Share News

Double Benefit for Farmers: అన్నదాతకు డబుల్‌ ధమాకా

ABN , Publish Date - Nov 19 , 2025 | 06:03 AM

ఏపీ రైతులకు ఇదో డబుల్‌ ధమాకా! పీఎం కిసాన్‌ అన్నదాత సుఖీభవ’ పథకం డబ్బులు బుధవారం రైతుల బ్యాంకు ఖాతాల్లో పడనున్నాయి...

Double Benefit for Farmers: అన్నదాతకు డబుల్‌ ధమాకా

  • నేడు పీఎం కిసాన్‌-అన్నదాత సుఖీభవ సొమ్ము విడుదల

  • ఒక్కో లబ్ధిదారుకు 7 వేల రూపాయల జమ

  • కేంద్రం రూ.2 వేలు.. ఏపీ సర్కారు రూ.5 వేలు

  • రాష్ట్రవ్యాప్తంగా 47 లక్షల ఖాతాలకు 3,135 కోట్ల జమ

  • కోయంబత్తూరులో ప్రధాని మోదీ, కమలాపురంలో సీఎం చంద్రబాబు నిధుల విడుదల!

అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఏపీ రైతులకు ఇదో డబుల్‌ ధమాకా! ‘పీఎం కిసాన్‌- అన్నదాత సుఖీభవ’ పథకం డబ్బులు బుధవారం రైతుల బ్యాంకు ఖాతాల్లో పడనున్నాయి. పీఎం కిసాన్‌ 21వ విడత సొమ్ము రూ.2వేల చొప్పున కేంద్రం, అన్నదాత సుఖీభవ రెండో విడత సొమ్ము రూ.5వేల చొప్పున రాష్ట్రప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నాయి. దీంతో ఒకే రోజు ఒక్కో రైతు కుటుంబానికి రూ.7వేల చొప్పున లబ్ధి చేకూరనున్నది. పీఎం కిసాన్‌- అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం 46,85,838 రైతు కుటుంబాలకు రూ.3,135కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్నాయి. ప్రస్తుత రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92కోట్లు, కేంద్రం వాటా రూ.972.09 కోట్లు ఉంటుంది. బుధవారం కోయంబత్తూరులో పీఎం కిసాన్‌ నిధుల్ని ప్రదాని మోదీ విడుదల చేయనున్న నేపథ్యంలో అదే సమయంలో అన్నదాత సుఖీభవ సొమ్మును వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 10వేలపైగా రైతు సేవా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

ఇచ్చిన మాట ప్రకారం..

గతేడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘సూపర్‌సిక్స్‌’లో భాగంగా ఏటా రైతులకు రూ.20వేల ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కేంద్రం పీఎం కిసాన్‌ డబ్బులు ఎప్పుడిస్తే.. అప్పుడే అన్నదాత సుఖీభవ నిధులు చెల్లిస్తామని ప్రకటించారు. ఆ మేరకు గత ఆగస్టు 2న ప్రధాని మోదీ పీఎం కిసాన్‌ నిధులు విడుదల చేయగా, అదే రోజు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో సీఎం ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలి విడత కింద 46.86లక్షల మంది రైతులకు రూ.3,174.43కోట్లు విడుదల చేశారు. అయితే అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన మండలాల్లో మినహా మిగతా రాష్ట్రమంతా ఒకేసారి రైతులకు సొమ్ము చెల్లించారు. ఆరోజు సాయంత్రానికి కల్లా 99.98ు మంది రైతుల ఖాతాలకు నగదు జమ చేశారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగిశాక.. ఆయా ప్రాంతాల రైతులతో పాటు గ్రీవెన్స్‌లో అర్హులని తేలిన వారితో కలిపి, 1,04,107 మంది రైతులకు ఆగస్టు 20న అన్నదాత సుఖీభవ డబ్బులు జమ అయ్యాయి. అన్నదాతకు డబుల్‌ సంక్షేమం.. రెట్టింపు సంతోషం.. అంటూ గత ప్రభుత్వం ఇచ్చిన రూ. 13,500 కన్నా రూ.6,500 అదనంగా కలిపి, అర్హులైన రైతులకు కూటమి ప్రభుత్వం లబ్ధి చేకూర్చుతోంది.


ఇది రెండో విడత సొమ్ము

ఈ పథకంలో తొలి విడత రూ.7వేలు, రెండో విడత రూ.7వేలు, మూడో విడత రూ.6వేలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే! ఇందులో భాగంగా రెండో విడుదల సుఖీభవ నిధులు ఇప్పుడు జమ కానున్నాయి. రెండు విడతల్లో కలిపి ఈ పథకం కింద మొత్తం రూ6,309.44కోట్లు ప్రభుత్వం అందించినట్లవుతోంది.

రైతులు చనిపోయి ఉంటే వారి వారసులకు..

ఈ పథకానికి అర్హులైన రైతులు ఎవరైనా చనిపోయి ఉంటే.. వారి వారసులకు డెత్‌ మ్యుటేషన్‌ చేసి, లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలని సూచించారు. దీనిపై సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబరు అందుబాటులో ఉంచాలని, సొమ్ము అందుకునే రైతుల సెల్‌ఫోన్లకు ఒక రోజు ముందే మెస్సేజ్‌లు వెళ్లాలని నిర్దేశించారు. అలాగే, తొలి విడత అన్నదాత సుఖీభవ సొమ్ము జమ కాని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, అర్హులకు పథకం సొమ్ము జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాక, అర్హత ఉండి.. లబ్ధి చేకూరని రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకుని, వాటిని పరిశీలించి, పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.

Updated Date - Nov 19 , 2025 | 06:03 AM