AP Visit: నేడే రాష్ట్రానికి ప్రధాని రాక..
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:56 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. రూ.13,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
నేడే రాష్ట్రానికి ప్రధాని రాక.. 13 వేల కోట్లకు పైగా పనులకు శ్రీకారం, ప్రారంభోత్సవాలు
డ్రోన్ సిటీకి ప్రధాని శంకుస్థాపన
శ్రీశైల మల్లన్న, భ్రమరాంబకు పూజలు
‘జీఎస్టీ 2.0’పై కర్నూలులో సభ
ప్రధాని పర్యటనకు సర్వం సిద్ధం
రాష్ట్ర మంత్రులంతా కర్నూలులోనే
ఏపీ... ఇప్పుడు ట్రెండింగ్!
మంగళవారం గూగుల్‌తో ఒప్పందంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించింది.
గురువారం ప్రధాని నరేంద్ర మోదీ రాకతో మరోసారి జాతీయ స్థాయిలో వార్తల్లోకి ఎక్కుతోంది.
ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ తొలి సభకు కర్నూలు వేదికైంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. రూ.13,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. శ్రీశైలంలోనూ పర్యటించనున్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే ‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ సభ ముఖ్య ఉద్దేశం.
రాష్ట్రమంతటా జీఎస్టీ 2.0 సంస్కరణలపై విస్తృత ప్రచారం చేసేలా.. వేర్వేరు థీమ్స్‌తో ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేశారు. జాతీయ స్థాయి ప్రాధాన్యంతో కర్నూలులో జరిగే సభకు స్వయంగా ప్రధాని హాజరవుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీశైలం, కర్నూలులో మోదీ పర్యటన కోసం పది రోజులుగా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు బుధవారం అధికారులు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భద్రతా ఏర్పాట్లను డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రధాని పర్యటన ఇలా...
ప్రధాని మోదీ తొలుత శ్రీశైలానికి చేరుకుని జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలు దర్శించుకుంటారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్నూలు నగర శివారులోని రాగ మయూరి గ్రీన్ హిల్స్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లతో కలసి అక్కడికి సమీపంలోనే ఉన్న సభా వేదిక వద్దకు వెళతారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న డ్రోన్ సిటీకి మోదీ శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు రూ.13 వేల కోట్లకుపైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం... ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ సభలో పాల్గొంటారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు, ప్రయోజనాలను వివరిస్తారు. మొత్తంగా ఆరున్నర గంటలపాటు మోదీ పర్యటన ఉంటుంది.
చంద్రబాబు సమీక్ష
ప్రధాని మోదీ కర్నూలు, శ్రీశైలం పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు బుధవారం మంత్రులు, కర్నూలు, నంద్యాల ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ‘‘గూగుల్ ప్రాజెక్టు రాష్ట్రానికి రావడంలో ప్రధాని మోదీ చొరవ ఎంతో ఉంది. ఈ సమయంలో జరుగుతున్న పర్యటనను దిగ్విజయం చేసి కృతజ్ఞత చాటుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చేలా చూడాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి’’ అని చంద్రబాబు ఆదేశించారు. పీఎం ప్రోగ్రాం స్పెషల్ ఆఫీసర్ వీరపాండియన్, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేపీ నూరుల్ క్వామర్‌లు ప్రధాని పర్యటన ఏర్పాట్లను సీఎంకు వివరించారు. ‘‘పార్కింగ్ ప్రదేశాల్లో టాయిలెట్స్, విద్యుత్, తాగునీరు, హెల్ప్ డెస్క్‌లు, సభకు వచ్చిన వారికోసం 20 పడకలు, వీఐపీలకు మరో పది పడకలతో కూడిన తాత్కాలిక ఆసుపత్రులు, అంబులెన్స్‌లు ఏర్పాటు చేశాం’’ అని తెలిపారు. భద్రతా ఏర్పాట్ల గురించి ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరించారు.
భద్రతా ఏర్పాట్లు సమీక్షించిన డీజీపీ
ప్రధాని మోదీ కర్నూలు పర్యటన భద్రతా ఏర్పాట్లను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గూగుల్ జియో మ్యాప్ ద్వారా ప్రధాని పర్యటన మినిట్ టు మినిట్, రూట్ మ్యాప్, సభా ప్రాంగణం, హెలిప్యాడ్‌లు, పార్కింగ్ స్థలాల్లో బందోబస్తు వివరాలు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ డీజీపీకి వివరించారు. అదనపు డీజీ స్థాయి నుంచి ఎస్‌ఐ, కానిస్టేబుల్ వరకు 7,500 మందికి పైగా పోలీసులు పర్యవేక్షణ, బందోబస్తు, భద్రతా విధుల్లో పొల్గొంటున్నారు.
మంత్రులంతా అక్కడే...
ప్రధాని మోదీ పర్యటన విజయవంతం చేయడం కోసం రాష్ట్ర మంత్రులంతా కర్నూలుకు చేరుకున్నారు. తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్, ఎన్‌ఎండీ ఫరూక్, నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, వంగలపుడి అనిత, గుమ్మడి సం ధ్యారాణి, రాంప్రసాద్‌రెడ్డి, సహా టీడీపీ రాష్ట్ర అధ్యక్షు డు పల్లా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
- కర్నూలు, ఆంధ్రజ్యోతి
ఇదీ డ్రోన్ సిటీ...
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడు వద్ద 350 ఎకరాల్లో డ్రోన్ సిటీ తొలిదశను చేపట్టాలని రాష్ట్ర డ్రోన్ కార్పొరేషన్ నిర్ణయించింది. డ్రోన్ సిటీ ఏర్పాటుతో దాదాపు రూ.1,000 కోట్లు పెట్టుబడులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఏటా రూ.3,000 కోట్ల మేర ఆదాయం వస్తుందని, డ్రోన్‌సిటీ నుంచి దాదాపు రూ.1,000 కోట్లకు పైగా ఎగుమతులు ఉంటాయని వివరించారు. దీనిద్వారా ప్రత్యక్షంగా 15వేల మందికి, పరోక్షంగా 25వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంటున్నారు. డ్రోన్ సిటీలో ఇన్నోవేషన్, ఆర్‌అండ్‌డీ హబ్‌తో పాటు మాన్యుఫాక్చరింగ్, ఎమ్మార్వో (మెయింటెనెన్స్, రిపేర్, ఆపరేషన్), టెస్టింగ్, సర్టిఫికేషన్ సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు.
ప్రధాని పర్యటన సాగేది ఇలా...
గురువారం ఉదయం 7:50: ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరుతారు.
10:20: కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:25: ఎంఐ-17 హెలికాప్టర్‌లో బయలుదేరి శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
11:15: సున్నిపెంట నుంచి రోడ్డుమార్గంలో శ్రీశైలంలోని భ్రమరాంబ అతిథి గృహానికి చేరుకుని, కొద్దిసేపు విరామం తీసుకుంటారు.
11:45: శ్రీశైలం ప్రధాన ఆలయానికి చేరుకుని... భ్రమరాంబ, మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు.
1:35: సున్నిపెంట నుంచి హెలికాప్టర్‌లో కర్నూలుకు బయలుదేరతారు.
2:20: కర్నూలు నగర శివారులో రాగమయూరి గ్రీన్‌హిల్స్‌లో సభా ప్రాంగణం సమీపంలో ఏర్పా టు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
2:30 నుంచి 4:05: అభివృద్ధి పనులకు శంకుస్థాపన, బహిరంగ సభలో పాల్గొంటారు.
4:20: హెలికాప్టర్‌లో కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు.
4:45: విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు.
ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలి
మూడు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేయాలి
నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని నేతలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రధాని శ్రీశైలం, కర్నూలు పర్యటనల సందర్భంగా నాయకులను అప్రమ త్తం చేసేందుకు ఆయన గురువారం మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లా కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఏపీలో గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలో మంగళవారం గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ఇది చారిత్రాత్మక నిర్ణయం. ఏపీకి గూగుల్ డేటా హ బ్ రావటంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్ చొరవ ఉంది. గూగుల్ రావడానికి ఐటీ మంత్రి లోకేశ్ ప్రధాన ప్రాత పోషించారు. దేశంలోనే ఇది అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. విభజనతో ఎదుర్కొన్న ఇబ్బందులకంటే గత పాలకులు చేసిన విధ్వంసంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. పాలనా పరంగా అనేక తప్పులు చేశారు. వాటిని సరిచేయడానికి చాలా సమయం పట్టింది. యోగాంధ్ర, అమరావతి రీస్టార్ట్ లాంటి కార్యక్రమాలను విజయవంతం చేశాం. ఇప్పుడు ప్రధాని మోదీ పాల్గొనే సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్నీ విజయవంతం చేద్దాం. రాయలసీమకు పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నాం. సీమ జిల్లాలు ఉద్యానవన పంటలకు కేంద్రంగా మారాయి. రాష్ట్రంలో పోర్టులు, రైల్వే కనెక్టివిటీ ద్వారా సంపద సృష్టి జరుగుతుంది. గత పాలకులు సీమలోని సాగునీటి ప్రాజెక్టులను కనీసం రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. రాయలసీమను టూరిజం డెస్టినేషన్‌గా మారుస్తాం. తిరుపతి, శ్రీశైలం, గండికోట లాంటి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నాం. హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఏపీ సాధనే లక్ష్యంగా మనం అంతా పనిచేయాలి. గురువారం కూడా ప్రధాని రూ.13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కర్నూలులో జీఎస్టీపై ప్రధాని సభకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. కూటమి నేతలంతా కలసి ఓ మోడల్ స్టేట్‌గా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపాలి. ప్రధాని మోదీ రాకతో శ్రీశైల క్షేత్రానికి ఒక మహర్దశ రాబోతుంది. తిరుమల తర్వాత జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఉన్న క్షేత్రంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తాం’ అని చంద్రబాబు అన్నారు. గూగుల్ సంస్థను ఏపీకి తీసుకురావడంలో సీఎం, మంత్రి లోకేశ్ కృషి ప్రశంసనీయమని టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నేతలు పలువురు పేర్కొన్నారు.
ఏపీకి వస్తున్నా.. తెలుగులో మోదీ ట్వీట్
ఏపీ పర్యటనపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. తన పర్యటన వివరాలను వెల్లడిస్తూ బుధవారం ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. ‘‘అక్టోబరు 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత, కర్నూలులో రూ.13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలకు సంబంధించినవి’’ అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.