Share News

పీఎం జన్‌మన్‌ పనులు వేగవంతం

ABN , Publish Date - Jul 15 , 2025 | 12:50 AM

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న ప్రధాన మంత్రి జన్‌మన్‌ యోజన పనులను వేగంగా పూర్తిచేయాలని కేంద్ర గిరిజన వ్యవహారాల కార్యదర్శి విభూ నాయర్‌ ఆదేశించారు.

పీఎం జన్‌మన్‌ పనులు వేగవంతం
కేంద్ర కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌, జేసీ అభిషేక్‌గౌడ

కేంద్ర గిరిజన వ్యవహారాల కార్యదర్శి విభూ నాయర్‌ ఆదేశం

పాడేరు,జూలై 14(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న ప్రధాన మంత్రి జన్‌మన్‌ యోజన పనులను వేగంగా పూర్తిచేయాలని కేంద్ర గిరిజన వ్యవహారాల కార్యదర్శి విభూ నాయర్‌ ఆదేశించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన జిల్లా కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, ఐసీడీఎస్‌, వైద్య ఆరోగ్యశాఖ, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల పురోగతిపై సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా విభూ నాయర్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీ భవనాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని, గృహ నిర్మాణాలు, జల్‌జీవన్‌ మిషన్‌ పనులు, రోడ్లు, మల్టీపర్పస్‌ భవనాల నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలన్నారు. ఆది కర్మయోగి కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని, వాటికి అవసరమైన మాస్టర్‌ ట్రైనర్లను ఎంపిక చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రధాన మంత్రి గ్రామసడక్‌ యోజనలో మొదటి దశలో 85 రోడ్లు మంజూరయ్యాయని, 43 పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. రెండో దశలో 61 పనులు మంజూరు కాగా, 21 పనులు టెండరు దశలో ఉన్నాయన్నారు. 118 అంగన్‌వాడీ భవనాలు, 53 హాస్టల్‌ భవనాలు మంజూరయ్యని తెలిపారు. ఆయా పనులన్నీ నవంబరు నాటికి పూర్తి చేస్తామన్నారు.

ఆది కర్మయోగి పనులపై కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

కేంద్ర గిరిజన వ్యవహారాల కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ అనంతం జిల్లాలోని 420 పంచాయతీల పరిధిలో ఆది కర్మయోగి ప్రోగ్రాం అమలుపై సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. వారితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఆది కర్మయోగిలో భాగంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, అంగన్‌వాడీ సేవలు సక్రమంగా అందించేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. యువతకు ఉపాధి శిక్షణలు, నైపుణ్యాల పెంపు, ఇంటర్నెట్‌ సదుపాయాలు, సృజనాత్మకత పెంపొందించే కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే. అభిషేక్‌గౌడ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌ నంద్‌, జిల్లా ఉద్యానవనాధికారి ఎ.రమేశ్‌కుమార్‌రావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, డివిజనల్‌ పంచాయతీ అధికారి పీఎస్‌.కుమార్‌, పంచాయతీరాజ్‌ ఈఈ టి.కొండయ్యపడాల్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి టి.విశ్వేశ్వర నాయడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 12:50 AM