన్నారు. ప్రధాని మోదీ తనకు ఫోన్ చేశారని తెలిపారు. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి తప్పించుకునేందుకే ప్రధాని మోదీ ఆసియాన్ సదస్సుకు వెళ్లడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. కాగా, భారత్‌లోని కెనడా రాయబార కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది సంఖ్యను పెంచుకోవడానికి మోదీ సర్కారు అంగీకారం తెలిపింది.