PM Modi: ఏపీలో కూటమి భేష్
ABN , Publish Date - Dec 12 , 2025 | 05:15 AM
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పనితీరు బాగుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.
చంద్రబాబుతో పూర్తి సమన్వయం
ఆయనతో కలిసి పనిచేయడం మంచి పరిణామం
రాష్ట్రానికి పెట్టుబడులు అధికంగా వస్తున్నాయి
రాష్ట్ర బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పనితీరు బాగుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పనిచేయడం మంచి పరిణామమని అన్నారు. తాము పూర్తి సమన్వయంతో వెళ్తున్నామని చెప్పారు. గురువారం ఏపీ, తెలంగాణ, అండమాన్‌కు చెందిన బీజేపీ ఎంపీలకు పార్లమెంట్ అనెక్స్‌లో ప్రధాని అల్పాహార విందు ఇచ్చారు. 15మంది ఎంపీలతో అరగంట ముచ్చటించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... తెలంగాణలో పార్టీ బలహీనంగా ఉందని ఆ రాష్ట్ర ఎంపీలకు చురకలంటిస్తూ... ఏపీలో ప్రభుత్వ పనితీరును ప్రధాని ప్రశంసించారు. ‘‘చంద్రబాబు పనితీరు బాగుంది. రాష్ట్ర పరిపాలన, అభివృద్ధిపై నాకు మంచి ఫీడ్‌బ్యాక్ వస్తోంది. పెట్టుబడులు ఎక్కువగా ఏపీవైపు వెళ్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశముంది. ఇది మంచి పరిణామం’ అని మోదీ పేర్కొన్నట్లు తెలిసింది. జగన్, ఆయన పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు బీజేపీ కూడా దీటుగా కౌంటర్ ఇవ్వాలని సూచించారు. పార్టీ పరంగా చేస్తున్న కార్యక్రమాలు, ప్రజల స్పందన గురించి కూడా ఎంపీలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో గతంలోకంటే బీజేపీ బలపడుతోందని, ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ప్రధానికి చెప్పినట్లు సమాచారం.
తెలంగాణలో బలహీనంగా బీజేపీ
తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్ ఉన్నప్పటికీ పార్టీ నేతలు మాత్రం శక్తిమంతంగా పనిచేయడం లేదని, 8 మంది ఎంపీలున్నా రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదని మోదీ తెలంగాణ ఎంపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాదిలో తెలంగాణలోనే బీజేపీ బలహీనంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.